kumaram bheem asifabad- అధికారులు పని తీరు మార్చుకోవాలి
ABN , Publish Date - Aug 14 , 2026 | 11:41 PM
మండలంలోని పలు శాఖల అధికారులు తమ పని తీరును మార్చుకోవాలని మండలంలోని పలువురు సర్పంచ్‌లు తెలిపారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం మండల స్పెషల్ ఆఫీసర్(డీపీవో) భిక్షపతిగౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పలువురు సర్పంచ్‌లు మాట్లాడారు.
రెబ్బెన, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు శాఖల అధికారులు తమ పని తీరును మార్చుకోవాలని మండలంలోని పలువురు సర్పంచ్‌లు తెలిపారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం మండల స్పెషల్ ఆఫీసర్(డీపీవో) భిక్షపతిగౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పలువురు సర్పంచ్‌లు మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి, సంక్షేమ అభివృద్ధికి మండల స్థాయి అధికారులు ఏ మాత్రం సహకరించడం లేదన్నారు. ముఖ్యంగా విద్యుత్ శాఖ అధికారులు తమకు సహకరించక పోవడంతో తాము గ్రామాల్లో వీధి దీపాలను కూడా సరిగ్గా ఏర్పాటు చేయలేక పోతున్నామన్నారు. పలు గ్రామాల్లో విద్యుత్ స్తంబాలు వంగి, విద్యుత్ తీగలు ఇళ్లపై నుంచి వేలాడుతున్నాయన్నారు. అలాగే ఫారెస్టు అధికారులు గంగాపూర్, కైరిగూడ, తదిరత గ్రామాల్లో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వివరించారు. అంతేకాకుండా ఇరిగేషన్ అధికారులు మండలంలో పర్యవేక్షణ సరిగ్గా లేక పోవడంతో వట్టివాగు కాల్వలను మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో రైతులు వాటిని కబ్జా చేసి కూల్చి వేస్తున్నారని చెప్పారు.. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారు తవ్విన కాల్వలను పరిశీలించి పునరుద్ధరించాలని కోరారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒకే వైద్యాఽధికారి ఉండడంతో వైద్య సేవలు అందటం లేదని ఇక్కడ ఇద్దరు డాక్టర్లను అందుబాటులో ఉంచినప్పుడే మండల ప్రజలతో పాటు జాతీయ రహదారిపై జరిగే ప్రమాదాల బాధితులకు సరైన సేవలు అందుతాయన్నారు. అంతేకాకుండా మండల కేంద్రంలోని పురాతన గెస్ట్ హౌస్ కూల్చివేసి కొత్త భవనం నిర్మించాలన్నారు. వట్టివాగు కాల్వలో నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలన్నారు. వ్యవసాయాధికారి దిలీప్ కుమార్ మాట్లాడుతూ వర్షాలు ఈసారి తక్కువగా ఉన్నందున రైతులు వర్షాధార పంటలను వేయకూడదన్నారు. అలాగే మండలంలోని రైతులకు సరిపడ యూరియా అందుబాటులో ఉందన్నారు. ఏపీవో రాంమోహన్ మాట్లాడుతూ ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని ఫారం ఫండ్ సైతం రైతులకు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. సమావేశంలో ఇన్‌చార్జి ఎంపీడీవో శ్రీధర్, తహసీల్దార్ సూర్యప్రకాష్. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్, సింగిల్ విండో చైర్మన్ సంజీవ్‌కుమార్, వైస్‌చైర్మన్ రంగు మహేష్, ఎఫ్‌ఆర్‌వో రమాదేవి, ఏపీఎం దుర్గయ్య, పశువైద్యాధికారి కార్తీక్, వైద్యాధికారి డాక్టర్ రుచిక, సర్పంచ్‌లు బాబురావు, భరద్వాజ్, వెంకటేష్ చారి, రవీందర్, సాగర్‌గౌడ్ సంధ్యారాణి, సిబ్బంది పాల్గొన్నారు.