Krishna Board Clarifies: డీపీఆర్‌లను పరిశీలించబోం
ABN , Publish Date - Jan 07 , 2026 | 03:37 AM
కృష్ణా జలాల పంపకాలు జరగనందున ఆ బేసిన్ పరిధిలో ఏ ప్రాజెక్టు డీపీఆర్‌ను మదింపు చేసే అవకాశాల్లేవని కృష్ణా నది యాజమాన్య బోర్డు.....
కృష్ణా జలాల పంపకాలు జరగకపోవడమే కారణం
సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు లేకపోతే మదింపు చేయం
విభజనకు ముందు ప్రాజెక్టుల పర్యవేక్షణ మాత్రమే మా బాధ్యత
ప్రాజెక్టులు, రాష్ట్రాలవారీ నీటి కేటాయింపులపై విచారణ జరుగుతోంది
బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు వచ్చేవరకూ బచావత్ తీర్పే అమలు
కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పిన కృష్ణా బోర్డు.. ఏపీ ఫిర్యాదుకు స్పందన
హైదరాబాద్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల పంపకాలు జరగనందున ఆ బేసిన్ పరిధిలో ఏ ప్రాజెక్టు డీపీఆర్‌ను మదింపు చేసే అవకాశాల్లేవని కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) స్పష్టం చేసింది. ప్రాజెక్టుల వారీగా, రాష్ట్రాల వారీగా నీటి కేటాయింపులపై విచారణ జరుగుతున్నందున డీపీఆర్‌లను పరిశీలించే అవకాశాలు లేనేలేవని తేల్చి చెప్పింది. రాష్ట్రాలవారీగా నీటి కేటాయింపులు లేకపోయినా.. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014ను ఉల్లంఘించి ప్రాజెక్టుల సామర్థ్యాలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం డీపీఆర్‌లు సిద్ధం చేసిందని, ముందుకెళ్లకుండా దానిని నిలువరించాలని కేంద్ర జలశక్తి శాఖ, కృష్ణా బోర్డుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. శ్రీశైలం ప్రాజెక్టు కేంద్రంగా ఏపీ భారీగా ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతుండగా.. దీనికి కౌంటర్‌గా జూరాల ప్రాజెక్టు కేంద్రంగా భారీ ప్రాజెక్టులను చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జూరాల ప్రాజెక్టు కేంద్రంగా 247 టీఎంసీల ప్రాజెక్టులతోపాటు 16 ప్రాజెక్టుల డీపీఆర్‌లు సిద్ధం చేయడానికి వీలుగా గత ఏడాది సెప్టెంబరులో జీవో నం.34ను జారీ చేసి, దానిని, ఆయా ప్రాజెక్టుల సూక్ష్మ సమాచారాన్ని బ్రిజే్‌షకుమార్ ట్రైబ్యునల్ (కృష్ణా ట్రైబ్యునల్-2)లో అందించింది. ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రైబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలు; పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు ఏపీ తరలించే 80 టీఎంసీలకు బదులుగా సాగర్‌కు ఎగువన ఉన్న రాష్ట్రాలు ఆ మేరకు నీటిని వినియోగించుకోవచ్చుననే స్వేచ్ఛతో కేటాయించిన దానిలో 45 టీఎంసీలను కూడా కలుపుకొని 1050 టీఎంసీలపై ప్రస్తుతం వాదనలు జరుగుతున్నాయి. పాత ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, భవిష్యత్‌లో కట్టే ప్రాజెక్టులను కూడా కలుపుకొని 904 టీఎంసీలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
ఇక, శ్రీశైలం కేంద్రంగా ప్రస్తుతం 40 టీఎంసీలతో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కెనాల్ (ఎస్‌ఎల్‌బీసీ), 90 టీఎంసీలతో పాలమూరు-రంగారెడ్డి, మరో 30 టీఎంసీలతో డిండి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులు జరుగుతుండగా.. జూరాల కేంద్రంగా 247 టీఎంసీల ప్రాజెక్టులను చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కలకలం సృష్టించింది. ఈ మొత్తం పరిణామాలపై కేంద్రానికి ఏపీ ఫిర్యాదు చేసింది. దీంతో, కేంద్రానికి సంజాయిషీ ఇస్తూ కేంద్ర జలశక్తి శాఖలోని జలవనరులు, నది అభివృద్ధి, గంగా పునరుజ్జీవన విభాగం సీనియర్ జాయింట్ కమిషనర్‌కు కృష్ణా బోర్డు మంగళవారం లేఖ రాసింది. ‘‘2014 జూన్ 2వ తేదీ (ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలు) నాటికి అప్పటికే పూర్తైన లేదా చేపట్టిన ప్రాజెక్టుల నీటి లభ్యతపై ప్రతికూల ప్రభావం చూపకుండా పర్యవేక్షించే బాధ్యత మాత్రమే బోర్డుకు ఉంటుంది. జస్టిస్ బ్రిజే్‌షకుమార్ ట్రైబ్యునల్ రాష్ట్రాలు/ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసేదాకా కృష్ణా ట్రైబ్యునల్-1 (బచావత్) తీర్పు మాత్రమే అమల్లో ఉంటుంది. 2021లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ ప్రకారం.. అనుమతి లేని ప్రాజెక్టులన్నీ ఏడాదిలోపు క్లియరెన్స్‌లు పొందకపోతే వాటిని పక్కనపెట్టాల్సి ఉంటుంది. నీటి కేటాయింపులు లేకపోవడం, సీడబ్ల్యూసీ మార్గదర్శకాలకు అనుగుణంగా అందని డీపీఆర్‌లను పరిశీలించే అవకాశాలు లేవు’’ అని ఆ లేఖలో స్పష్టం చేసింది.