‘లగచర్ల’లో ఆయిల్ పామ్ పరిశ్రమ
ABN , Publish Date - Apr 16 , 2026 | 04:03 AM
సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల ఇండస్ట్రియల్ పార్కులో ఆయిల్ పామ్ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు అడుగులు...
వికారాబాద్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల ఇండస్ట్రియల్ పార్కులో ఆయిల్ పామ్ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు అడుగులు వేగంగా పడుతున్నాయి. పరిశ్రమ ఏర్పాటుకు 50 ఎకరాల స్థలం అవసరం కాగా, దుద్యాల మండలంలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్, ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే అధికారులు భూములను సేకరించారు. దీనినే మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కునే లగచర్ల ఇండస్ట్రియల్ పార్కుగా పిలుస్తున్నారు. ఆ భూముల్లోనే ఆయిల్ పామ్ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ‘ఎకోపామ్ ఆయిల్ అండ్ ఫ్యాట్స్’ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు ముందుకు వచ్చారు. ఈ మేరకు ఇటీవల జిల్లా కలెక్టర్‌కు సమాచారం ఇచ్చి భూములను పరిశ్రమ కోసం కేటాయించాలని కోరినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే గత వారం వ్యవసాయ శాఖ కార్యదర్శి ‘ఎకోపామ్ ఆయిల్ అండ్ ఫ్యాట్స్’ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు.