Share News

మండలానికో సోలార్‌ గ్రామం!

ABN , Publish Date - Mar 26 , 2026 | 05:16 AM

రాష్ట్రంలో ప్రతి మండలంలో ఒక పల్లెను సోలార్‌ గ్రామంగా మార్చే ప్రతిపాదనలను పరిశీలించి, నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.

మండలానికో సోలార్‌ గ్రామం!

  • ప్రతిపాదనలను పరిశీలిస్తున్నాం..

  • 81 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా సోలార్‌ రూఫ్‌టాప్‌ అమలు: భట్టి

హైదరాబాద్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రతి మండలంలో ఒక పల్లెను సోలార్‌ గ్రామంగా మార్చే ప్రతిపాదనలను పరిశీలించి, నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. బుధవారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఆయన సభ్యులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున గ్రీన్‌ ఎనర్జీని ఉత్పత్తి చేయాలనే యోచనతో సర్కారు ఉందని, దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా 81 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా సోలార్‌ రూఫ్‌టాప్‌ను అమలు చేస్తున్నామని, 40,349 ఇళ్లలో 2 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సౌరఫలకాలను పీఎం సూర్యఘర్‌ ముఫ్త్‌ బిజ్లీ యోజనలో ఏర్పాటు చేశామన్నారు. ఆ తర్వాత పీఎం కుసుమ్‌ కింద కాంపోనెంట్‌-సీలో 7.5 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సౌర ఫలకాలు ఏర్పాటు చేసి, 16,708 సోలార్‌ వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్తు సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ఇళ్లకు సోలార్‌ రూఫ్‌టా్‌పకు ఒక యూనిట్‌కు రూ.60 వేలు కేంద్ర ఆర్థిక సాయం లభిస్తుందని, అదే పీఎం కుసుమ్‌ కాంపోనెంట్‌-సీలో మొత్తం ప్రాజెక్టుకు వ్యయంలో 30 శాతం కేంద్రం సబ్సిడీగా అందిస్తున్నామన్నారు. ఎంపిక చేసిన గ్రామాల్లో 6 నెలల్లోపు పథకాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు.

Updated Date - Mar 26 , 2026 | 05:16 AM