OC JAC Leaders: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై దుష్ప్రచారాన్ని ఆపాలి
ABN , Publish Date - Jan 12 , 2026 | 04:34 AM
రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై ప్రజలను మభ్యపెడుతూ కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆపాలని ఓసీ జేఏసీ నాయకులు అన్నారు.
జాతీయస్థాయిలో ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలి
ఓసీ జేఏసీ నాయకుల డిమాండ్
సుబేదారి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై ప్రజలను మభ్యపెడుతూ కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆపాలని ఓసీ జేఏసీ నాయకులు అన్నారు. హనుమకొండలోని సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో ఆదివారం ఓసీ జేఏసీ సింహగర్జన బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఓసీ పేదల హక్కుల కోసం కొట్లాడాల్సిన అవసరం ఉందని, తమ హక్కులను ఎవరైనా గుంజుకోవడానికి ప్రయత్నిస్తే ఐక్యంగా పోరాడాలని పేర్కొన్నారు. ఓసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్‌రెడ్డికి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అనంతరం ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్‌రెడ్డి, గౌరవ అధ్యక్షులు గంగు ఉపేంద్రశర్మ, పోలాడి రామారావులు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేసే సంక్షేమ పథకాలను ఓసీలలోని నిరుపేదలకు వర్తించాలని, జాతీయస్థాయిలో ఓసీ కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.