ప్రత్యేక రైళ్లకు నోహాల్టింగ్
ABN , Publish Date - Nov 28 , 2026 | 12:36 AM
ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీదుగా దేశంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక రైళ్లు పరుగులు తీస్తున్నా.. స్థానిక ప్రయాణికులకు వాటి సేవలు అందడం లేదు. ప్రయాగ్‌రాజ్, కాన్పూర్, సుబేదార్‌గంజ్ నుంచి దక్షిణాది ప్రాంతాలకు నడుస్తున్న ప్రత్యేక వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు పెద్దపల్లి, రామగుండం, జమ్మికుంట రైల్వేస్టేషన్లలో హాల్టింగ్ కల్పించకపోవడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పెద్దపల్లి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీదుగా దేశంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక రైళ్లు పరుగులు తీస్తున్నా.. స్థానిక ప్రయాణికులకు వాటి సేవలు అందడం లేదు. ప్రయాగ్‌రాజ్, కాన్పూర్, సుబేదార్‌గంజ్ నుంచి దక్షిణాది ప్రాంతాలకు నడుస్తున్న ప్రత్యేక వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు పెద్దపల్లి, రామగుండం, జమ్మికుంట రైల్వేస్టేషన్లలో హాల్టింగ్ కల్పించకపోవడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైలును ప్రకటించిన రైల్వే శాఖ.. పెద్దపల్లి జంక్షన్‌లో స్టాప్ కల్పించింది.
ఎనిమిది రైళ్లు.. ఒక్క స్టాప్ లేదు...
రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట రైల్వే స్టేషన్ల మీదుగా ప్రయాగ్‌రాజ్, కాన్పూర్, సుబేదార్‌గంజ్ ప్రాంతాల నుంచి బెంగళూరు, హుబ్బళ్లి తదితర ప్రాంతాలకు ఎనిమిది ప్రత్యేక వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే వీటిలో ఒక్క రైలుకు కూడా ఉమ్మడి కరీంనగర్ పెద్దపల్లి, రామగుండం, జమ్మికుంట స్టేషన్లలో హాల్ట్ ఇవ్వలేదు. అదే సమయంలో సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్‌లో మొత్తం ఎనిమిది రైళ్లకు, మంచిర్యాలలో ఏడు, బెల్లంపల్లిలో ఐదు రైళ్లకు హాల్టింగ్ కల్పించారు. దీంతో పెద్దపల్లి, రామగుండం, జమ్మికుంట ప్రాంతాల ప్రయాణికులు పక్క జిల్లాల స్టేషన్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ప్రయాగ్‌రాజ్ వెళ్లాలంటే ఇబ్బందులే..
ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం, శక్తిపీఠాన్ని దర్శించుకునేందుకు తెలంగాణ నుంచి భక్తులు వెళ్తుంటారు. ప్రయాగ్‌రాజ్ నుంచి తిరుచానూరుకు నడిచే 04109/10 ప్రత్యేక రైలుతో పాటు, ప్రయాగ్‌రాజ్-హుభ్లి 04113/14, ప్రయాగ్‌రాజ్-యశ్వంత్‌పూర్ 04149/50, ప్రయాగ్‌రాజ్-ఎస్‌ఎంవీటీ బెంగళూరు 04151/52 రైళ్లకు సిర్పూర్ కాగజ్‌నగర్, మంచిర్యాల, బెల్లంపల్లి స్టేషన్లలో హాల్టింగ్ ఇచ్చారు. సుబేదార్‌గంజ్-యశ్వంత్‌పూర్ 04135/36, సుబేదార్‌గంజ్-ఎస్‌ఎంవీటీ బెంగళూరు 04171/72, కాన్పూర్-ఎస్‌ఎంవీటీ బెంగళూరు 04131/32, ప్రయాగ్‌రాజ్-చర్లపల్లి 04121/22 ప్రత్యేక రైళ్లకు పెద్దపల్లి, రామగుండం, జమ్మికుంటలకు మాత్రం మొండిచేయి చూపారు.
కాశీ తమిళ సంగమం రైళ్లదీ అదే పరిస్థితి
కన్యాకుమారి, కోయంబత్తూరు, చెన్నై సెంట్రల్ నుంచి వారణాసి (కాశీ) మధ్య ప్రవేశపెట్టిన ఏడు కాశీ తమిళ సంగమం ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లకు జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం స్టేషన్లలో హాల్టింగ్ కల్పించలేదు. అయితే మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లలో స్టాప్‌లు ఇచ్చారు. కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవాలనుకునే భక్తులు, వారణాసికి వెళ్లే ప్రయాణికులు ఈ నిర్ణయంతో నిరాశకు గురవుతున్నారు.
ఎంపీ చొరవ చూపాలంటున్న ప్రయాణికులు
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వేలాది మంది ప్రయాణికులు, భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రయాగ్‌రాజ్, కాన్పూర్, సుబేదార్‌గంజ్ నుంచి నడుస్తున్న ఎనిమిది ప్రత్యేక రైళ్లలో కనీసం నాలుగింటికైనా పెద్దపల్లిలో హాల్టింగ్ కల్పించేలా రైల్వే మంత్రి, దక్షిణ మధ్య రైల్వే జీఎంలకు వినతిపత్రం సమర్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
శబరిమల రైలు జమ్మికుంటలో నిలపాలి
అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలును ప్రకటించింది. 07171 నంబరుతో సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి కొల్లాంకు డిసెంబరు 11,25వ తేదీల్లో రెండు ట్రిప్పులు నడపనున్నారు. ఈ రైలు బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, కాజీపేట, చర్లపల్లి, సికింద్రాబాద్ తదితర స్టేషన్లలో ఆగనుంది. కొల్లాం నుంచి 07172 నంబరుతో హైదరాబాద్ నాంపల్లి వరకు తిరుగు ప్రయాణ రైలును నడపనున్నారు. ఈ రైలును జమ్మికుంటలో నిలపాలని భక్తులు కోరుతున్నారు. ఈ రైలు పెద్దపల్లి మీదుగా వెళ్లనున్న నేపథ్యంలో స్థానిక అయ్యప్ప భక్తులకు ప్రయాణం సులభం కానుంది. శబరిమల ప్రత్యేక రైలుకు సంబంధించిన రిజర్వేషన్ సదుపాయాన్ని ఇప్పటికే రైల్ వన్ యాప్, ఐఆర్‌సీటీసీ పోర్టల్‌లో అందుబాటులోకి తెచ్చారు. ప్రత్యేక రైళ్లు తమ ప్రాంతం మీదుగా వెళ్తున్నా హాల్టింగ్ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు.