Share News

ఒకే ఆధార్‌ రెండు పేర్లు.. రెండు జీతాలు!

ABN , Publish Date - Aug 08 , 2026 | 05:41 AM

రెవెన్యూ శాఖలో ఉన్నతస్థాయి ఉద్యోగి.. నెలనెలా రూ.లక్షకుపైనే జీతం తీసుకుంటున్నారు. పోలీసుశాఖలో మరో ఉద్యోగి.. నెలకు రూ.లక్షన్నరకుపైనే వేతనం అందుకుంటున్నారు..

ఒకే ఆధార్‌ రెండు పేర్లు.. రెండు జీతాలు!

  • వేర్వేరు శాఖల్లో ఉద్యోగులుగా లక్షల్లో జీతాలు అందుకుంటున్న కొందరు

  • పోలీసు, విద్య, వైద్య, రెవెన్యూ సహా కీలక శాఖల్లో డూప్లికేట్‌ ఉద్యోగులు!

  • 40 అనుమానాస్పద కేసుల్లో 80 మందిని గుర్తించిన ఆర్థిక శాఖ

  • విచారణకు సీఎస్‌ ఆదేశం

  • అక్రమార్కులపై క్రిమినల్‌ కేసులు,సహకరించిన అధికారులపైనా చర్యలు

  • వారంలో నివేదిక ఇవ్వాలన్న సీఎస్‌

  • ‘డూప్లికేట్‌’ ఉద్యోగుల వ్యవహారంపై ప్రభుత్వ వర్గాల్లో కలకలం

  • ఉద్యోగుల మోసమా, ఉన్నతాధికారుల ప్రమేయమా?.. సాంకేతిక తప్పిదమా?

  • ఈ వ్యవహారంపై సందేహాలెన్నో..!

హైదరాబాద్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ శాఖలో ఉన్నతస్థాయి ఉద్యోగి.. నెలనెలా రూ.లక్షకుపైనే జీతం తీసుకుంటున్నారు. పోలీసుశాఖలో మరో ఉద్యోగి.. నెలకు రూ.లక్షన్నరకుపైనే వేతనం అందుకుంటున్నారు.. ఇద్దరి పేర్లు, వివరాలు వేర్వేరు. కానీ ఈ ఇద్దరు ఉద్యోగుల ఆధార్‌ నంబరు ఒక్కటే. అలా ఒకరిద్దరు కాదు.. 40 ఆధార్‌ నంబర్లపై ఇద్దరు చొప్పున 80 మంది ఉద్యోగుల వివరాలను ఆర్థిక శాఖ గుర్తించింది. వారంతా రెగ్యులర్‌ ఉద్యోగులేనని.. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు మూడు నెలల పాటు ఒక్కొక్కరు రూ.లక్షన్నర నుంచి రూ.5 లక్షల వరకు వేతనాల కింద పొందారని తేల్చింది. ఈ వ్యవహారంపై అంతర్గత విచారణలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు వివిధ ప్రభుత్వ శాఖలకు శుక్రవారం సర్క్యులర్‌ జారీ చేశారు. అయితే ఉద్యోగులే మోసానికి పాల్పడ్డారా? ఆర్థిక శాఖలోని కొందరి ప్రమేయం ఏమైనా ఉందా? లేక ఆధార్‌ వద్దగానీ, రాష్ట్ర వ్యవస్థల్లోగానీ ఏదైనా సాంకేతిక తప్పిదం కారణమా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణ తప్పిదమే అయితే ప్రభుత్వం అంతర్గతంగా సరిదిద్ది ఉండేదని, అక్రమాలు జరిగి ఉండవచ్చన్న అంచనాలు ఉండటంతోనే ప్రభుత్వ సీఎస్‌ సర్క్యులర్‌ జారీ చేసి ఉంటారని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒకట్రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాయి.


వేర్వేరు శాఖల్లో.. వేర్వేరు వ్యక్తులుగా..

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన ‘సమీకృత ఆర్థిక నిర్వహణ, సమాచార వ్యవస్థ (ఐఎఫ్ఎంఐఎస్)’లో వివరాలపై ఇటీవల పరిశీలన చేపట్టింది. అందులో రెగ్యులర్‌, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌, తాత్కాలిక సిబ్బంది ఆధార్‌ వివరాలను పరిశీలించే క్రమంలో.. ఒకే ఆధార్‌ నంబర్‌పై వేర్వేరు పేర్లతో, వేర్వేరు శాఖల్లో ఉద్యోగులు ఉన్న అంశం బయటపడింది. అంతేకాదు.. ఒకే ఆధార్‌ మీద ఒకచోట పురుషుడిగా, మరోచోట మహిళగా.. ఇంకొన్ని కేసుల్లో ఒకే ఆధార్‌ మీద రెండు వేర్వేరు మతాల పేర్లతో ఉద్యోగులు జీతాలు అందుకుంటున్నట్టు వెల్లడైంది. వారంతా రెగ్యులర్‌ ఉద్యోగులే, 010 పద్దు కింద జీతాలు తీసుకుంటున్నవారే కావడం గమనార్హం.

పోలీసు, రెవెన్యూ సహా కీలక శాఖల్లో..

  • ఒకే ఆధార్‌తో రెండు శాఖల్లో, రెండు ఐడీలతో వేతనాలు పొందుతున్న ఉద్యోగులు పోలీసు, రెవెన్యూ, విద్యా, పంచాయతీరాజ్‌, ప్రజారోగ్య శాఖల్లో ఎక్కువగా ఉన్నట్టు ఆర్థిక శాఖ అధికారులు గుర్తించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు మూడు నెలల పాటు వారు పొందిన వేతనాల వివరాలతో నివేదిక రూపొందించారు.

  • ప్రజారోగ్య విభాగంలో డి.ప్రమీలారాణి, కె.ప్రమీల పేర్లతో రెండు ఐడీలు (1821449, 1822239) ఉన్నాయి. ఆధార్‌ నంబరు 723715534957. డి.ప్రమీలారాణి పేరుతో రూ.4,52,834, కె.ప్రమీల పేరుతో రూ.5,16,741 వేతనం పొందారు. ఇదే విభాగంలో (ఆధార్‌ 44181791373)తో అనీష్‌ ఫాతిమా, అసోద వీణారాణి (ఐడీలు 1551106, 1474386)లకు రూ.3,26,268, రూ.1,91,040 అందుకున్నారు. ఇదేశాఖలో ఆధార్‌ 763656216203పై గంగేరి సందీప్ కుమార్‌, కె.సుబ్బలక్ష్మి పేర్లతో రెండు జీతాలు తీసుకున్నారు.

  • వైద్యారోగ్య శాఖకు చెందిన మరో కేసులో సి.స్వర్ణలత, సి.వి.కవిత పేర్లతో రూ.2.85 లక్షలు, రూ.4.20 లక్షల చొప్పున వేతనం తీసుకున్నారు.

  • నీటిపారుదల శాఖలో పి.ఝాన్సీలక్ష్మి, పాటిబండ్ల ఝాన్సీలక్ష్మి (ఐడీలు 1903608, 1909489). ఆధార్‌ నంబరు 853247545006. ఒకరు రూ.1,59,942, మరొకరు రూ.2,05,171 అందుకున్నారు.


  • గిరిజన శాఖలో బొనోతు నాగేశ్వరరావు, బుగ్గ రుబీనా (ఐడీలు 1646349, 1645349).. ఆధార్‌ నంబరు 410225176789. ఒక ఐడీ మీద రూ.2,41,230, మరో ఐడీ మీద రూ.2,41080 వేతనం చెల్లింపు జరిగింది.

  • ఆధార్‌ నంబరు 531743748048 మీద రెవెన్యూ శాఖలో కోడెం నర్సింహమూర్తి, ప్రజారోగ్య విభాగంలో బజ్జాని చిన్నమ్మాయి (ఐడీలు 1631345, 1631158) ఉన్నారు. ఒక ఐడీపై రూ.2,51,558, మరో ఐడీపై రూ.3,95,631 అందుకున్నారు.

  • ఉన్నత విద్యాశాఖలో ఆధార్‌ 372065476318తో పెద్ది శ్రీవిద్య, మైత్రి అఖిల్‌ కృపాకర్‌ (ఐడీలు 1253929, 1254182) పేర్లతో రెండు జీతాలు తీసుకుంటున్నారు. ఒక ఐడీపై రూ.1,13,824, మరో ఐడీపై రూ.1,68,165 జీతం పొందారు.

  • పాఠశాల విద్య విభాగంలో ఆధార్‌ 805314677193తో కిందింటి మోహన్‌రెడ్డి, బసిరెడ్డి రామ్మోహన్‌రెడ్డి పేరుతో రెండు ఉద్యోగ ఐడీలు 1719243, 1755475 ఉన్నాయి. ఒకదానిపై రూ.3,19,968, మరోదానిపై రూ.2,72,553 వేతనాల చెల్లింపు జరిగింది.

  • ఎస్‌.బి. లావణ్య డబ్బుల, రమాదేవి (ఐడీలు 1700077, 1701377).. రిజిస్టార్‌ ఆఫ్‌ కోఆపరేటివ్‌ విభాగం, ఆధార్‌ 554978610731. లావణ్య పేరిట రూ.4,42,656, రమాదేవి పేరిట రూ.2,52,298 వేతనాలు అందుకున్నారు.

  • తన్నీరు అన్నపూర్ణ రెవెన్యూ ఉద్యోగి (ఐడీ 19064,89) జీతం రూ.2,09,904.. డీజీపీ కార్యాలయంలో ఉద్యోగి అన్నపూర్ణ (ఐడీ 1903605) వేతనం రూ.1,58,564 అందుకున్నారు. ఇద్దరి ఆధార్‌ 382462551036 ఒకటే.

  • పంచాయతీరాజ్‌ శాఖలో (ఆధార్‌ 929634128906) సంతోష్‌ కుమార్‌ నీలకంఠ, బీరవెళ్లి సతీశ్‌రెడ్డి (ఐడీలు 2901472, 2901705) ఒక ఐడీపై రూ.1,21,119, మరో ఐడీపై రూ.1,12,119 జీతాలు తీసుకున్నారు. ఇదే శాఖలో చిలుకూరి సుదర్శన్‌, పలస ముత్యాలు (ఆధార్‌ 478506553361.. ఐడీలు 1950292, 2903728)పై రూ.2,44,803, రూ.1,19,610 రెండు వేతనాలు అందుకున్నారు.


డీజీపీ కార్యాలయం పరిధిలోనూ..

  • డీజీపీ కార్యాలయంలో ఆధార్‌ 244629133255 మీద శ్యామ్‌ సుందర్‌, వై.సత్యనారాయణరెడ్డి పేర్లతో (ఐడీలు 2006104, 2006593) రూ.2,90,400, రూ.3,87,785 చొప్పున జీతాలు పొందారు. దుంపలపల్లి స్వామి, గిరిపల్లి స్వామి (ఆధార్‌ 403997463442.. ఐడీలు 1836057, 1836053) రూ.2,47,449, రూ.2,11,460 వేతనం తీసుకున్న్నారు. అయితే ఇక్కడ ఈ హోదా, హెచ్‌ఓడీగా ఒకరే ఉన్నట్లు తేలింది. ఇదే కార్యాలయంలో ఒకే ఆధార్‌తో కె.గురునాథం, కె.దుర్గాప్రసాద్‌ పేర్లతో రెండు జీతాలు పొందినట్టు గుర్తించారు.

  • డీజీపీ కార్యాలయంలోనే పొనుగోని సైదులు, మహ్మద్‌ మజీద్‌ (ఐడీలు 1958128, 1958127).. ఆధార్‌ 710777333490. సైదులు పేరిట రూ.2,37,501, మజీద్‌ పేరిట రూ.2,34,744 వేతనాల చెల్లింపు జరిగింది. జి.మోహన్‌నాయక్‌, గుగులోతు సరోజ (ఐడీలు 1252753, 2110372) ఇద్దరికీ (ఆధార్‌ 891860158825) ఒక ఐడీ మీద రూ.1,28043, మరో ఐడీ మీద రూ.2,412157 జీతం అందింది. ఇక తీగల మహేశ్‌, రొంటాల సృజన్‌కుమార్‌ (ఆధార్‌ 593334789413.. ఐడీలు 1549916, 1549913).. ఒక ఐడీపై రూ.1,32,947, మరో ఐడీ మీద రూ.2,03,604 వేతనాలుగా అందుకున్నారు.


అత్యవసర విచారణకు సీఎస్‌ సంజయ్‌జాజు ఆదేశం

ఒకే ఆధార్‌పై వేర్వేరు ఉద్యోగులు, రెండు వేతనాల వ్యవహారాన్ని సీఎస్‌ సంజయ్‌జాజు తీవ్రంగా పరిగణించారు. ఈ మేరకు అత్యవసరంగా శాఖాపరమైన విచారణలు చేపట్టాలంటూ సర్క్యులర్‌ జారీ చేశారు. ఉద్యోగులు వాస్తవాలను దాచిపెట్టి.. ఒకటి కంటే ఎక్కువ జీతాలు తీసుకున్నట్లు గుర్తిస్తే.. తెలంగాణ సివిల్‌ సర్వీస్‌ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్రమంగా జీతం పొందిన ఉద్యోగి నుంచి ఆ సొమ్మును రికవరీ చేయాలని, క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో మోసం, ఫోర్జరీ, అధికారిక రికార్డుల తారుమారు, విశ్వాస ఘాతుకం, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం వంటి నేరాలు వర్తించే అవకాశం ఉందని పేర్కొన్నారు. మోసపూరితంగా రెండు వేతనాల చెల్లింపులకు ఎవరైనా అధికారులు సహకరించినట్టు తేలినా, తెలిసీ నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

Updated Date - Aug 08 , 2026 | 05:42 AM