స్థూలకాయం, మధుమేహంఈ శతాబ్దపు అతిపెద్ద ఆరోగ్య సవాల్
ABN , Publish Date - Feb 18 , 2026 | 06:53 AM
భవిష్యత్తులో వృద్థి ఒక్కో ఔషధ అణువుతో కాకుండా ఆవిష్కరణ, అభివృద్థి, తయారీ, అనలిటిక్స్, డిజిటల్ టూల్స్, పెట్టుబడి వంటి అంశాలను సమగ్రంగా కలిపే ప్లాట్‌ఫామ్‌ల ద్వారా...
కొత్త చికిత్సలు కాదు.. .నివారణకూ సమ ప్రాధాన్యమివ్వాలి.. భారత్‌లో మెటబాలిక్ వ్యాధుల విస్పోటనం
నైపుణ్యం కాదు, ఆవిష్కరణ నాయకత్వ లక్షణాలుండాలి
బయోఏషియా సదస్సులో వక్తలు
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్తులో వృద్థి ఒక్కో ఔషధ అణువుతో కాకుండా ఆవిష్కరణ, అభివృద్థి, తయారీ, అనలిటిక్స్, డిజిటల్ టూల్స్, పెట్టుబడి వంటి అంశాలను సమగ్రంగా కలిపే ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సాధ్యమవుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. 2026 నుంచి 2030 వరకు వృద్థి ఎక్కడి నుంచి వస్తుంది? ఏ మార్పులు ఈ రంగాన్ని మలుపుతిప్పనున్నాయి? అనే అంశాలపై హైదరాబాద్‌లో నిర్వహించిన బయోఏషియా సదస్సులో నిపుణులు చర్చించారు. భారత్‌లో దీర్ఘకాలిక మెటబాలిక్ వ్యాధులు విపరీతంగా పెరుగుతున్నాయని, ఇవి కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్నాయని, దేశ జీడీపీకి సుమారు 2.5శాతం వరకు భారం పడుతోందని నోవో నార్డిస్క్ ఇండియా ఎండీ విక్రాంత్ శ్రోత్రియా అన్నారు. జీఎల్‌పీ-1 ఆధారిత చికిత్సలు ఆరంభ మాత్రమేనని, ఇక ముందు ఆరోగ్య కాలాన్ని పెంచే దిశగా మెటబాలిక్ ఆవిష్కరణలు రానున్నాయని చెప్పారు. డాక్టర్ పీటర్ పియోట్ మాట్లాడుతూ కొవిడ్ మహమ్మారి సమయంలో వేగవంతమైన ఆర్‌అండ్‌డీ, అనువైన తయారీ వ్యవస్థలు, నియంత్రణ అనుమతులు సాధ్యమయ్యాయని గుర్తుచేశారు. అయితే సైన్స్‌పై ప్రజలకు నమ్మకం తగ్గడం, స్థిరమైన నిధుల లోపం భవిష్యత్తు సన్నద్ధతకు ప్రమాదకరమని హెచ్చరించారు. స్థూలకాయం, మధుమేహం ఈ శతాబ్దపు అతిపెద్ద ఆరోగ్య సవాళ్లుగా మారాయని, ఇవి సునామీలా మారుతున్నాయని హెచ్చరించారు. కేవలం కొత్త చికిత్సలే కాకుండా, నివారణకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అమిత్ మూకిమ్ వెల్లడించిన వివరాల ప్రకారం భారత్ ప్రపంచ ఖర్చులలో 10శాతం కంటే తక్కువ వ్యయంతో కార్-టీ థెరపీ అందించగలిగిందన్నారు. ఇది సామర్థ్యం, చౌకదనం విషయంలో ఉన్న అపోహలను పొగొట్టిందని అభిప్రాయపడ్డారు. అయితే ప్లాట్‌ఫారమ్ ఐపీ, ఎకోసిస్టమ్ మౌలిక వసతులు బలోపేతం చేయడం అత్యవసరమని స్పష్టం చేశారు. ఏడీసీలు, ఎక్స్‌డీసీలు, ఒలిగోన్యూక్లియోటైడ్స్, సెల్ అండ్ జీన్ థెరపీలు (సీజీటీ) వంటి కొత్త విధానాలు దీర్ఘకాలిక లాభాలకు దారితీస్తాయని పేర్కొన్నారు.
బయోసిమిలార్స్... వంద బిలియన్ డాలర్ల అవకాశం
2030 నాటికి పేటెంట్ గడువు ముగియనున్న బయోలాజిక్స్ కారణంగా బయోసిమిలార్స్ రంగంలో 100--120 బిలియన్ డాలర్ల మార్కెట్ అవకాశముందని ప్యానెలిస్టులు అభిప్రాయపడ్డారు. అమెరికాలో మారుతున్న నియంత్రణ విధానాలు అనలిటిక్స్ ఆధారిత అనుమతులకు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో, భారత్ తన విశ్లేషణ సామర్థ్యాన్ని, తయారీ స్థాయిని, నియంత్రణ విశ్వసనీయతను పెంచుకుంటే పెద్ద అవకాశాలు దక్కుతాయని తెలిపారు. పెట్టుబడిదారుల అభిప్రాయం ప్రకారం భారత్‌లో నియంత్రణ అనుమతుల ఆలస్యం ప్రధాన ప్రతికూలతగా మారింది. చైనాతో పోలిస్తే రిస్క్ క్యాపిటల్ ప్రవాహం తక్కువగా ఉండటానికి ఇదే కారణమని పేర్కొన్నారు. వేగవంతమైన అనుమతులు, అకాడమియా-ఇండస్ర్టీ భాగస్వామ్యం, సమన్వయ ఎకోసిస్టమ్ విస్తరణ అవసరమని సూచించారు. మొత్తంగా భారత్ కేవలం అమలు నైపుణ్యంతో కాకుండా ఆవిష్కరణ నాయకత్వం వైపు అడుగులు వేయాల్సిన సమయం వచ్చిందని ప్యానెల్ ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. బయోసిమిలార్స్, కొత్త థెరపీ విధానాలు, నివారణ వైద్యానికి ప్రాధాన్యం, అంతర్జాతీయ భాగస్వామ్యాలతోనే నిర్మాణాత్మక వృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. ఈ చర్చలో పీటర్ పైట్ (యూరోపియన్ యూనియన్ ఆరోగ్య భద్రత ప్రత్యేక సలహాదారు), విక్రాంత్ శ్రోత్రియా (ఎండీ, నోవో నార్డిస్క్ ఇండియా), గియులియానో పెర్ఫెట్టి (సీఈఓ,ఎండీ, జూబిలెంట్ బయోసిస్ లిమిటెడ్), శ్రీనాథ్ వెంకటేశ్ (ఎండీ, ఇండియా- దక్షిణాసియా, థర్మో ఫిషర్ సైంటిఫిక్), అమిత్ మూకిమ్ (సీఈవో, ఇమ్యునీల్ థెరప్యూటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్), హరి బుగ్గన (ఫౌండర్, చైర్మన్, ఇన్‌వాస్కెంట్) పాల్గొన్నారు. చర్చను సురేశ్ సుబ్రమణియన్ (పార్ట్నర్, నేషనల్ లైఫ్ సైన్సెస్ లీడర్,) నిర్వహించారు.