Tummla Nageshwara Rao: సంక్షేమం.. అభివృద్ధికి ఆదర్శనీయుడు ఎన్టీఆర్
ABN , Publish Date - Jan 12 , 2026 | 04:58 AM
అభివృద్ధికి, సంక్షేమానికి కుల, మతాలకతీతంగా, నీతి, నిజాయితీగా పని చేసిన నేత.. యుగపురుషుడు ఎన్టీఆర్ అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.
హైదరాబాద్ తర్వాత అభివృద్ధి చెందుతున్న సిటీ ఖమ్మం
ఖమ్మం నుంచే అన్ని జాతీయ రహదారులు
ఎన్టీఆర్ పార్కు ప్రారంభోత్సవంలో మంత్రి తుమ్మల
ఖమ్మం, జనవరి 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అభివృద్ధికి, సంక్షేమానికి కుల, మతాలకతీతంగా, నీతి, నిజాయితీగా పని చేసిన నేత.. యుగపురుషుడు ఎన్టీఆర్ అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఆయన పేరుతో ఖమ్మంలో ఏర్పాటు చేసుకున్న పార్కును ప్రారంభించడం అందరికీ గర్వ కారణమని పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని బ్యాంకు కాలనీలో రూ.కోటి వ్యయంతో నిర్మించిన పార్కును ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రాజకీయాల్లో నీతి, నిజాయితీతోపాటు నిబద్ధతను, పట్టుదలను సమాజానికి నేర్పించి నలు దిక్కులా తెలుగుజాతి గౌరవాన్ని వ్యాపింపజేసిన మహా నేత ఎన్టీఆర్ పేరుతో పార్కు ప్రారంభించడం ఆదర్శనీయమన్నారు. అన్ని మతాలు, కులాలు, అన్ని పార్టీలను గౌరవించిన నేత అని తుమ్మల గుర్తు చేశారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అభివృద్ధి చెందుతున్న నగరం ఖమ్మం అని పేర్కొన్నారు. దేశంలో భాగ్యనగరం మాదిరే రాష్ట్రంలో ఖమ్మం సిటీ అందరినీ అక్కున చేర్చుకుని.. వారి అభివృద్ధికి తోడ్పాటునిస్తుందన్నారు. తద్వారా అన్ని వర్గాల లివింగ్ సిటీగా ఆదరణ కలిగి ఉందని చెప్పారు. జాతీయ రహదారులన్నీ ఖమ్మం మీదుగానే వెళుతున్నాయన్న తుమ్మల.. వాటి నిర్మాణం పూర్తయితే తెలంగాణలోనే ఖమ్మం నివాస యోగ్యమైన ప్రధాన నగరంగా నిలువనుందన్నారు.