Share News

ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాదానికి ఏడాది

ABN , Publish Date - Feb 22 , 2026 | 05:59 AM

శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పనుల్లో సంభవించిన పెను విషాదానికి ఆదివారంతో ఏడాది పూర్తయింది.

ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాదానికి ఏడాది

  • 2 మృతదేహాలు లభ్యం.. ఆచూకీ లేని ఆరుగురు!

  • 65 రోజుల పోరాటం వృథా

  • షీర్‌ జోన్‌ సవాలుతో నిలిచిన రెస్క్యూ

  • ఏటీఎం టెక్నాలజీతో మళ్లీ మొదలైన పనులు

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పనుల్లో సంభవించిన పెను విషాదానికి ఆదివారంతో ఏడాది పూర్తయింది. 2025 ఫిబ్రవరి 22న జరిగిన ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, వారిలో ఇద్దరి మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. మిగిలిన ఆరుగురి మృతదేహాలు ఇప్పటికీ మట్టి దిబ్బల కిందనే ఉండిపోవడం వారి కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఉమ్మడి నల్గొండ జిల్లా కరువు తీర్చేందుకు ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును చేపట్టారు. ఈ పనుల్లో భాగంగా, దోమలపెంటలో ఉన్న ఇన్‌ లెట్‌ వైపు 13.90 కిలోమీటర్ల వద్ద టీబీఎం (టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌)తో తవ్వకాలు జరుపుతుండగా ఒక్కసారిగా మట్టి దిబ్బలు విరిగిపడ్డాయి. దీంతో ప్రాజెక్టు ఇంజనీర్లు మనోజ్‌కుమార్‌, శ్రీనివా్‌సలతో పాటు కార్మికులు సందీప్‌ సాహు, జగ్టా ఎక్సేస్‌, సంతోష్‌ సాహు, అనుజ్‌ సాహు, సన్నీసింగ్‌, గుర్‌ప్రీత్‌ సింగ్‌ లోపలే చిక్కుకుపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, సింగరేణి బృందాలతో పాటు నేవీ, ఆర్మీ, ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌ వంటి అనేక ఏజెన్సీలను రంగంలోకి దించింది. అత్యాధునికి రోబోలు, గ్రౌండ్‌ పెనెట్రేటింగ్‌ రాడార్లను ఉపయోగించినప్పటికీ ఫలితం దక్కలేదు. విద్యుత్‌ లేకపోవడం, ఊట నీరు రావడం, 400 మీటర్ల మేర మట్టి పేరుకుపోవడంతో సహాయక చర్యలు కష్టతరమయ్యాయి. సుమారు 65 రోజుల పోరాటం తర్వాత మనోజ్‌కుమార్‌, గుర్‌ప్రీత్‌సింగ్‌ల మృతదేహాలు మాత్రమే బయటపడ్డాయి.


ప్రమాద జరిగిన ప్రాంతం షీర్‌ జోన్‌ (అస్థిరమైన భూపొరలు) కావడంతో మరింత ముందుకు వెళ్లడం రెస్క్యూ సిబ్బంది ప్రాణాలకే ముప్పు అని నిపుణులు హెచ్చరించారు. దీంతో ఇన్‌లెట్‌ వైపు మార్గాన్ని సీల్‌ చేసి సహాయక చర్యలను నిలిపివేశారు. కాగా, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.15 లక్షల చొప్పున పరిహారం అందించింది. అయినప్పటికీ తమ వారి మృతదేహాలైనా దొరకలేదని బాధిత కుటుంబ సభ్యులు నేటికీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


రాబోయే రెండేళ్లలో పూర్తి!

మరోవైపు, నిలిచిపోయిన ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఎన్‌జీఆర్‌ఐ ఆధ్వర్యంలో హెలీబార్న్‌ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్‌ సర్వే ద్వారా భూగర్భంలోని మార్పులను గుర్తించి, ప్రమాదకరమైన పాత పద్ధతులకు స్వస్తి పలికారు. సీఎం రేవంత్‌రెడ్డి పర్యవేక్షణలో అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ మెథడ్‌ (ఏటీఎం) ద్వారా డ్రిల్లింగ్‌ అండ్‌ బ్లాస్టింగ్‌ పనులను ఇటీవల ప్రారంభించారు. రాబోయే రెండేళ్లలో మిగిలిపోయిన 9.58 కి.మీ. సొరంగ నిర్మాణాన్ని పూర్తిచేసి, త్వరలోనే ప్రజల సాగునీటి కల నెరవేర్చాలని యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది.

Updated Date - Feb 22 , 2026 | 05:59 AM