Share News

ఓల్డ్‌సిటీ మెట్రో కారిడార్‌పై ముందడుగు

ABN , Publish Date - May 19 , 2026 | 05:33 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మెట్రో రెండో దశ విస్తరణలోని ఓల్డ్‌సిటీ కారిడార్‌లో 80 శాతం భూసేకరణ పూర్తయింది.

ఓల్డ్‌సిటీ మెట్రో కారిడార్‌పై ముందడుగు

  • జనరల్‌ కన్సల్టెన్సీ నియామకానికి టెండర్ల ఆహ్వానం

హైదరాబాద్‌ సిటీ, మే 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మెట్రో రెండో దశ విస్తరణలోని ఓల్డ్‌సిటీ కారిడార్‌లో 80 శాతం భూసేకరణ పూర్తయింది. మిగతా 20 శాతాన్ని తీసుకునేందుకు హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎంఎల్‌) అధికారులు స్థానిక నిర్వాసితులతో మాట్లాడుతున్నారు. బక్రీద్‌ పండుగ తర్వాత సేకరణను పూర్తి చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇదే సమయంలో జనరల్‌ కన్సల్టెన్సీ (జీసీ) నియామకానికి ఇటీవల టెండర్లు పిలిచారు. జూన్‌ 5వ తేదీని ప్రతిపాదనలను స్వీకరించేందుకు తుది గడువుగా పేర్కొన్నారు. ఇందులో ఎంపికైన సంస్థ మూడు నెలల్లోగా కారిడార్‌ డిజైన్‌ ప్రతిపాదనలను రూపొందించాల్సి ఉంటుంది. డిజైన్‌ మేరకు పనులు సాగేలా పర్యవేక్షించాల్సిన బాధ్యత ఈ కన్సల్టెన్సీదే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డీటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్‌)కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన వెంటనే.. పాతబస్తీ పనులను ప్రారంభించాలనే ఆసక్తితో రాష్ట్ర సర్కారు ఉన్నట్లు కనిపిస్తోంది. నగరంలో రెండో దశ మెట్రో విస్తరణలో భాగంగా మొత్తం 8 కారిడార్లను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఇందులో కారిడార్‌-6 కింద ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట వరకు (7.5 కిలోమీటర్లు) చేపట్టేందుకు డీపీఆర్‌ తయారు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్‌ వెంచర్‌ (జేవీ) ప్రాతిపదికన రూ.2,741 కోట్లతో నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు నిర్ణయించాయి.

Updated Date - May 19 , 2026 | 05:33 AM