Share News

నేడు ఎన్‌టీఆర్‌ విగ్రహావిష్కరణ

ABN , Publish Date - May 28 , 2026 | 03:48 AM

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని అమీర్‌పేట ...

నేడు ఎన్‌టీఆర్‌ విగ్రహావిష్కరణ

  • మైత్రీవనం చౌరస్తాలో ఆవిష్కరించనున్న సీఎం రేవంత్‌

  • జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల హామీ మేరకు ఏర్పాటు

  • పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల

హైదరాబాద్‌ సిటీ, బంజారాహిల్స్‌/యూసు్‌ఫగూడ, మే 27(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తాలో సీఎం రేవంత్‌రెడ్డి గురువారం అవిష్కరించనున్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ప్రచార సమయంలో ఎన్‌టీఆర్‌ విగ్రహ ఏర్పాటుపై రేవంత్‌ హామీ ఇచ్చారు. ఎన్‌టీఆర్‌ అభిమానుల చిరకాల కోరికను తాను నెరవేరుస్తానని చెప్పారు. ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్‌ యాదవ్‌.. ఎన్‌టీఆర్‌ విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారుచేయించారు. విగ్రహ పనులను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌తో కలసి పరిశీలించారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్‌తో పాటు ఎన్‌టీఆర్‌ అభిమానులు, కమ్మ కార్పొరేషన్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. 23 అడుగుల కాంస్య విగ్రహాన్ని సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ శిల్పి డి.రాజ్‌కుమార్‌ ఉడయార్‌ 2నెలల పాటు శ్రమించి విగ్రహాన్ని సిద్ధ్దం చేశారు.

ట్రాఫిక్‌ ఆంక్షలు : విగ్రహావిష్కరణ, బహిరంగ సభ నేపథ్యంలో మైత్రీవనం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలను విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ జోయల్‌డేవిస్‌ తెలిపారు. మే 28 గురువారం రాత్రి 10 గంటల వరకు మైత్రీవనం జంక్షన్‌లో ఆంక్షలుంటాయని తెలిపారు. అమీర్‌పేట్‌, సత్యం థియేటర్‌, ఎస్‌ఆర్‌నగర్‌, సారథీ స్టూడియోస్‌ వైపు నుంచి జూబ్లీ చెక్‌పోస్ట్‌ వైపునకు వచ్చే వాహనాలను వెంగళరావునగర్‌, కళ్యాణ్‌నగర్‌, కృష్ణకాంత్‌ పార్క్‌ వైపునకు పంపుతారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సత్యం ధియేటర్‌ వైపు నుంచి జూబ్లీ చెక్‌పోస్ట్‌ వైపునకు వెళ్లే వాహనాలను పంజాగుట్ట మీదుగా చెక్‌పోస్ట్‌ వైపునకు పంపుతారు. యూస్‌ఫగూడ నుంచి మైత్రీవనం వైపునకు వచ్చే వాహనాలను కృష్ణకాంత్‌ పార్క్‌, కళ్యాణ్‌నగర్‌ వైపునకు మళ్లించారు. యూస్‌ఫగూడ బస్తీ వైపు నుంచి అమీర్‌పేట్‌కు వచ్చే వాహనాలను అల్‌సభా హోటల్‌ నుంచి వెంగళ్‌రావ్‌నగర్‌ వైపునకు పంపుతారు. వాహనదారులు ట్రాఫిక్‌ ఆంక్షలను దృష్టిలో పెట్టుకొని, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని కోరారు.

Updated Date - May 28 , 2026 | 03:48 AM