Share News

ఓబీసీ గణన చేసేదాకా పోరాటం ఆగదు

ABN , Publish Date - May 11 , 2026 | 06:36 AM

జనగణనలో ఓబీసీ గణన చేసేదాకా తమ పోరాటం ఆగదని ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు చెప్పారు.

ఓబీసీ గణన చేసేదాకా పోరాటం ఆగదు

  • తేల్చి చెప్పిన ప్రభుత్వ సలహాదారు వీహెచ్‌

రాంనగర్‌జ/హైదరాబాద్‌, మే 10(ఆంధ్రజ్యోతి): జనగణనలో ఓబీసీ గణన చేసేదాకా తమ పోరాటం ఆగదని ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు చెప్పారు. జనగణనలో బీసీల లెక్కలు తేల్చాలని కోరుతూ ఆయన బాగ్‌అంబర్‌పేటలోని తన నివాసం వద్ద 2రోజుల పాటు నిరాహార దీక్ష నిర్వహించారు. ఆదివారం రాత్రి ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, జాజుల శ్రీనివాస్ గౌడ్‌ తదితరులు వీహెచ్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. ఈ సందర్భంగా వీహెచ్‌ మాట్లాడుతూ పరేడ్‌గ్రౌండ్‌ బహిరంగ సభలో ప్రధాని మోదీ బీసీల డిమాండ్లపై మాట్లాడకపోవడం బాధాకరమన్నారు.


కులగణన చేపట్టకపోతే ప్రధాని నివాసాన్ని ముట్టడిస్తాం

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తక్షణమే కులగణన చేపట్టకపోతే భవిష్యత్తులో ప్రధాని మోదీ నివాసాన్ని ముట్టడిస్తామని అఖిలపక్ష నేతలు, బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు హెచ్చరించారు. మోదీ రాష్ట్ర పర్యటనను నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో ఆదివారం గన్‌ పార్క్‌ వద్ద నల్లజెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ.. ఢిల్లీ వేదికగా కులగణన చేస్తామని హామీ ఇచ్చిన ప్రధాని ఆ అంశాన్ని విస్మరించడం బీసీ సమాజాన్ని తలదించుకునేలా చేయడమేనని విమర్శించారు. తాము సంధించిన పది ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కేంద్రం మౌనం వహిస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాలు ఆరంభం మాత్రమేనని.. కేంద్రం వైఖరి మార్చుకోకపోతే ప్రధాని పర్యటనలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ.. బీసీలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. షాద్‌నగర్‌ ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్‌, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌, సీపీఐ ఎమ్మెల్సీ సత్యం, అబ్బాస్‌ పాల్గొన్నారు.

Updated Date - May 11 , 2026 | 06:36 AM