Share News

విద్యార్థుల భవిత కోసమే ఎన్టీయేలో సంస్కరణలు

ABN , Publish Date - Jul 26 , 2026 | 05:50 AM

విద్యార్థుల భవిష్యత్తు కోసమే కేంద్ర ప్రభుత్వం ఎన్టీయే(నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ)లో సంస్కరణలు చేపట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు తెలిపారు.

విద్యార్థుల భవిత కోసమే ఎన్టీయేలో సంస్కరణలు

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు

  • మాకు పార్టీ కంటే దేశమే ముఖ్యం

  • ప్రధాన్‌ రాజీనామాపై బండి సంజయ్‌

హైదరాబాద్‌, జులై 25 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల భవిష్యత్తు కోసమే కేంద్ర ప్రభుత్వం ఎన్టీయే(నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ)లో సంస్కరణలు చేపట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం లేదా ఇతర కారణాల వల్ల లోపాలు జరిగిన నేపథ్యంలో 47 మంది అధికారులను బదిలీ చేసి, తప్పు చేసిన వారిని ఉపేక్షించబోమనే సంకేతాలను కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చాటిందన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టేందుకు 2024లో తీసుకొచ్చిన పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) చట్టాన్ని మరింత కఠినతరం చేస్తూ పార్లమెంట్‌లో సవరణలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ఈ సవరణలతో పరీక్షా పత్రాల లీకేజీ, అవకతవకలకు పాల్పడిన వారిపై మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం కలుగుతుందన్నారు. ఇక, ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాపై స్పందించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌.. బీజేపీ శ్రేణులకు పార్టీ కంటే దేశమే ముఖ్యమని పేర్కొన్నారు. ప్రధాన్‌ రాజీనామా నిర్ణయం పార్టీ విలువలను ప్రతిబింబిస్తుందని ఎక్స్‌లో పొస్టు చేశారు.


ఐదు కార్పొరేషన్లలో గెలుపే లక్ష్యం

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరగాల్సి ఉన్న ఐదు మున్సిపల్‌ కార్పొరేషన్‌లలో గెలుపే లక్ష్యంగా బీజేపీ కార్యాచరణ ఉండాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్‌ తమ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి పిలుపునిచ్చారు. జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్‌, మల్కాజ్‌గిరి, వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లలో ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటుచేయాలని అన్నారు. పార్టీ ఇన్‌చార్జులను నియమించి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలన్నారు. పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని మండలాల్లో మోర్చాల కమిటీలను వెంటనే భర్తీ చేయాలని సూచించారు. పార్టీ కోర్‌ కమిటీ, ఐదు కార్పొరేషన్‌ల జిల్లా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర పదాధికారులతో సమావేశమైన బన్సల్‌ ఈ సూచనలు చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు, కేంద్ర మంత్రులు బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2026 | 05:52 AM