ఒకే రాష్ట్రం.. ఒకే యూనిఫామ్..
ABN , Publish Date - Apr 16 , 2026 | 12:38 AM
విద్యార్థుల్లో అందరూ ఒకటే అనే భావం కల్పించే దిశగా ప్రభుత్వం ‘ఒకే రాష్ట్రం.. ఓకే యూనిఫామ్’ విధానాన్ని వచ్చే కొత్త విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తేవడానికి చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వం
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
విద్యార్థుల్లో అందరూ ఒకటే అనే భావం కల్పించే దిశగా ప్రభుత్వం ‘ఒకే రాష్ట్రం.. ఓకే యూనిఫామ్’ విధానాన్ని వచ్చే కొత్త విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తేవడానికి చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. మరో వారం రోజుల్లో విద్యా సంవత్సరం ముగిసిపోనుంది. వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థులను సర్కార్ పాఠశాల వైపు మళ్లించడానికి 21 వస్తువులతో ప్రత్యేక కిట్లను విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పేర్లతో ఉన్న పాఠశాలలను ప్రభుత్వమే నిర్వహిస్తున్నా వేర్వేరు రంగులు, డిజైన్లతో కలిగిన యూనిఫామ్ అమలు అవుతోంది. ఈ తేడాను తొలగించే దిశగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ ఒకే రకమైన డ్రెస్ కోడ్ ఉండే విధంగా ఒకే రంగు, ఒకే డిజైన్‌తో యూనిఫామ్ అమలు చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వచ్చే విద్యా సంవత్సరం మధ్యాహ్నం భోజనంతో పాటు అల్పాహారం కూడా విద్యార్థులకు అందించే కార్యక్రమం కూడా మొదలుకానుంది. ఒకే రకమైన యూనిఫామ్, 21 వస్తువులతో విద్యార్థులకు అందించే ప్రత్యేక కిట్ల ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 535 పాఠశాలల్లో 46,598 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. రెండు ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 109 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 13 కేజీబీవీ, 7మోడల్ స్కూల్, 337 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు, 38 మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ పాఠశాలలు, మూడు మండల పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఒకటి ఆర్‌బీఎస్, ఒకటి డీఎన్‌టీ పాఠశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో 38,629 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో బాలురు 18,179 మంది, బాలికలు 20,450 మంది ఉన్నారు. 21 రెసిడెన్షియల్ పాఠశాలలో 7,762 మంది విద్యార్థులు ఉండగా, బాలురు 2,583 మంది, బాలికలు 5,179 మంది ఉన్నారు. విద్యార్థులందరికీ ఒకేరకమైన యూనిఫామ్ అందించే కార్యక్రమం చేపట్టారు. పాఠశాలలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం చేస్తున్న చర్యల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి కార్పొరేట్ స్థాయి పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ప్రారంభం రోజున విద్యార్థులకు స్కూల్ కిట్లు
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ ఒకే రకమైన డ్రెస్ కోడ్‌తో పాటు 21 వస్తువులతో కూడిన ప్రత్యేకమైన కిట్లను అందించనున్నారు. పాఠశాల పునఃప్రారంభం రోజున మూడు జతల యూనిఫాం, రెండు జతల సాక్సు, స్కూల్ బ్యాగ్, బెల్ట్, టై, నోట్‌బుక్స్, టెస్ట్‌బుక్స్, వర్క్‌బుక్స్, పెన్నులు, పెన్సిల్, ఎరేజర్, షార్పనర్, జామెంట్రీ బాక్స్, డిక్షనరీ వస్తువులతో పాటు వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు ట్రాక్‌సూట్, నైట్‌డ్రెస్ లాంటి దుస్తులతోపాటు బెడ్‌షీట్, బ్లాంకెట్, టవల్, ప్లేట్, గ్లాస్, కప్పుస్పూన్, ట్రంక్‌బాక్స్, స్టేషనరీ కిట్‌లాంటి వస్తువులు కూడా అందిస్తారు. ప్రభుత్వం ఇంకా ఏ విధంగా అందించబోతుందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వ మాత్రం వచ్చే విద్యాసంవత్సరంలో యూనిఫామ్ విద్యార్థులకు అందించే కిట్ల పంపిణీపై పకడ్బందీగా ఏర్పాటు చేస్తోంది. పేద మధ్య తరగతి కుటుంబాలకు మాత్రం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఉపశమనం కలిగేలా ఉన్నాయని భావిస్తున్నారు.