Share News

kumaram bheem asifabad- ఏదీ మాకు ‘చేయూత’

ABN , Publish Date - Mar 12 , 2026 | 11:11 PM

చేయూత పింఛన్ల కోసం దరఖాస్తుదారులు ఆశగా వేచి చూస్తున్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం చేయూత పథకం కింద కొత్తగా పింఛన్‌ మంజూరు చేస్తామని, ఉన్న పింఛన్లను రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీ రెండేళ్లు గడుస్తున్నా నెరవేరకపోవడంతో లబ్ధిదారులు, అర్హులు ఆందోళన చెందుతున్నారు.

kumaram bheem asifabad- ఏదీ మాకు ‘చేయూత’
లోగో

- దరఖాస్తులు స్వీకరించి రెండేళ్లు గడుస్తున్నా కలగని మోక్షం

- కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న దరఖాస్తుదారులు

- జిల్లాలో 56,225 మంది లబ్ధిదారులు

బెజ్జూరు, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): చేయూత పింఛన్ల కోసం దరఖాస్తుదారులు ఆశగా వేచి చూస్తున్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం చేయూత పథకం కింద కొత్తగా పింఛన్‌ మంజూరు చేస్తామని, ఉన్న పింఛన్లను రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీ రెండేళ్లు గడుస్తున్నా నెరవేరకపోవడంతో లబ్ధిదారులు, అర్హులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన, గ్రామ వార్డుసభల్లో వృద్ధాప్య వితంతు, చేనేత, దివ్యాంగులు తదితర పింఛన్ల కోసం సుమారు ఐదువేలకుపైగా దరఖాస్తులు చేసుకున్నారు. వీరికి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయలేదు. ఎన్నికల సందర్భంగా దివ్యాంగులకు 6,000, ఇతరులకు 4,000 పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరికి పింఛన్‌ పెంచకపోవడం గమనార్హం. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.2,016 పెన్షన్‌ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే ఆసరా పెన్షన్లు రెండింతలు చేస్తామని, కుటుంబంలో ఇద్దరికి సమానంగా పెన్షన్లు ఇస్తామని 2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నాయకులు హామీ ఇచ్చారు. కాని ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా హామీ అమలు కావడం లేదని పింఛన్‌దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న పెన్షన్‌ తమ అవసరాలకు ఉపయోగపడుతున్నప్పటికీ ప్రస్తుతం నిత్యవసరాల ధరలు భారీగా పెరుగడంతో ప్రభుత్వం పింఛన్‌ డబ్బులు ఏ మాత్రం సరి పోవడం లేదని చెబుతున్నారు.

- ఎన్నికల హామీలో భాగంగా..

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీ పథకాలు అమలులో భగంగా నిమగ్నమైన ప్రభుత్వం పెన్షన్‌ పెంపు విషయం మరిచి పోయిందని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో కొలువు తీరిన ప్రభుత్వం తమ పింఛన్‌ పెంచుతుందని ఎన్నో ఆశలు ప్రభుత్వంపై పెట్టుకున్నామని వాపోతున్నారు. వృద్ధులకు ఇచ్చే పెన్షన్‌ రూ.2016 నుంచి రూ.4016కు, దివ్యాంగుల పెన్షన్‌ రూ.4016 నుంచి రూ.6016కు పెంచుతామని కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ ప్రకారం చేయూత పింఛన్లు పెంచి ఆదుకోవాలని లబ్ధిదారులు ఆశతో ఎదురు చూస్తున్నారు. పలుమార్లు పింఛన్లను పెంచుతామని ప్రకటించినా ఇప్పటికి ఆచరణలో అమలు కాలేదు. దీంతో వారి ఆశలు నెరవేరడం లేదు. ఎవరూ లేని అనాథలకు పింఛన్లు ఆసరాగా ఉంటుందనుకున్న వారికి నిరాశే దక్కింది. ప్రస్తుతం పాత పింఛన్లే కొనసాగుతున్నాయి.

- జిల్లా వ్యాప్తంగా..

జిల్లాలో మొత్తం పదిహేను మండలాల పరిధిలో 56,225 మంది పెన్షన్‌ దారులున్నారు. ఇందులో వృద్ధాప్య పింఛన్‌దారులు 24,235, దివ్యాంగులు 5,974, వితంతులు 22.095, చేనేత పెన్షన్లు 489, గీతా కార్మికులు 139, బీడీ కార్మికులు 86, ఒంటరి మహిళల 2,605, ఫైలేరియా బాదితులు 567, డయాలసిస్‌ బాధితులు 30 మంది ఉన్నారు. వీరికి ప్రతి నెల 13కోట్లపై చిలుకు రూపాయిలను ఆసరా పెన్షన్ల ద్వారా అందజేస్తున్నారు. కాగా జిల్లాలో భర్తలు కోల్పోయిన మహిళలు ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. దివ్యాంగులు సైతం ప్రభుత్వం నుంచి పింఛన్‌ అందక అవస్థలు పడుతున్నారు. కేవలం వృద్ధాప్య పింఛన్లకు సంబంధించి భర్తకు పింఛన్‌ ఉండి ఆయన మరణిస్తే ఆ వెంటనే ఆయన భార్యకు, భార్యకు పింఛన్‌ ఉండి ఆమె మరణిస్తే భర్తకు పింఛన్‌ మంజూరు చేస్తున్నారు. కానీ కొత్తగా ఎవరు దరఖాస్తు చేసుకున్నా కూడా పింఛన్లు మంజూరు చేయకపోవడంతో అనేక కుటుంబాలు పింఛన్లు ఎప్పుడు మంజూరు చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఇలా జిల్లాలో వివిధ రకాల పింఛన్ల కోసం సుమారు ఐదువేల మందికిపైగా దరఖాస్తులు చేసుకున్నారు. ఆరు గ్యారెంటీ పథకాల్లో భాగంగా చేయూత కింద ప్రస్తుతం ఇస్తున్న పింఛన్లను రెట్టింపు చేస్తామని, అర్హులైన వారికి కొత్తగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. ఆ మేరకు ప్రజాపాలన ద్వారా దరఖాస్తులను స్వీకరించింది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం కొత్తవారికి పింఛన్లు మంజూరు చేయకపోగా, ఉన్న పింఛన్లను పెంచకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

మాట నిలబెట్టుకోవాలి..

- కొప్పుల రాములు, ఎల్కపల్లి

ఎన్నికల సమయంలో పింఛన్ల పెంపుపై ప్రభుత్వం ఇచ్చిన హామీ మాట నిలబెట్టుకోవాలి. కాంగ్రెస్‌ ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ప్రభుత్వ హామీ నెరవేరలేదు. ప్రస్తుతం నిత్యవసర ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో రూ.2016ఇచ్చే చేయూత సరిపోవడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను రెట్టింపు చేయాలి.

Updated Date - Mar 12 , 2026 | 11:11 PM