Share News

కొలువుల ఆశలపై.. పైరవీల నీడ

ABN , Publish Date - Aug 20 , 2026 | 12:40 AM

చిన్నారులకు పూర్వవిద్య, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహార కేంద్రాలుగా అంగన్‌వాడీలు సేవలందిస్తున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏళ్ల తరబడి టీచర్‌, హెల్పర్ల ఖాళీల భర్తీ లేకుండా ఇబ్బందికర పరిస్థితుల్లో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఎట్టకేలకు ప్రభుత్వం టీచర్ల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఎంతో కాలంగా అంగన్‌వాడీ కొలువుల

కొలువుల ఆశలపై.. పైరవీల నీడ

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

చిన్నారులకు పూర్వవిద్య, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహార కేంద్రాలుగా అంగన్‌వాడీలు సేవలందిస్తున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏళ్ల తరబడి టీచర్‌, హెల్పర్ల ఖాళీల భర్తీ లేకుండా ఇబ్బందికర పరిస్థితుల్లో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఎట్టకేలకు ప్రభుత్వం టీచర్ల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఎంతో కాలంగా అంగన్‌వాడీ కొలువుల కోసం ఎదురుచూస్తున్న మహిళలు దరఖాస్తులు చేసుకున్న క్రమంలోని పైరవీల నీడ కూడా అలుముకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రెండు ప్రాజెక్టుల పరిధిలో 55 టీచర్‌ పోస్టులకు జూలై 28 నుంచి ఆగస్టు 7 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు స్వీకరించగా 1475 మంది దరఖాస్తులు చేసుకున్నారు. సిరిసిల్ల ప్రాజెక్టు పరిధిలో 43 ఖాళీలకు 1125 మంది దరఖాస్తులు చేసుకోగా, వేములవాడ ప్రాజెక్టు పరిధిలో 12 ఖాళీలకు 350 మంది దరఖాస్తులు చేసుకున్నారు. జిల్లాలో సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతోంది. అంగన్‌వాడీ ఖాళీల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈసారి ఇంటర్మీడియట్‌ అర్హతగా నిర్ణయించారు. గతంలో టీచర్‌ పోస్టుకు పదో తరగతి, విద్యార్థుల సహాయకులకు ఏడో తరగతి విద్యార్హత ఉండేది. ఈసారి టీచర్‌, ఆయాలకు పోస్టులకు ఇంటర్మీడియట్‌ నిర్ణయించారు. దీంతోపాటు అభ్యర్థులు 18 నుంచి 35 ఏళ్ల వయసులోపు ఉండి స్థానికత ప్రత్యేకంగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, సబ్‌ప్లాన్‌ కింద రిజర్వేషన్లు కూడా కల్పించారు. గతానికి భిన్నంగా ఈసారి నియామక ప్రక్రియను చేపట్టేందుకు చర్యలు చేపట్టినా ఒకవైపు సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగుతుండగా మరోవైపు పైరవీలు జోరందుకున్నాయి. ప్రధానంగా అధికార పార్టీ నేతల చుట్టూ తిరుగుతున్నారు. స్థానిక ఎన్నికల్లో సర్పంచులు, శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేల గెలుపులో కీలకంగా పనిచేసిన పార్టీ కార్యకర్తలు, నాయకులు తమ బంధువులకు, కుటుంబ సభ్యులకు అంగన్‌వాడీ పోస్టులు ఇప్పించుకునే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధులకు అండగా నిలిచిన సందర్భాలను గుర్తుచేస్తూ టీచర్‌ పోస్టులు తమ వారికి ఇప్పించాలంటూ నేతలపై ఒత్తిడి పెంచుతున్నారు. పైస్థాయి నాయకులు కూడా అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.

కొత్త అభ్యర్థులకు అవకాశాలు ఎక్కువ

అంగన్‌వాడీ ఖాళీల భర్తీ ప్రక్రియ గతంలో కంటే భిన్నంగా ఈసారి కొనసాగుతోంది. ఇంటర్మీడియట్‌ విద్యార్హత, అంగన్‌వాడీ కేంద్రం పరిధిలో ఉన్న వారికే అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేశారు. దీని ప్రకారం సిరిసిల్ల, వేములవాడ ప్రాజెక్టు పరిధిలో భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఒక్క పోస్టుకు దాదాపు 25 నుంచి 30 మంది వరకు దరఖాసుల్తు చేసుకున్నారు. దరఖాస్తుదారుల సర్టిఫికెట్లు పరిశీలిస్తున్నారు. ఇందులో కొత్తగా ఇంటర్మీడియట్‌ పాస్‌ అయిన అభ్యర్థులకే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక విధానం కలెక్టర్‌ అధ్యక్షతన కొనసాగుతోంది. ఇంటర్మీడియట్‌ మార్కుల మెరిట్‌కు 70 మార్కులు, ప్రత్యేక కేటగిరి కింద వితంతువులకు ఐదు మార్కులు, అనాథలకు 10 మార్కులు, దివ్యాంగులకు ఐదు మార్కులు, జిల్లా ఎంపిక కమిటీ 10 మార్కులు ఇస్తారు. 100 మార్కులతో సాగే ఎంపిక ప్రక్రియలో ఇంటర్మీడియట్‌ మెరిట్‌ మార్కులు కీలకంగా మారుతాయి. గతంలో ఎప్పుడు పాసైన మహిళా అభ్యర్థులకు మెరిట్‌ శాతం తక్కువగా ఉంటుంది. కొత్తగా 18 సంవత్సరాలు దాటినఇంటర్మీడియట్‌ పాస్‌ అయిన వారికి మెరిట్‌ మార్కులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాతవారి కంటే కొత్తవారికి లభించే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నారు.

జిల్లాలో 40 వేల మంది లబ్ధిదారులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 586 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, 40 వేల మంది చిన్నారులు, గర్భిణులు, బాలింతలు వివిధ సేవలను పొందుతున్నారు. జిల్లాలో ఐసీడీఎస్‌ పరిధిలో పాలిచ్చే తల్లులు 3064 మంది వరకు ఉండగా, గర్భిణులు 3500 మంది ఉన్నారు. వీరికి అంగన్‌వాడీ కేంద్రా ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. తల్లిపాల విశిష్టతను చాటుతున్నారు. వీటితో పాటు ఆరోగ్యలక్ష్మి పథకంలో 6 నెలల నుంచి మూడు సంవత్సరాల పిల్లలకు నెలకు 2.5 కిలోల బాలామృతం ప్యాకెట్‌, 16 గుడ్లు టేక్‌ హోం రేషన్‌గా అందిస్తున్నారు. గర్భిణులు, బాలింతలతో పాటు మూడునుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు ఒక పూట సంపూర్ణ భోజనం, ప్రతి రోజు, గుడ్డు, పాలు, పప్పు, కూరగాయలతో భోజనాలు అందిస్తున్నారు.

పారదర్శకంగా ఖాళీల భర్తీ..

- లక్ష్మీరాజం, జిల్లా సంక్షేమ అధికారి

సిరిసిల్ల, వేములవాడ ఐసీడీఎస్‌ ప్రాజెక్టులో 55 టీచరు పోస్టు ఖాళీల భర్తీకి దరఖాస్తు స్వీకరించాం. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేస్తున్నాం. దరఖాస్తుదారులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు. ఎలాంటి పైరవీలకు తావు లేకుండా పారదర్శకంగా ఎంపిక జరుగుతుంది. అర్హత ఉన్న అభ్యర్థులందరినీ ఇంటర్వ్యూలకు పిలుస్తాం. ఎవరైనా డబ్బులు ఇస్తే ఉద్యోగం వస్తుందని చెబితే నమ్మి మోసపోవద్దు.

Updated Date - Aug 20 , 2026 | 12:40 AM