Share News

నోటీసులు ఆంగ్లంలోనా... ‘సర్‌’!

ABN , Publish Date - Aug 27 , 2026 | 06:14 AM

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం జారీ చేస్తున్న నోటీసులు ఓటర్లను తీవ్ర అయోమయానికి గురిచేస్తున్నాయి

నోటీసులు ఆంగ్లంలోనా... ‘సర్‌’!
SIR LOGO

  • తెలుగులో ఇవ్వాలంటూ ఓటర్ల డిమాండ్‌

  • అర్థంకాని సాంకేతిక పదాలు..

  • ఓటు పోతుందేమోనని ఆందోళన

  • ద్విభాషా విధానంలో నోటీసులు జారీ చేయాలని ప్రజాసంఘాల విజ్ఞప్తి

హైదరాబాద్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం జారీ చేస్తున్న నోటీసులు ఓటర్లను తీవ్ర అయోమయానికి గురిచేస్తున్నాయి. ఈ నోటీసులు ఆంగ్లంలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. తెలుగు మాత్రమే తెలిసిన వారు, గ్రామీణ ప్రజలే కాకుండా.. పట్టణాల్లో సాధారణ ఇంగ్లీష్‌ తెలిసిన వారు కూడా నోటీసులోని చట్టపరమైన, సాంకేతిక పదజాలాన్ని సరిగా అర్థం చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక కారణాల వల్ల లేదా నిర్ణీత గడువులోగా స్పందించకపోతే తమ ఓటు ఎక్కడ తొలగిపోతుందోనన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. నోటీసుల్లో ఏముందో తెలుసుకోవడానికి పలువురు ఓటర్లు బూత్‌స్థాయి అధికారులు (బీఎల్‌ఓ), రాజకీయ పార్టీల ప్రతినిధుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.

తెలుగులోనే నోటీసులు ఇవ్వాలి

భాషా సమస్య కారణంగా ఏ ఒక్కరూ తమ ప్రాథమిక ఓటు హక్కు కోల్పోకూడదని ప్రజాసంఘాలు అభిప్రాయపడుతున్నాయి. తెలంగాణలో మెజారిటీ ప్రజలకు తెలుగులోనే సమాచారం సులభంగా అర్థమవుతున్నందున, ఓటర్లకు పంపే ఎస్‌ఐఆర్‌ నోటీసులను తెలుగు-ఇంగ్లిష్‌ ద్విభాషా విధానంలో జారీ చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.


ఆన్‌లైన్‌ నోటీసులు అందుబాటులోకి తేవాలి

మరోవైపు, భౌతిక నోటీసుల జారీలో జరుగుతున్న జాప్యాన్ని నివారించడానికి ఆన్‌లైన్‌ విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. ఇల్లు మారిన ఓటర్లను గుర్తించడం, ఒకే ఇంటికి పలుమార్లు వెళ్లాల్సి రావడం వంటి సమస్యలతో బీఎల్‌ఓలు తీవ్ర పనిభారాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నోటీసు కాపీని ఎస్‌ఎంఎస్‌, వాట్సాప్‌ ద్వారా పంపడంతో పాటు ఎన్నికల సంఘం అధికారిక యాప్‌, వెబ్‌సైట్‌ లాగిన్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకునే సౌకర్యం కల్పిస్తే సమస్య తీరుతుందని ఓటర్లు చెబుతున్నారు. డిజిటల్‌ విధానం వల్ల నోటీసు పంపిన తేదీ, స్పందించాల్సిన గడువు స్పష్టంగా నమోదై పారదర్శకత పెరుగుతుందని బీఎల్‌ఓలు కూడా భావిస్తున్నారు. అయితే స్మార్ట్‌ఫోన్‌, ఇంటర్నెట్‌ సౌకర్యం లేని వృద్ధులు, గ్రామీణ ప్రాంత ప్రజల కోసం బీఎల్‌ఓల ద్వారా నేరుగా నోటీసులు అందజేసే ప్రత్యామ్నాయ భౌతిక విధానాన్ని కూడా కొనసాగించాలని ప్రజలు సూచిస్తున్నారు.

Updated Date - Aug 27 , 2026 | 06:14 AM