Share News

మారుమూల జిల్లాల్లో డాక్టర్ల కొరతను అధిగమించేందుకు..ఒడిశా మోడల్‌ ఉత్తమం

ABN , Publish Date - Jul 06 , 2026 | 03:08 AM

మారుమూల, గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేసేందుకు... వైద్యులను, అధ్యాపకులను ఆకర్షించడానికి ఒడిశా ప్రభుత్వం అమలు చేస్తున్న ...

మారుమూల జిల్లాల్లో డాక్టర్ల కొరతను అధిగమించేందుకు..ఒడిశా మోడల్‌ ఉత్తమం

  • అక్కడ దూరాన్ని బట్టి భారీగా ఆర్థిక ప్రోత్సాహకాలు

  • ప్రొఫెసర్లకు నెలకు 1.50 లక్షల వరకు అదనపు అలవెన్సు

  • దాంతో వైద్య కళాశాలల్లో తీరిన అధ్యాపకుల కొరత

  • ఏపీలోనూ ఇదే విధానం

  • ఆ రెండు రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన అధికారులు

  • తెలంగాణలోనూ అమలుకు సిఫార్సు

హైదరాబాద్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): మారుమూల, గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేసేందుకు... వైద్యులను, అధ్యాపకులను ఆకర్షించడానికి ఒడిశా ప్రభుత్వం అమలు చేస్తున్న ఇన్సెంటివ్‌ మోడల్‌ అద్భుత ఫలితాలిస్తోంది. ఇక్కడ సేవలందిస్తున్న అధ్యాపకులకు జీతంతో పాటు భారీగా అదనపు ఆర్థిక పారితోషికాలను అందిస్తూ ఆ రాష్ట్రం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. తెలంగాణలోనూ కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల బృందం ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాల్లో పర్యటించింది. అక్కడి విధానాలపై అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదికను సమర్పించింది. ఇక్కడి మారుమూల జిల్లాల్లో డాక్టర్ల కొరతను అధిగమించడానికి.. ఏపీ, ఒడిశా మోడళ్లను స్వల్ప మార్పులతో అమలు చేయాలని సిఫార్సు చేసింది. కాగా ఒడిశాలో 16 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటిలో 14 అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కళాశాలలు కాగా, రెండింటిని పీజీ కోర్సుల కోసమే కేటాయించారు. వీటిలో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉండేది. దీనిని అధిగమించేందుకు ముఖ్యంగా కొత్త కళాశాలలు, ఏజెన్సీ ప్రాంతాల్లో 15 నుంచి 20 శాతం వరకు కాంట్రాక్ట్‌ పద్థతిలో అధ్యాపకులను నియమించుకున్నారు. జిల్లాల దూరం, గిరిజన జనాభా, రవాణా సౌకర్యాల ఆధారంగా ఒడిశా ప్రభుత్వం ప్రాంతాలను మూడు జోన్లుగా విభజించింది. వారు పనిచేేస జోన్‌ను బట్టి అదనపు ప్రోత్సాహకాలను కల్పించింది. కాలపరిమితితో కూడిన కెరీర్‌ అడ్వాన్స్‌మెంట్‌, డైనమిక్‌ అస్యూర్డ్‌ కెరీర్‌ ప్రోగ్రెషన్‌ పథకాలను అమలు చేస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో పనిచేసిన కాలానికి పీజీ కౌన్సిలింగ్‌, అడ్మిషన్లలో ప్రత్యేక గుర్తింపు (వెయిటేజీ) ఇస్తున్నారు. డాక్టర్లకు పోస్టింగ్‌ ఇవ్వగానే ఎలాంటి అదనపు దరఖాస్తులు లేకుండా ఈ ప్రోత్సాహకాలు ఆటోమేటిక్‌గా మంజూరవుతాయి. హెచ్‌ఆర్‌ఎంఎ్‌స ఆధారిత నిఘా, పారదర్శక బదిలీ విధానాల ద్వారా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ ఆర్థిక ప్రోత్సాహకాల వల్ల మారుమూల ప్రాంతాల్లోని వైద్య కళాశాలల్లో అధ్యాపకుల సంఖ్య పెరిగిందని ఒడిశా అధికారులు వెల్లడించారు.


తెలంగాణకు అధ్యయన బృందం సిఫార్సులివీ..

తెలంగాణలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రులను పట్టణ, గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల ఆధారంగా మూడంచెల విధానంలో వర్గీకరించాలి. మారుమూల, వెనుకబడిన జిల్లాల్లో పనిచేేస అధ్యాపకులు, సీనియర్‌, జూనియర్‌ రెసిడెంట్లకు జోన్ల వారీగా అదనపు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించాలి. కొత్త మెడికల్‌ కాలేజీల్లో ఖాళీల భర్తీకి కాంట్రాక్ట్‌ అధ్యాపకులకూ వీటిని వర్తింపజేయాలి. ఏజెన్సీ ప్రాంతాల్లోని అధ్యాపకులకు పదోన్నతులు, బదిలీల్లో ప్రాధాన్యం, పీజీ అడ్మిషన్ల వెయిటేజీతో ముడిపెట్టాలి. గుర్తించిన జిల్లాల్లో దశలవారీగా అమలు చేయడానికి ఫైనాన్షియల్‌ అసె్‌సమెంట్‌ చేపట్టాలి. భారీ ఆర్థిక ప్రోత్సాహకాలు, పారదర్శకమైన బదిలీ విధానాలు, కెరీర్‌ పురోగతి కలిపి ఇస్తే మారుమూల ప్రాంతాల్లో వైద్యుల లభ్యతను పెంచవచ్చని ఒడిశా మోడల్‌ నిరూపించింది. తెలంగాణ ప్రభుత్వం దీనిని ప్రామాణిక గైడ్‌లైన్‌గా తీసుకోవచ్చని అధికారుల బృందం తమ నివేదికలో స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇలా....

ఏపీలోనూ దూరాన్ని బట్టి రెండు కేటగిరీలుగా విభజించారు. 12 వైద్య కళాశాలలను ఈ ఇన్సెంటివ్‌ పరిధిలోకి తెచ్చారు. ఇందులో 5 మెడికల్‌ కాలేజీలను 50 శాతం ఇన్సెంటివ్‌ పరిధిలోకి, మరో ఏడింటిని 30 శాతం పరిధిలోకి తెచ్చారు. ప్రొఫెసర్‌కు రూ.2 లక్షల జీతం ఉంటే అదనంగా మరో రూ.లక్ష ఇన్సెంటివ్‌ ఇచ్చారు. అదనపు ప్రోత్సాహకాలివ్వడంతో దాదాపు 90 శాతం ఆక్యుపెన్సీ పెరిగినట్లు అధ్యయనంలో వెల్లడైంది.

Updated Date - Jul 06 , 2026 | 03:08 AM