kumaram bheem asifabad- అధికారులు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి
ABN , Publish Date - Jun 18 , 2026 | 10:22 PM
జిల్లాలోని గ్రామ పంచాయతీల అభివృదికి అధికారులు పాటుపడాలని కలెక్టర్ కెహరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో గురువారం అదనపు కలెక్టర్ ఎం డేవిడ్‌తో కలిసి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గ్రామ పంచాయతీల అభివృదికి అధికారులు పాటుపడాలని కలెక్టర్ కెహరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో గురువారం అదనపు కలెక్టర్ ఎం డేవిడ్‌తో కలిసి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. పంచాయతీల అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ రూపొందించాలని, పంచాయతీ నిధులను ప్రణాళికా బద్దంగా ఖర్చు చేయాలని తెలిపారు. త్వరలో 16వ ఆర్థిక సంఘం ప్రారంభమవుతుందని 14, 15 ఆర్థిక సంఘాల నిధులను గ్రామ పంచాయతీల అభివృద్ధికి పూర్తిగా ఖర్చు చేయాలని తెలిపారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ప్రతిపాదనలను త్వరగా పంపించాలని, ఆసరా పెన్షన్ల పరిశీలన ప్రక్రియ పూర్తి చేయాలని, 2వ విడత ఇందిరమ్మ ఇండ్ల కొరకు గుడిసెలలో నివసించే వారి వివరాలను పరిశీలించి నివేదిక రూపొందించాలని తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా గ్రామాలలో పారిశుధ్య పనులు ప్రతి రోజు చేపట్టాలని, నివాస ప్రాంతాలలో నీరు నిలువ కుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా శుద్ధమైన తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని, వ్యాధుల నియంత్రణఖు పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. గ్రామాలలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించాలని, పగటి వేళ వీధి దీపాలు వెలగకుండా నియంత్రికలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలలో అవసరమైన చోట ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఈ నెల 28న చేపట్టే పల్స్ పోలియో కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుంచి జూలై 24వ తేదీ వరకు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని బూత్ స్థాయి అధికారులు తమ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి ఫారాలు అందించి అవసరమైన ధ్రువపత్రాలు సేకరించాలని చెప్పారు. ఈ ప్రక్రియను విజయవంతం చేయ డానికి పంచాయతీ కార్యదర్శులు సహకరించాలని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావు, పంచాయతీ అధికారి భిక్షపతి, జడ్పీ సీఈఓ లక్ష్మినారాయణ, తదితరులు పాల్గొన్నారు.
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చర్యలు
ఆసిఫాబాద్‌రూరల్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ కె హరిత తెలిపారు. ఆసిఫాబాద్ మండలం బూర్గుడ గ్రామంలోని కళావతి ట్రేడర్స్ ఎరువులు దుకాణాన్ని గురువారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పత్తి విత్తనాల ప్యాకెట్లను పరిశీలించి స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. దుకాణంలో ఉన్న విత్తనాలు, ఎరువుల స్టాక్ వివరాలు రిజిస్టర్‌లో నమోదు చేయక పోవడంతోపై యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాక్ వివరానలు ఎప్పటికప్పుడు రిజిస్టర్‌లో నమోదు చేయాలని చెప్పారు, దుకాణంలో ఏర్పాటు చేసిన బోర్డుపై అందుబాటులో ఉన్న విత్తనాలు, ఎరువుల వివరాలు స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు. రైతులను మోసం చేసే విధంగా నకిలీ విత్తనాలు విక్రయాలను ప్రభుత్వం ఏ మాత్రం సహించదని స్పష్టం చేశారు. అలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ప్రభుత్వం నిషేధించిన గడ్డి మందులు, ఇతర వ్యవసాయ రసాయనాల విక్రయం జరిగితే సంబంధిత డీలర్లపై కఠిన చర్యలు తప్పవని చెప్పారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎరువులు, విత్తనాల దుకాణాలపై ఆకస్మికంగా తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు తప్పని సరిగా పాటించాలని కలెక్టర్ సూచించారు.