Share News

ఈసారీ ప్లీనరీ లేదు.. రాష్ట్ర స్థాయి ప్రతినిధుల భేటీనే

ABN , Publish Date - Apr 27 , 2026 | 04:51 AM

బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీఎత్తున ప్లీనరీ ఉంటుందని భావించిన గులాబీ శ్రేణులకు నిరాశే ఎదురైంది. పార్టీ అధినేత ఆదేశాల మేరకు....

ఈసారీ ప్లీనరీ లేదు.. రాష్ట్ర స్థాయి ప్రతినిధుల భేటీనే

  • ఆహ్వనం ఉన్నవారే రావాలి: కేటీఆర్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీఎత్తున ప్లీనరీ ఉంటుందని భావించిన గులాబీ శ్రేణులకు నిరాశే ఎదురైంది. పార్టీ అధినేత ఆదేశాల మేరకు, ఈ ఏడాది వేడుకలను కేవలం రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు మాత్రమే పరిమితం చేశారు. ఇటీవలే జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించిన నేపథ్యంలో, అదేవిధంగా తీవ్రమైన ఎండల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వెల్లడించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు, రాష్ట్ర కార్యవర్గ సమావేశంపై కేటీఆర్‌ ఆదివారం పార్టీనేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ అధ్యక్షతన సోమవారం తెలంగాణ భవన్‌లో చేపట్టే ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లకు మాత్రమే ఆహ్వానం ఉందని స్పష్టం చేశారు. మిగిలిన నాయకులు, కార్యకర్తలు తమ నియోజకవర్గాల్లోనే పార్టీ జెండాలను ఆవిష్కరించి, వేడుకలు జరుపుకోవాలని సూచించారు. దీంతో, ప్లీనరీలో కొత్త కమిటీల నియామకం, పార్టీలోనైనా కీలక పదవుల భర్తీ ప్రకటనలు ఉంటాయని భావించినవారికి.. అధిష్ఠానం నిర్ణయం అసంతృప్తికి గురిచేసింది. కాగా, ముఖ్యమంత్రి సహా కొంతమంది నేతలు తమకు సరైన గుర్తింపు రావడంలేదని కేసీఆర్‌ పై విమర్శలు చేస్తూ కాలం గడుపుతున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. ఆయనను నాలుగు మాటలు అని పైశాచికానందం పొందితే.. వార్తల్లో వస్తామన్న తాపత్రయంతోనే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీనేత పిల్లుట్ల రఘు హుజూర్‌ నగర్‌ నియోజక వర్గానికి చెందిన పలువురితో కలిసి ఆదివారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. రెండున్నరేళ్లుగా ఢిల్లీకి మూటలు మోయడం తప్ప రేవంత్‌రెడ్డి చేసిందేమీ లేద న్నారు.

Updated Date - Apr 27 , 2026 | 04:51 AM