kumaram bheem asifabad-అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి
ABN , Publish Date - Nov 13 , 2026 | 10:33 PM
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించి జవాబుదారీగా ఉండాలని సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం ఎంపీడీవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు.
పెంచికల్‌పేట్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించి జవాబుదారీగా ఉండాలని సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం ఎంపీడీవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలన్నారు. బొంబాయిగూడ సర్పంచ్ ఉమాదేవి మాట్లాడుతూ ఎంఈవో పాఠశాలలను తనిఖీ చేయడం లేదని విద్యాశాఖ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని సభా దృష్టికి తీసుకొచ్చారు. సర్పంచ్‌లు రవి, కృష్ణవేణి మాట్లాడుతూ ఇరిగేషన్ అధికారులు బొక్కివాగు, ఉచ్చమల్లవాగు ప్రాజెక్టు నిర్వహణ సరిగా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అటవీ శాఖ అధికారులు అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవద్దని సూచించారు. అనంతరం పలువురు సర్పంచ్‌లు మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పలు శాఖల అధికారులకు దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా పరిష్కారం కావడం లేదని వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమస్యల పరిష్కారం చూపించేందుకు అధికారులు బాధ్యతయుతంగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్, ఎంపీవో శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. కాగా పెంచికల్‌పేట్ మండలానికి ప్రభుత్వం 232 నూతన పింఛన్లు కేటాయించగా శుక్రవారం ఎల్కపల్లిలో ఏర్పాటు చేసిన రైతు వేదికలో సిర్పూరు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు సామాజిక భద్రత కల్పించడంతో పాటు ఆర్థిక చేయూతనందించేందుకు ప్రభుత్వ సంక్షేమపథకాలను అమలు చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్, ఎంపీడీవో గాజుల శ్రీనివాస్, ఎంపీవో శ్రీనివాస్, సర్పంచ్‌లు కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.