kumaram bheem asifabad- ఇక ప్రాదేశిక పోరు
ABN , Publish Date - Feb 20 , 2026 | 11:04 PM
స్థానిక సంస్థల్లో కీలకమైన గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఇక అందరి దృష్టి ప్రాదేశిక పోరుపైకి మళ్లింది. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా త్వరలోనే జరిగే అవకాశం ఉందన్న సంకేతాలతో జిల్లాలోని ప్రధాన పార్టీలు పోరుకు సన్నద్ధమతున్నాయి.
- ముందస్తు వ్యూహాల్లో ప్రఽధాన పార్టీల నాయకులు
- జిల్లాలో 15 జడ్పీటీసీ, 127 ఎంపీటీసీ స్థానాలు
చింతలమానేపల్లి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల్లో కీలకమైన గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఇక అందరి దృష్టి ప్రాదేశిక పోరుపైకి మళ్లింది. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా త్వరలోనే జరిగే అవకాశం ఉందన్న సంకేతాలతో జిల్లాలోని ప్రధాన పార్టీలు పోరుకు సన్నద్ధమతున్నాయి. ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆసిఫాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్‌ల పీఠాలను దక్కించుకున్నది. కాగజ్‌నగర్‌లో మాత్రం కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠం, వైస్ చైర్మన్ పీఠాన్ని బీఆర్‌ఎస్ కౌన్సిలర్‌ల మద్దతుతో బీజేపీ దక్కించుకుంది. పంచాయతీ ఎన్నికల్లో సైతం ప్రధాన పార్టీల నుంచి సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లుగా గెలుపొందారు. రాష్ట్ర స్థాయిలో అత్యధికులు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో ఈ ఎన్నికల్లోనూ ప్రజలు తమ పార్టీనే ఆదరిస్తారనే భావనతో ప్రభుత్వం మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు భావిస్తున్నారు. మరో వైపు ఇంటర్, పదో తరగతి పరీక్షలు వేసవి కాలన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా ఎన్నికలను త్వరగా నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ పంచాయతీ ఎన్నికలకంటే ముందే పరిషత్ ఎన్నిక లకు సిద్ధమైనా రిజర్వేషన్ల విషయంలో ఏర్పడిన వివాదం నేపథ్యంలో నాటి నోటిఫికేషన్ ను సుప్రీంకోర్టు నిలిపి వేసింది. దీంతో 50 ఽశాతం సీట్లు బీసీలకు పంచాయతీ, మున్సిపల్ రిజర్వేషన్ల పద్ధతిలోనే మండల, జిల్లా పరిషత్ పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించి తద్వారా లబ్ధి పొందాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్ర స్థాయిలో వరుస ఎన్నికల్లో వరుస ఓటములతో బీఆర్‌ఎస్, బీజేపీ కొంత దెబ్బ తిన్నాయి. ఆ పార్టీలు తిరిగి కోలుకోకముందే జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదో తరగతి పరీక్షలు న్నాయి. ఈ పరీక్షలలోపు మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
- జిల్లాలో 335 పంచాయతీల పరిధిలో..
జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు, 127 ఎంపీటీసీ, 15 జడ్పీటీసీ స్థానాలున్నాయి. గతంలో రిజర్వేషన్ల ప్రక్రియలో అధికంగా బీసీలకు కేటాయించడంతో జనరల్ స్థానాలు తగ్గాయి. కానీ రిజర్వేషన్ల మార్పులో బీసీ రిజర్వుడ్ సీట్లు తగ్గించి 50శాతం లోపు రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉండేలా మళ్లీ నిర్ణయం తీసుకోనుంది. మిగిలిన 50శాతం జనరల్‌కు కేటాయించడం ద్వారా జనరల్ స్థానాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలు పోటీ చేసే అవకాశం లభించనుంది. ఈ పరిణామాలు దృష్టిలో ఉంచుకొని 50శాతం రిజర్వేషన్ సుప్రీం కోర్టు ఆదేశాలు పాటిస్తూ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది.
- ఆశావహుల ప్రయత్నాలు..
త్వరలోనే జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్న నేపథ్యంలో పోటీలో ఉండే ఆశవహులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు. నాయకుల దృష్టిలో పడి ఎలాగైనా టికెట్ తెచ్చుకొని పోటీలో ఉండి గెలుపొందాలని ఆశలు పెట్టుకున్నారు. గ్రామాల్లో సైతం ఓటర్లను ప్రసన్నం చేసుకునే యత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే గతంలో పదవులు అనుభవించిన వారు ప్రయత్నాలు చేస్తుండగా కొత్తవారు సైతం తాము పోటీలో ఉంటామని చెబుతున్నారు. మొత్తానికి అనుకూలంగా రిజర్వేషన్లు వచ్చి ఎన్నికలు మొదలైతే గ్రామాల్లో సందడి మొదలు కానుంది. కాగా జిల్లాలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ మొన్న జరిగిన ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను దక్కించుకోగా, కాగజ్‌నగర్‌లో బీఆర్‌ఎస్ పార్టీ చైర్మన్ దక్కించు కోలేకపోయినా ఓట్లను అధికంగానే రాబట్టింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా కేంద్రంలో మున్సిపల్ పీఠాన్ని చేజార్చుకుంది. కాగజ్‌నగర్‌లో మాత్రం బీజేపీ సభ్యుల మద్దతుతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. బీఆర్‌ఎస్ పార్టీ సభ్యుల మద్దతుతో వైస్ చైర్మన్ పదవీ బీజేపీ దక్కించుకుంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు వ్యవహరించిన తీరుపై పరిషత్ ఎన్నికల్లో ప్రజలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.