Share News

టన్ను ఆయిల్‌ పామ్‌ గెలలు రూ.23,501

ABN , Publish Date - May 03 , 2026 | 05:30 AM

ఆయిల్‌పామ్‌ చరిత్రలో మరో రికార్డు నమోదైంది. టన్ను ఆయిల్‌ పామ్‌ గెలల ధర రూ.23,501కు చేరింది. ఆయిల్‌పామ్‌కు ఇప్పటివరకు దేశంలోనే ఇదే అత్యధిక ధర కావడం విశేషం.

టన్ను ఆయిల్‌ పామ్‌ గెలలు రూ.23,501

  • ఆయిల్‌పామ్‌ చరిత్రలోనే రికార్డు ధర

  • దేశంలో ఇప్పటిదాకాఇదే అత్యధికం..

  • మంత్రి తుమ్మలకు రైతుల కృతజ్ఞతలు

అశ్వారావుపేట, మే 2(ఆంధ్రజ్యోతి): ఆయిల్‌పామ్‌ చరిత్రలో మరో రికార్డు నమోదైంది. టన్ను ఆయిల్‌ పామ్‌ గెలల ధర రూ.23,501కు చేరింది. ఆయిల్‌పామ్‌కు ఇప్పటివరకు దేశంలోనే ఇదే అత్యధిక ధర కావడం విశేషం. ఆయిల్‌ఫెడ్‌ అధికారులు వెల్లడించిన ప్రకారం ఆయిల్‌పామ్‌ గెలల ధర గత నెల కంటే ఒక టన్నుకు రూ.496 పెరిగి ప్రస్తుతం రూ.23,501కు చేరింది. ఇంత ధర పలకడంతో రాష్ట్రంలోని ఆయిల్‌పామ్‌ రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. 2025 డిసెంబరులో టన్ను గెలల ధర రూ.19,694 ఉండేది. గత ఐదు నెలలుగా ధర పెరుగుతూ వస్తోంది. 2026 జనవరిలో రూ.20,456, ఫిబ్రవరిలో రూ.21,546, మార్చిలో రూ.23,005, ఏప్రిల్‌లో రూ.23,501కు పెరిగింది. కాగా, 2020 జూన్‌లో అప్పట్లో అత్యధికంగా ఆయిల్‌ పామ్‌ గెలలు టన్ను ధర రూ.23,467కు చేరింది. కానీ ఆ తర్వాత ప్రతి నెలా తగ్గుతూ వచ్చి టన్ను ధర రూ.14వేల వరకు పడిపోయింది. అయితే, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తుమ్మల నాగేశ్వరరావు ఆయిల్‌పామ్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించి సీఎం, అధికారులు, కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ వచ్చారు. ఆయిల్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన పరిశ్రమల ఏర్పాటు, దిగుమతి సుంకం, ఇతర అంశాల విషయంలో కేంద్రంతో చర్చలు జరిపి ఆయిల్‌పామ్‌ తోటల విస్తరణ, ధరల పెంపునకు కృషి చేశారు. ఆయిల్‌పామ్‌ గెలలకు రికార్డు ధర పలుకుతున్న నేపథ్యంలో టీఎస్‌ ఆయిల్‌పామ్‌ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలపాటి రామచంద్ర ప్రసాద్‌ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును హైదారబాద్‌లో శనివారం కలిశారు. రైతుల తరఫున మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో ఆయిల్‌పామ్‌ గెలలు ధర పెరగడం, ఏపీలో కూడా ఇదే ధరను అనుసరిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఏపీకి చెందిన పలువురు రైతులు కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Updated Date - May 03 , 2026 | 05:33 AM