ఓలా, ఉబర్, ర్యాపిడో ఆగడాలను అరికట్టాలి
ABN , Publish Date - Feb 08 , 2026 | 07:03 AM
ఓలా, ఉబర్, ర్యాపిడో తదితర ప్లాట్‌ఫాంలలో పని చేస్తున్న బైక్, ఆటో, క్యాబ్‌ల డ్రైవర్లు శనివారం ఆందోళనబాట పట్టారు.
హైదరాబాద్‌లో డ్రైవర్ల సమ్మె, పలుచోట్ల ధర్నాలు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): ఓలా, ఉబర్, ర్యాపిడో తదితర ప్లాట్‌ఫాంలలో పని చేస్తున్న బైక్, ఆటో, క్యాబ్‌ల డ్రైవర్లు శనివారం ఆందోళనబాట పట్టారు. ఓలా, ఉబర్, ర్యాపిడో తదితర సంస్థల ఆగడాలను అరికట్టాలని, అగ్రిగేటర్ గైడ్‌లైన్స్ 2025ను రద్దు చేయాలని, ఆటో, క్యాబ్‌ల చార్టీలను సవరించాలన్న డిమాండ్లతో హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో డ్రైవర్లు నిరసన ప్రదర్శనలు చేశారు. డ్రైవర్లు సమ్మెలో పాల్గొన్న సమయంలో ఆన్‌లైన్‌లో రైడ్‌లు బుక్ అవ్వక ప్రయాణికులు అవస్థలు పడ్డారు. కాగా, తెలంగాణ రాష్ట్ర క్యాబ్స్ ప్రొటెక్ట్ ట్రేడ్‌యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో డ్రైవర్లు ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయం వద్ద శనివారం ఉదయం ధర్నా చేశారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్‌యాప్ బేస్డ్ వర్కర్స్, ఆలిండియా లేబర్ వర్కర్స్ ఫెడరేషన్, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ యూనియన్ల ఆధ్వర్యంలో ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద శనివారం ధర్నా జరిగింది. కాగా, ధర్నా నేపథ్యంలో ఆటోవాలాలు పలు చోట్ల వీరంగం సృష్టించారు. పలుచోట్ల వాహనాలను అడ్డగించి తనిఖీలు చేశారు.