Share News

రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ కొరతలేదు!

ABN , Publish Date - Mar 25 , 2026 | 04:29 AM

రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యా్‌స(ఎల్‌పీజీ) కొరత ఏమాత్రం లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర స్పష్టం చేశారు.

రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ కొరతలేదు!

  • పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర

హైదరాబాద్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యా్‌స(ఎల్‌పీజీ) కొరత ఏమాత్రం లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర స్పష్టం చేశారు. ఇంధన సరఫరా వ్యవస్థ అంతా సజావుగానే సాగుతోందని, అన్ని జిల్లాల్లో కూడా ప్రజల రోజువారీ అవసరాలను తీర్చటానికి సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. కొన్ని పెట్రోల్‌ బంకుల వద్ద కన్పిస్తున్న రద్దీకి కొరత కారణం కాదని, ప్రజల్లో నెలకొన్న అనవసర భయాలే మూలమని ఆయన పేర్కొన్నారు. ఇంధన నిల్వలు అయిపోతున్నాయనే వదంతులు సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతుండడంతో ప్రజలు ఒక్కసారిగా బంకుల వద్ద క్యూ కడుతున్నారని కమిషనర్‌ తెలిపారు. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు(ఓఎంసీలు) ముందస్తు చెల్లింపు విధానంలో కొన్ని మార్పులు చేయడం వల్ల డీలర్లకు చిన్నపాటి సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని, ఇది కేవలం అంతర్గత పరిపాలనపరమైన విషయమేనని స్పష్టం చేశారు. పెట్రోల్‌ బంకుల్లో పరిస్థితులను పౌరసరఫరాల శాఖ, పోలీస్‌ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. ఇంధనాన్ని అక్రమంగా నిల్వ చేసినా, బ్లాక్‌ మార్కెట్‌కు తరలించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏమైనా సందేహాలుంటే పౌరసరఫరాల శాఖ టోల్‌ ఫ్రీ నెంబరు 1967కు ఫోన్‌ చేయాలని సూచించారు.

Updated Date - Mar 25 , 2026 | 04:29 AM