Share News

రెండు చోట్ల ఓట్లు చట్ట విరుద్ధం

ABN , Publish Date - Jun 30 , 2026 | 05:28 AM

తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ కొనసాగుతున్న వేళ ఓటర్లకున్న సందేహాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి...

రెండు చోట్ల ఓట్లు చట్ట విరుద్ధం

  • ఏదో ఒకచోట ఓటు రద్దు చేయాల్సిందే

  • సీఈఓ సుదర్శన్‌రెడ్డి స్పష్టీకరణ

హైదరాబాద్‌, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ కొనసాగుతున్న వేళ ఓటర్లకున్న సందేహాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) సుదర్శన్‌రెడ్డిని ఆంధ్రజ్యోతి సంప్రదించింది. రెండు రాష్ట్రాల్లో ఓటరు జాబితాలో పేరుంటే ఏం చేయాలి? ఎక్కడ రద్దు చేసుకోవాలి? వంటి పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

వేర్వేరు రాష్ట్రాల్లో ఓటు ఉండవచ్చా?

భారత ఎన్నికల చట్టాల ప్రకారం ఒక వ్యక్తికి ఒక నియోజకవర్గంలో, ఒక చోట మాత్రమే ఓటు హక్కు ఉండాలి. ఏ వ్యక్తి అయినా ఒక ఎన్నికలో ఒకసారి మాత్రమే ఓటేయాలి. రెండు చోట్ల ఓటు వేయడం నేరంగా పరిగణిస్తారు. ఒకేసారి రెండు రాష్ర్టాల్లో ఓటరు జాబితాలో పేరు ఉండటం చట్టవిరుద్ధం.

రెండు రాష్ట్రాల్లో ఓట్లు ఉంటే గుర్తిస్తారా?

సర్‌ ప్రక్రియలో భాగంగా ఓటర్ల వివరాలను సమగ్రంగా పరిశీలిస్తారు. ఆధార్‌(స్వచ్ఛందంగా సమర్పించినట్లయితే), ఎపిక్‌ నంబర్‌, పేరు, పుట్టిన తేదీ, కుటుంబ వివరాలు పరిశీలించి డూప్లికేట్‌ నమోదులను గుర్తిస్తారు. ఒకవేళ గుర్తించినా వెంటనే తొలగించరు. ముందుగా సంబంధిత ఓటరుకు నోటీసు ఇచ్చి వివరణ కోరతారు. అవసరమైతే బూత్‌ లెవెల్‌ ఆఫీసర్‌ ద్వారా క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహిస్తారు. అనంతరం చట్టపరమైన విధానాన్ని అనుసరించి నిర్ణయం తీసుకుంటారు.

ఏ రాష్ట్రంలోని ఓటు తొలగిస్తారు..?

సాధారణంగా ఓటరు ప్రస్తుతం నివసిస్తున్న చిరునామా ఆధారంగా ఓటును కొనసాగిస్తారు. పాత చిరునామాలో ఉన్న ఓటును తొలగించే చర్యలు తీసుకుంటారు. కొత్త రాష్ట్రంలో ఓటు నమోదు చేసుకునేటప్పుడు పాత రాష్ట్రంలో తన పేరు తొలగించాలని ఓటరు స్వచ్ఛందంగా తమ దరఖాస్తులో పేర్కొనాలి.

2రాష్ట్రాల్లో ఓటు ఉంటే ఏం చేయాలి?

ఓటరు తన వివరాలను పరిశీలించి, ప్రస్తుతం నివసిస్తున్న రాష్ట్రంలో మాత్రమే ఓటు కొనసాగేటట్లు చూసుకోవాలి. పాత రాష్ట్రంలోని ఓటును తొలగించేందుకు దరఖాస్తు సమర్పించడం మంచిది. చాలా సందర్భాల్లో ఎన్నికల అధికారుల మధ్య సమాచార మార్పిడి ద్వారా తొలగింపు ప్రక్రియ జరుగుతుంది. ఓటరు కూడా తన పేరు తొలగించారో లేదో నిర్థారించుకోవాలి.

2002లో హైదరాబాద్‌లో, 2018లో విజయవాడలో ఓటు ఉందనకుందాం. మళ్లీ హైదరాబాద్‌లోనే ఓటు పొందాలంటే ఏం చేయాలి?

ఒక వ్యక్తికి ఒక నియోజకవర్గంలోనే ఓటు హక్కు ఉండాలి. కాబట్టి ప్రస్తుతం విజయవాడలో ఓటరుగా ఉన్న వ్యక్తి తిరిగి హైదరాబాద్‌లో ఓటు హక్కు పొందాలనుకుంటే, సర్‌ ప్రక్రియలో నిర్దిష్ట పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. హైదరాబాద్‌లో శాశ్వతంగా నివసిస్తున్నట్లు నిరూపించే పత్రాలను సిద్ధం చేసుకోవాలి. పాత ఓటరు గుర్తింపు కార్డు, పాత ఓటరు జాబితా ప్రతులు, ఎన్నికల కార్యాలయం జారీ చేసిన ధ్రువపత్రాలు ఉపయోగపడతాయి.

Updated Date - Jun 30 , 2026 | 05:28 AM