Share News

kumaram bheem asifabad- అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి

ABN , Publish Date - Nov 21 , 2026 | 10:36 PM

అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మండల ప్రత్యేక అధికారి, పంచాయతీరాజ్‌ డీఈఈ ఫజల్‌ హక్‌ కైఫీ అన్నారు. స్థానిక ఎంపీడీవో సమావేశ మందిరంలో శనివారం మండల సర్వ సభ్య సమావేశం నిర్వహించారు.

kumaram bheem asifabad- అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి
మాట్లాడుతున్న మండల ప్రత్యేక అధికారి ఫజల్‌ హక్‌ కైఫీ

జైనూర్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మండల ప్రత్యేక అధికారి, పంచాయతీరాజ్‌ డీఈఈ ఫజల్‌ హక్‌ కైఫీ అన్నారు. స్థానిక ఎంపీడీవో సమావేశ మందిరంలో శనివారం మండల సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలకు స్పష్ఠమైన సమాధానం ఇవ్వాలని చెప్పారు. వచ్చే సమావేశంలో పూర్తి వివరాలతో హాజరు కావాలని కోరారు. అంతకు ముందు సర్పంచులు కొడప ప్రకాష్‌, జాదవ్‌ శ్రావణ్‌ నాయకర్‌, జాదవ్‌ నాయక్‌, జాదవ్‌ భావరావ్‌, రాథోడ్‌ రాందాస్‌లు అధికారుల పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంతకు ముందు జరిగిన సమావేశంలో ప్రతిపాధించిన పనులకు గాను ఇంత వరకు మోక్షం లభించలేదని చెప్పారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని మండిపడ్డారు. ముఖ్యంగా విద్యుత్‌, అటవీ, తదితర శాఖల అధికారులను వివిధ పనుల విషయంపై ప్రశ్నించారు. సరైన సమాధానం రాక పోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఐసీడీఎస్‌లో అంగన్‌వాడీ, ఆయా పోస్టుల భర్తీ ప్రక్రియలో సర్పంచుల ప్రమేయం ఏమైన ఉందా అని అడిగారు. పోస్టుల భర్తీ ప్రక్రియ జిల్లా కలెక్టర్‌ పరిధిలో ఉందని సీడీపీవో సృజన వివరించారు. రోడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణాలను అటవీశాఖ సిబ్బంది అడ్డుకుంటున్నారని, అలాంటప్పుడు పనులు ఎలా చేయాలని ప్రశ్నించారు. ఏవైన పనులు చేసేటప్పుడు ముందుగా అటవీశాఖ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఎఫ్‌ఎస్‌వో వందన సమాధానం ఇచ్చారు. ఐకేపీ, పశు సంవర్థకశాఖ, వీబీజీరామ్‌జీ, వ్యవసాయం, రెవెన్యూ, అర్‌ఢబ్ల్యుఎస్‌, ఐటీడీఎ తదితర శాఖల అధికారుల తమ శాఖల వివరాలను తెలియజేశారు. సమావేశంలో తహసీల్దార్‌ ఆడ బీర్షావ్‌, సీఐ రమేశ్‌, ఎంపీడీవో క్రిష్ణవేణి, ఎంపీవో శశికుమార్‌, ఏవో ఆనంద్‌రావ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ చిక్రం రంజిత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2026 | 10:36 PM