పేరులో అక్షరం మార్చి మళ్లీ అదే దందా
ABN , Publish Date - Feb 23 , 2026 | 02:58 AM
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు పేర్లు మార్చుకుని మళ్లీ జనం జేబులకు చిల్లులు పెడుతున్నాయి. చట్టాల్లోని లొసుగులను అడ్డం పెట్టుకుని నకిలీ వెబ్‌సైట్ల ద్వారా విదేశాల నుంచి యాప్‌ను నిర్వహిస్తూ దేశం...
ఆగని ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల జోరు
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు పేర్లు మార్చుకుని మళ్లీ జనం జేబులకు చిల్లులు పెడుతున్నాయి. చట్టాల్లోని లొసుగులను అడ్డం పెట్టుకుని నకిలీ వెబ్‌సైట్ల ద్వారా విదేశాల నుంచి యాప్‌ను నిర్వహిస్తూ దేశం లో దందా కొనసాగిస్తున్నాయి. తెలంగాణలో ఆన్‌లైన్ బెట్టింగ్‌పై పూర్తిస్థాయి నిషేధం అమల్లో ఉన్నప్పటికీ కళ్లముందు కనిపిస్తున్న వందలాది ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్లను కట్టడి చేయలేని నిస్సహా య స్థితిలో పోలీసు యంత్రాగం ఉండటం ఆందోళ నకరం. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు సంబంధించి ఫిర్యాదులు వచ్చినపుడు తక్షణమే స్పందించి వాటిని బ్లాక్ చేయిస్తున్న తెలంగాణ పోలీసులు వాటి నిర్వాహకులను మాత్రం పట్టుకోలేకపోతున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను నిర్వహించేవారు విదేశాల్లో ఉంటూ ఒక వెబ్‌సైట్‌ను బ్లాక్ చేస్తే దానికి దగ్గరగా ఉండే పేరుతో మరో నకిలీ వెబ్‌సైట్‌ను రూపొందించి ప్రజల్లోకి వదులుతున్నా రు. ఉదాహరణకు 1ఎక్స్‌బెట్‌ను కేంద్రం బ్లాక్ చేయగా తాజాగా అదే కంపెనీ 1ఎక్స్‌బాట్‌గా తమ కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. ఇలాగే విఎల్‌బుక్.కో అనే గేమింగ్ సైట్‌ను సైబర్ క్రైం అధికారులు గతంలో బ్యాన్ చేయించారు. అయితే, అదే కంపెనీ ప్రస్తుతం విఎల్‌బుక్.ఓఆర్‌జీ, విఎల్ బుక్.క్లబ్ పేరిట అందు బాటులోకి వచ్చింది. ఇదే పంథాను తెలుగు365, ధానిబుక్ 365 అనుసరిస్తు న్నాయి. ఇప్పటికే బెట్టింగ్ యాప్‌లపై కేసులు నమోదు చేసిన సీఐడీ, సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు.. భిన్నకోణాల కారణంగా అసలైన ని ర్వాహకుల వద్దకు చేరలేకపోతున్నారు. దీంతో కేసు ల దర్యాప్తు ముందుకు కదలని పరిస్థితి ఏర్పడింది.