Minister D. Sridhar Babu: ఇప్పుడు మేల్కొనకపోతే మరో ఢిల్లీలా హైదరాబాద్
ABN , Publish Date - Jan 07 , 2026 | 04:05 AM
హైదరాబాద్ నగరంలో కాలుష్యం పెరిగిపోతోందని, ఇప్పుడే మేల్కొనకపోతే ఏదో ఒకరోజు ఢిల్లీలా మారుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు...
ఇప్పటికే కాలుష్యం పెరిగిపోతోంది.. పరిశ్రమలను తరలించకుంటే చరిత్రాత్మక తప్పిదం
ప్రతి ఇల్లూ ఓ ఆస్పత్రిలా మారుతుంది
భవిష్యత్‌తరాల ఆరోగ్యానికి పునాదే ‘హిల్ట్’
అత్యంత పారదర్శకంగా ఈ పాలసీ
అవి ప్రభుత్వ భూములు కాదు.. పరిశ్రమలవే..సర్కారెలా అమ్ముతుంది
బీజేపీ, బీఆర్‌ఎ్‌సలవి పూర్తిగా తప్పుడు ఆరోపణలు: శ్రీధర్‌బాబు
హైదరాబాద్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగరంలో కాలుష్యం పెరిగిపోతోందని, ఇప్పుడే మేల్కొనకపోతే ఏదో ఒకరోజు ఢిల్లీలా మారుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. హైదరాబాద్ నగరంలో కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) అవతలికి తరలించకపోతే చరిత్రలో అతిపెద్ద తప్పు చేసినట్టేనని పేర్కొన్నారు. ఈ క్రమంలో భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, వాతావరణాన్ని అందించేందుకే ‘హైదరాబాద్ పారిశ్రామిక భూముల బదలాయింపు (హిల్ట్)’ విధానాన్ని తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు. ఇది కేవలం భూముల బదలాయింపు మాత్రమే కాదని, రాబోయే తరాల కోసం వేసే ఆరోగ్యకరమైన పునాది అని పేర్కొన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు మంగళవారం శాసనసభలో హిల్ట్ పాలసీని మంత్రి ప్రవేశపెట్టి మాట్లాడారు. ‘‘గతంలో నగరం చివరన ఉన్న బాలానగర్, సనత్‌నగర్, ఉప్పల్, జీడిమెట్ల, చర్లపల్లి ప్రాంతాలను పరిశ్రమల కోసం ప్రత్యేక జోన్లుగా కేటాయించారు. గత 50 ఏళ్లలో హైదరాబాద్ ఊహించని విధంగా విస్తరించింది. పరిశ్రమల చుట్టూ లక్షలాది కుటుంబాలు నివసించే కాలనీలు వెలిశాయి. ఫ్యాక్టరీల విషపూరిత పొగ ఇళ్లలోకి వస్తోంది. ఇది పెను ప్రమాదానికి ఆహ్వానం పలకడమే. భోపాల్ గ్యాస్ లీకేజీ, విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ ఘటనలు అలాంటి ప్రమాదాలకు సజీవ సాక్ష్యాలు. హైదరాబాద్ నగరంలో పారిశ్రామిక ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో ప్రమాదకరమైన భార లోహాలు (లీడ్, మెర్క్యురీ, ఆర్సెనిక్) స్థాయులు ఉండాల్సిన దాని కంటే 1,000 శాతం ఎక్కువగా ఉన్నాయి. పారిశ్రామిక రసాయన వ్యర్థాలే ఈ దుస్థితికి కారణం. దీనివల్ల రాబోయే తరాల్లో ‘జన్యు ఉత్పరివర్తనాలు’ వచ్చే ప్రమాదముందని పలు శాస్త్రీయ అధ్యయనాలు తేల్చాయి. ఇప్పటికైనా మనం మేల్కొనకపోతే ఏదో ఒక రోజు హైదరాబాద్ కూడా ఢిల్లీలా మారడం ఖాయం. అదే జరిగితే ప్రతి ఇల్లూ ఒక ఆస్పత్రి అవుతుంది. పిల్లలకు బొమ్మలు, పుస్తకాలు కొనిచ్చినట్టుగానే నెబ్యులైజర్లు కొనివ్వాల్సి వస్తుంది’’ అని శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఈ విధానం కొత్తదేమీ కాదని, ఉమ్మడి రాష్ట్రంలో 2013లోనే పరిశ్రమలను ఓఆర్‌ఆర్ అవతలికి తరలించేందుకు జీవో జారీచేసిందని గుర్తు చేశారు. ఈ పాలసీ విషయంలో తమ ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తోందని, ఎలాంటి అనుమానాలకు తావులేదని స్పష్టం చేశారు. ఈ పాలసీ కింద మార్పు చేసే భూములు ఆయా పరిశ్రమల యజమానులవేనని, వారికే హక్కులు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. భూముల మార్పిడి స్వచ్ఛందమేనని, ప్రభుత్వం ఎవర్నీ బలవంత పెట్టబోదని చెప్పారు. భూములను కన్వర్షన్ చేసుకోవాలనుకునే పరిశ్రమల యజమానులు 6 నెలల్లో ‘టీజీ-ఐపాస్’ పోర్టల్ ద్వారా ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ మద్దతు ఉంటుందని, కానీ వారు ప్రజల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. పారిశ్రామికవేత్తలకు ఏ ఇబ్బందీ లేకుండా అన్ని సౌకర్యాలను ఓఆర్‌ఆర్ అవతల కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
బీఆర్‌ఎస్- బీజేపీ రహస్య దోస్తీ
హైదరాబాద్‌లో కాలుష్యం నియంత్రణే లక్ష్యంగా తీసుకొస్తున్న హిల్ట్ పాలసీపై బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని శ్రీధర్‌బాబు ఆరోపించారు. ప్రభుత్వం భూములను అమ్ముకునేందుకు కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారని.. ప్రస్తుతమున్న పరిశ్రమల భూములన్నీ ఆయా పారిశ్రామికవేత్తల భూములేనని, వాటిని ఎలా విక్రయిస్తారనే ఆలోచన కూడా లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పరిశ్రమల తరలింపు కోసం 2013లో ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం జీవో ఇస్తే.. తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏకంగా లీజు భూములపై హక్కులు కల్పించేలా జీవోలు తీసుకువచ్చిందని గుర్తు చేశారు. ‘గ్రిడ్‘ పాలసీ పేరిట ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేేసందుకు కూడా ప్రయత్నించిందని.. అప్పుడు బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య రహస్య దోస్తీ కొనసాగుతోందని.. సభలో ఏం మాట్లాడాలనేదానిపై వారు బయటే మాట్లాడుకుని వస్తున్నారని పేర్కొన్నారు.
బంగారు గిన్నెలో విషం ఉంటోంది!
అభివృద్ధి పేరిట జరుగుతున్న పర్యావరణ విధ్వంసం గురించి మనం ఒక్క నిమిషమైనా ఆలోచిస్తున్నామా అని మంత్రి ప్రశ్నించారు. గాలి, నీరు కలుషితమైతే తర్వాతి తరాలవారికి ‘బంగారు గిన్నెలో విషం ఇచ్చి తాగమన్నట్టు ఉంటుంద’ని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే భవిష్యత్ తరానికి స్వచ్ఛమైన వాతావరణాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం ‘హిల్ట్’ పాలసీతో చరిత్రాత్మక మార్పు వైపు మొదటి అడుగు వేసిందని చెప్పారు. రాబోయే తరాల కోసంవేస్తున్న ఆరోగ్యకరమైన పునాది అని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరాలున్న చైనాలో చేపట్టిన బ్లూస్కై ప్రొటెక్షన్ ప్లాన్‌తో ఐదేళ్లలోనే అక్కడ 30-40శాతం కాలుష్యం తగ్గిందని.. అలా హైదరాబాద్‌లో పర్యావరణ అసమత్యులతను సరిదిద్దే శస్త్రచికిత్సనే హిల్ట్ పాలసీ అని వివరించారు.
హిల్ట్ భూములపై పారదర్శకత ఉండాలి: అక్బరుద్దీన్
హిల్ట్ పాలసీ కింద భూముల మార్పిడి పారదర్శకంగా ఉండాలని.. కేవలం పెద్ద కంపెనీలు, రియల్ ఎస్టేట్ దిగ్గజాలకు మాత్రమే లాభం కలగకూడదని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ సూచించారు. పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలికి తరలించిన తర్వాత ఆ భూములను ప్రజల సామాజిక అవసరాలకు కూడా కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇక ఆదిలాబాద్, ఖమ్మం లాంటి మారుమూల జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక పాలసీని తీసుకొచ్చి రాయితీలు అందించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు ఇచ్చేవారని, 2014-15 తర్వాత ఆగిపోయాయని గుర్తుచేశారు. వెనుకబడిన జిల్లాల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు.
పారిశ్రామికంగా తెలంగాణ అగ్రగామి
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా 5.77లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు: మంత్రి దుద్దిళ్ల
పారిశ్రామిక రంగంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలపడానికి పకడ్బందీ ప్రణాళికలతో కార్యాచరణ రూపొందించినట్టు పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి డి.శ్రీధర్‌బాబు తెలిపారు. ఇటీవల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 సందర్భంగా పరిశ్రమలు, విద్యుత్, పర్యాటక తదితర రంగాల్లో 5.77 లక్షల కోట్లు పెట్టుబడులకు అవగాహన ఒప్పందా(ఎంవోయూ)లు కుదుర్చుకున్నట్టు చెప్పారు. 2047నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించినట్టు పేర్కొన్నారు. శాసనమండలిలో మంగళవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు బల్మూర్ వెంకట్, భానుప్రసాదరావు, అంజిరెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి శ్రీధర్‌బాబు సమాధానం ఇచ్చారు.