Share News

‘ఆన్‌లైన్‌’ పేరిట.. ‘నగదు’ దొంగ!

ABN , Publish Date - Apr 30 , 2026 | 05:09 AM

అతను బెట్టింగ్‌లకు బానిసై, అప్పులపాలైన సరికొత్త ‘నగదు’ దొంగ.. ఏటీఎం కేంద్రాల్లో నగదు డిపాజిట్‌ మెషీన్‌ (సీడీఎం)లు ఉన్నచోట అడ్డా వేయడం..

‘ఆన్‌లైన్‌’ పేరిట.. ‘నగదు’ దొంగ!

  • ఆన్‌లైన్‌లో సొమ్ము పంపినట్టు నమ్మించి..నగదుతో ఉడాయించే ఘరానా దొంగ

  • నగదు డిపాజిట్‌ (సీడీఎం) కేంద్రాల వద్ద అడ్డా

  • బస, నిద్ర బస్‌స్టేషన్లలోనే.. పగలంతా దోపిడీలు

  • ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు బానిసై.. అప్పుల పాలై..దొంగగా మారిన ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌

  • పట్టించిన ర్యాపిడో బైక్‌ బుకింగ్‌

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): అతను బెట్టింగ్‌లకు బానిసై, అప్పులపాలైన సరికొత్త ‘నగదు’ దొంగ.. ఏటీఎం కేంద్రాల్లో నగదు డిపాజిట్‌ మెషీన్‌ (సీడీఎం)లు ఉన్నచోట అడ్డా వేయడం.. నగదు డిపాజిట్‌ చేయడానికి వచ్చినవారిని గుర్తించి, తనకు డబ్బులిస్తే ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్‌ చేస్తానని నమ్మించడం.. సొమ్ము ట్రాన్స్‌ఫర్‌ చేసినట్టుగా నకిలీ మెసేజీ చూపించి డబ్బుతో ఉడాయించడం.. ఇలా ఒకటీరెండు కాదు గత ఎనిమిదేళ్లలో 81 దొంగతనాలు చేశాడు. చివరికి ఓ దొంగతనం తర్వాత ర్యాపిడోలో బైక్‌ బుక్‌ చేసుకుని వెళ్లి.. హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్‌ పోలీసులకు దొరికిపోయాడు. ఖైరతాబాద్‌ జోడ్‌ డీసీపీ శిల్పవల్లి బుధవారం ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.


బస్‌స్టేషన్లలోనే బస చేస్తూ..

ఏపీలోని కోనసీమ జిల్లా రాజోలు మండలం రుద్రవారిమెరక గ్రామానికి చెందిన ఇంటిపల్లి రామారావు అలియాస్‌ శ్రీరామ్‌ అలియాస్‌ రాము (31) ఇంజనీరింగ్‌ పూర్తిచేసి కొంతకాలం టెక్‌ మహీంద్రాలో ఉద్యోగం చేశాడు. ఆ సమయంలోనే ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు అలవాటుపడి, క్రెడిట్‌ కార్డుల్లోని లిమిట్‌ను పూర్తిగా వాడేయడంతోపాటు దొరికిన చోటల్లా అప్పులు చేశాడు. ఈ క్రమంలో నగదు డిపాజిట్‌ మెషీన్ల వద్ద జనాన్ని మోసం చేయడానికి పథకం వేశాడు. హైదరాబాద్‌లో ఎక్కడా అద్దెకు ఉండకుండా.. సికింద్రాబాద్‌ జూబ్లీ బస్టాండ్‌లోనో, డార్మెటరీలోనో రాత్రిపూట నిద్రించేవాడు. పగలు బాగా రద్దీగా ఉండే సీడీఎం కేంద్రాలను గుర్తించి తన పథకాన్ని అమలు చేసేవాడు. నగదు డిపాజిట్‌ చేయడానికి వచ్చి క్యూలో ఉన్నవారితో మాటకలిపేవాడు. తనకు నగదు ఇస్తే.. ఆన్‌లైన్‌లో నెఫ్ట్‌ ద్వారా బ్యాంకు ఖాతాకు డబ్బులు బదిలీ చేస్తానని నమ్మించేవాడు. అలా నగదు తీసుకుని, తన సెల్‌ఫోన్‌లో వారి ఖాతా వివరాలు నమోదు చేస్తున్నట్టు నమ్మించి, సొమ్ము బదిలీ అయినట్టు నకిలీ మెసేజీ చూపించేవాడు. నగదు తీసుకుని ఉడాయించేవాడు. అలా ఏప్రిల్‌ 22న కోఠిలోని స్టేట్‌బ్యాంకు సీడీఎంలో రూ.లక్ష డిపాజిట్‌ చేయడానికి వెళ్లిన సునీత అనే మహిళను మోసం చేశాడు. ఆమె ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. హైదరాబాద్‌ నగరం పరిధిలో ఇటీవల ఇలాంటి 8 కేసులు నమోదైనట్టు తేల్చారు. సీడీఎం కేంద్రం వద్ద సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. నిందితుడు ర్యాపిడో బైక్‌ బుక్‌ చేసుకుని సికింద్రాబాద్‌ జూబ్లీ బస్‌స్టేషన్‌కు, అక్కడి నుంచి మరో ర్యాపిడో బైక్‌పై నారాయణగూడ స్టేట్‌బ్యాంకు ఏటీఎం వద్దకు వెళ్లినట్టు వెళ్లినట్టు గుర్తించారు. ఆ ప్రాంతాల్లో నిఘాపెట్టి రామారావును పట్టుకున్నారు. నిందితుడి నుంచి రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, బ్యాంకులో ఉన్న రూ.2.40 లక్షలు ఫ్రీజ్‌ చేశామని పోలీసులు తెలిపారు. 2018 నుంచి ఇప్పటివరకు ఏపీ, తెలంగాణలో కలిపి 81 చోరీలు చేసినట్టు గుర్తించామని వెల్లడించారు. 2019లో కూకట్‌పల్లిలో, 2022లో సుల్తాన్‌బజార్‌లో, 2024లో మధురానగర్‌ పోలీసులకు చిక్కి అరెస్టయినా.. బెయిల్‌పై బయటికి వచ్చి అదే తరహా దోపిడీలను కొనసాగిస్తున్నట్టు తెలిపారు.

Updated Date - Apr 30 , 2026 | 05:09 AM