Share News

ఒక్క ఓటు తేడా.. మూడుసార్లు కౌంటింగ్‌

ABN , Publish Date - Feb 15 , 2026 | 07:23 AM

పాలమూరు కార్పొరేషన్‌ పరిధిలోని 53వ డివిజన్‌లో విజయం ఇద్దరు అభ్యర్థుల మధ్య దోబూచులాడింది.

ఒక్క ఓటు తేడా.. మూడుసార్లు కౌంటింగ్‌

  • మొదటి సారి లెక్కింపులో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపు

  • మళ్లీ లెక్కించగా బీజేపీ అభ్యర్థికి ఒక ఓటు ఆధిక్యం

  • మూడోసారి లెక్కింపులో బీజేపీకే ఒక ఓటు ఎక్కువ

  • పాలమూరులోని 53వ డివిజన్‌లో ఫలితంపై ఉత్కంఠ

  • శనివారం తెల్లవారుజామున 3వరకు కౌంటింగ్‌

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 14 (ఆంధజ్యోతి): పాలమూరు కార్పొరేషన్‌ పరిధిలోని 53వ డివిజన్‌లో విజయం ఇద్దరు అభ్యర్థుల మధ్య దోబూచులాడింది. తొలుత కాంగ్రెస్‌ అభ్యర్థి రాఘవేందర్‌ ఒక్క ఓటు మెజారిటీతో బీజేపీ అభ్యర్థి రమేశ్‌కుమార్‌పై విజయం సాధించారు. రాఘవేందర్‌కు 816 ఓట్లు రాగా, రమేశ్‌కుమార్‌కు 815 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి రీకౌంటింగ్‌కు డిమాండ్‌ చేయగా, అధికారులు చేయలేదు. కాసేపు గొడవ జరిగింది. అనంతరం కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లను మాత్రమే తిరిగి లెక్కించారు. ఇందులో కాంగ్రెస్‌ అభ్యర్థికి 2 ఓట్లు పెరిగి మొత్తం ఓట్ల సంఖ్య 818కి చేరింది. బీజేపీ అభ్యర్థికి 4 ఓట్లు పెరిగి మొత్తం ఓట్ల సంఖ్య 819కి పెరిగింది. అంటే ఈసారి బీజేపీ అభ్యర్థికి ఒక ఓటు ఆధిక్యం వచ్చింది. దీంతో, ఈసారి కాంగ్రెస్‌ అభ్యర్థి రీకౌంటింగ్‌కు పట్టబట్టారు. కేవలం తమ ఇద్దరి ఓట్లే కాకుండా 53వ డివిజన్‌లో పోటీలో ఉన్న అందరు అభ్యర్థుల ఓట్లను లెక్కించాలని డిమాండ్‌ చేశారు. దీంతో, అధికారులు నిబంధనల ప్రకారం ఇదే చివరి అవకాశమని, ఎలాంటి ఫలితం వచ్చినా అంగీకరించాలని చెప్పడంతో ఇద్దరు అభ్యర్థులు అంగీకరించారు. మూడోసారి కౌంటింగ్‌లో బీజేపీ అభ్యర్థికి 819ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థికి 818 ఓట్లు వచ్చాయి. ఈ డివిజన్‌లో శుక్రవారం మొదలైన కౌంటింగ్‌ శనివారం తెల్లవారుజామున 3గంటల వరకు సాగింది. అనంతరం బీజేపీ అభ్యర్థి రమేశ్‌కుమార్‌ ఒక ఓటు మెజారిటీతో కాంగ్రెస్‌ అభ్యర్థి రాఘవేందర్‌పై విజయం సాధించినట్లు అధికారులు ధ్రువీకరణ పత్రం జారీ చేశారు.

Updated Date - Feb 15 , 2026 | 07:23 AM