Share News

గురుకుల అడ్మిషన్లలో దళారుల ప్రమేయం ఉండదు

ABN , Publish Date - Mar 25 , 2026 | 04:04 AM

రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశాల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని, ఇందులో మధ్యవర్తులు, దళారుల ప్రమేయానికి తావు లేదని ఎస్సీ, గిరిజన సంక్షేమ ...

గురుకుల అడ్మిషన్లలో దళారుల ప్రమేయం ఉండదు

  • ప్రతి నెలా 1-7 తేదీల మధ్యే.. డైట్‌, అద్దెలు, వేతనాలు, కాస్మెటిక్‌ చార్జీల చెల్లింపు

  • టీజీ సెట్‌-2026 ఫలితాలు విడుదల చేసిన మంత్రి అడ్లూరి

  • 18 మంది గిరిజన పారిశ్రామికవేత్తలకు రూ.8.16 కోట్ల సబ్సిడీ అందజేత

హైదరాబాద్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశాల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని, ఇందులో మధ్యవర్తులు, దళారుల ప్రమేయానికి తావు లేదని ఎస్సీ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ మాసాబ్‌ ట్యాంక్‌లోని ఎస్సీ గురుకుల భవనంలో టీజీ సెట్‌-2026 ఫలితాలను మంత్రి మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రవేశాల విషయంలో ఎవరైనా దళారులు ఆశ చూపితే నమ్మవద్దని తల్లిదండ్రులకు సూచించారు. ఇప్పటి వరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి జరుగుతున్న డైట్‌, కాస్మెటిక్స్‌, భవనాల అద్దెలు, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల వేతనాల చెల్లింపుల్లో ఇకపై జాప్యం ఉండదని మంత్రి ప్రకటించారు. ఏప్రిల్‌ నుంచి ప్రతి నెలా 1 నుంచి 7వ తేదీలోపు ఈ చెల్లింపులన్నీ పూర్తిచేసేలా ఉప ముఖ్యమంత్రి భట్టి అంగీకారం తెలిపారని, అందుకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. 2026-27 విద్యాసంవత్సరానికి గాను మొత్తం 635 విద్యాసంస్థల్లోని 51,284 సీట్ల భర్తీకి నిర్వహించిన టీజీ సెట్‌-2026కు 1,72,913 మంది విద్యార్థులు హాజరయ్యారని మంత్రి వివరించారు. మొదటి విడతలో 47,381 సీట్లను కేటాయించగా, ఎంపికైన విద్యార్థులు మార్చి 25 నుంచి ఏప్రిల్‌ 15వ తేదీలోపు తమకు కేటాయించిన పాఠశాలల్లో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు. ఇదే వేదికపై ‘సీఎం ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్‌ షిప్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ పథకం’ కింద రూ.23.44 కోట్ల విలువైన మంజూరు పత్రాలను, రూ.8.16 కోట్ల విలువైన సబ్సిడీ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం గిరిజన గురుకుల విద్యా సొసైటీలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి.. ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించే స్టూడియోను మంత్రి ప్రారంభించారు.

Updated Date - Mar 25 , 2026 | 04:04 AM