Share News

ఎన్టీఆర్‌ విగ్రహానికి నిప్పు!

ABN , Publish Date - Jun 07 , 2026 | 06:32 AM

టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్‌ విగ్రహంపై కొందరు దుండగులు పెట్రోల్‌ పోసి నిప్పంటించగా.. విగ్రహం పాక్షికంగా దగ్ధమైంది.

ఎన్టీఆర్‌ విగ్రహానికి నిప్పు!

  • నల్లగొండలో పెట్రోల్‌ పోసి నిప్పంటించిన దుండగులు

  • పాక్షికంగా ధ్వంసమైన విగ్రహం.. పోలీసుల దర్యాప్తు

నల్లగొండ/హైదరాబాద్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్‌ విగ్రహంపై కొందరు దుండగులు పెట్రోల్‌ పోసి నిప్పంటించగా.. విగ్రహం పాక్షికంగా దగ్ధమైంది. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్‌ రోడ్డులో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఇది గమనించిన మునిసిపల్‌ కార్మికులు మంటలను ఆర్పేశారు. విష యం తెలుసుకున్న టీడీపీ నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గ కన్వీనర్‌ కసిరెడ్డి శేఖర్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ శరత్‌చంద్రపవార్‌కు ఫిర్యాదు చేశారు. తక్షణమే దుండగులను గుర్తించి శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఎన్టీఆర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అయితే విగ్రహానికి కావాలనే ఎవరైనా నిప్పు పెట్టారా.. లేదా షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి విగ్రహంపై ఉన్న పూల మాలలకు నిప్పంటుకుందా అనేది తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించే పనిలో పడ్డారు.

ఇది చాలా బాధాకరం..: బక్కని

సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు అంటూ సేవ చేసిన మాజీ సీఎం ఎన్టీఆర్‌ విగ్రహానికి నిప్పు పెట్టడం చాలా బాధాకరమని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు వ్యాఖ్యానించారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - Jun 07 , 2026 | 06:32 AM