Share News

రాజ్యసభ ఎన్నికలకు.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

ABN , Publish Date - Feb 26 , 2026 | 02:33 AM

తెలంగాణకు సంబంధించి ఏప్రిల్‌లో ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ గురువారం ఉదయం 11 గంటలకు విడుదల కానుంది.

రాజ్యసభ ఎన్నికలకు.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

  • మార్చి 1, 3న విరామం.. తుదిగడువు మార్చి 5.. అభిషేక్‌ మను సింఘ్వికి ఇప్పటికే ఖరారైన సీటు

  • రెండో సీటు ఎవరికివ్వాలనే దానిపై తర్జనభర్జన

  • 2న హైదరాబాద్‌కు రాహుల్‌.. ఆ రోజే నిర్ణయం?

  • రెండో సీటు ‘రెడ్డి’ సామాజికవర్గానికే ఇచ్చే చాన్స్‌

  • బీఆర్‌ఎస్‌‌లో ఇంకా రాని స్పష్టత

  • మార్చి 16న పోలింగ్‌

  • అదే రోజు ప్రారంభం కానున్న బడ్జెట్‌ సమావేశాలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): తెలంగాణకు సంబంధించి ఏప్రిల్‌లో ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ గురువారం ఉదయం 11 గంటలకు విడుదల కానుంది. నోటిఫికేషన్‌ విడుదలైన వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. తుది గడువు మార్చి 5. అయితే.. మార్చి 1 ఆదివారం, 3న హోలీ సెలవుదినాలు కావడంతో ఆ రెండు రోజుల్లో నామినేషన్ల స్వీకరణకు విరామం ఉంటుందని ఎన్నికల అధికారి ఉపేందర్‌రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. కాగా.. రాజ్యసభ సీటుకు నామినేషన్‌ దాఖలు చేయడానికి ఒక్కో నామినేషన్‌పై పది మంది ఎమ్మెల్యేలు సంతకం చేయాల్సి ఉంటుందని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. ఈ రెండు సీట్లూ ఏకగ్రీవం కానున్నాయా.. లేక ఎన్నికలు జరగనున్నాయా అన్నదానిపై మార్చి 5వ తేదీ సాయంత్రానికి స్పష్టత రానుంది. ప్రధాన ప్రతిపక్షం తన సిటింగ్‌ సీటును కాపాడుకునే ప్రయత్నంలో అభ్యర్థిని బరిలోకి దించితే మాత్రం 16న పోలింగ్‌ జరుగుతుంది. అదే రోజున సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదేరోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలూ ప్రారంభం కానున్నాయి.


ఒక సీటు క్లియర్‌..

ఎన్నికలు జరగనున్న రెండు రాజ్యసభ సీట్లలో ఒకటి స్పష్టంగా కాంగ్రెస్‌ పార్టీది. ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు అభిషేక్‌ మను సింఘ్వినే తిరిగి ఆ సీటుకు అభ్యర్థిగా ప్రకటించడం దాదాపు ఖరారైంది. రెండోది.. బీఆర్‌ఎస్‌ సిటింగ్‌ సీటు. కానీ, దాన్ని నిలబెట్టుకోవడానికి శాసనసభలో అవసరమైన సంఖ్యాబలం బీఆర్‌ఎ్‌సకు లేదు. ఆ పార్టీ.. అభ్యర్థిని పెట్టి గెలిపించుకోవాలంటే ఇతర పార్టీలు ఎంఐఎం లేదా బీజేపీ సభ్యుల మద్దతు తీసుకోవాల్సి ఉంటుంది. అసలే ఆ పార్టీకి సంబంధించి పది మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం అధికార కాంగ్రెస్‌ పార్టీకి సన్నిహితంగా ఉన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు విప్‌ను ధిక్కరించి క్రాస్‌ ఓటింగ్‌ చేసినా.. అనర్హత నిబంధన వర్తించదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీకి సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఓటు వేస్తారన్న నమ్మకమూ లేదు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ తన సిటింగ్‌ సీటును నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఇక.. ఎన్నికలంటూ జరిగితే రెండో సీటునూ కాంగ్రెస్‌ పార్టీ దక్కించుకునే సమీకరణలు ప్రస్తుతం శాసనసభలో ఉన్న నేపథ్యంలో ఆ సీటు కోసం పార్టీలో పోటీ నెలకొని ఉంది. గతంలో ఒక రాజ్యసభ సీటు, రెండు ఎమ్మెల్సీ సీట్లు, విస్తరణలో ఒక మంత్రి పదవి బీసీలకే కేటాయించిన నేపథ్యంలో రెండో సీటు రెడ్డి సామాజిక వర్గానికే దక్కేందుకు ఎక్కువగా అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సీటుకు జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డిని రంగంలోకి దించాలన్న ఆలోచనలో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు. విపక్షాలకూ ఇబ్బంది లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా ఆయన్ను బరిలోకి దింపాలనే ఆలోచనా చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయన కాదంటే సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్‌ల పేర్లూ పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి ప్రభుత్వ సలహాదారు చిన్నారెడ్డి, రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి తదితరులు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. తనకు సీటు ఇవ్వాల్సిందిగా సీఎం రేవంత్‌ను, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ను కోరతానని కోదండరెడ్డి పేర్కొన్నారు. పార్టీపరంగా రాజ్యసభ సీటుకు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక.. బీసీ సామాజిక వర్గం నుంచి పార్టీ సీనియర్‌ నేత వి.హన్మంతరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ను రాజ్యసభకు పంపి.. ఆయన స్థానంలో మంత్రి అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీగా చేస్తారన్న ప్రచారమూ ఉంది. ఎస్సీ మాదిగ నుంచి ఏఐసీసీ సభ్యుడు సంపత్‌కుమార్‌ తన వంతు ప్రయత్నం చేసుకుంటున్నారు. అయితే వికారాబాద్‌లో జరుగుతున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరానికి మార్చి 2న రాహుల్‌గాంధీ వచ్చే అవకాశం ఉంది. అదే రోజున రేవంత్‌రెడ్డి, మహేశ్‌కుమార్‌ గౌడ్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌, పార్టీ సీనియర్‌ నేతలతో ఆయన భేటీ అయి.. రాజ్యసభ అభ్యర్థుల ఖరారుపై చర్చించనున్నట్లు చెబుతున్నారు.

Updated Date - Feb 26 , 2026 | 02:33 AM