Share News

మేకప్పే చిన్నబోయేంత అందం

ABN , Publish Date - Jul 05 , 2026 | 05:33 AM

ఇటీవల వచ్చిన ఓ సినిమా.. హీరోయిన్‌ పరిచయ సన్నివేశం.. అమ్మ పిలవగానే హీరోయిన్‌ దుప్పటిలోంచి తల బయటపెట్టి గారాలు పోతుంటుంది.

మేకప్పే చిన్నబోయేంత అందం

  • నో మేకప్‌ లుక్‌ కోసం నవతరం తపన

  • కొరియన్‌ గ్లాసీ స్కిన్‌ లుక్‌ కోసం ప్రయత్నాలు

  • సహజమైన అందం అనిపించేలా ప్రయత్నాలు

  • సీరమ్‌లు, హైల్యూరినిక్‌ యాసిడ్‌, ఆయిల్‌ ఉత్పత్తులతో చర్మంపై ప్రయోగాలు

  • ఈ తరహా మేకప్‌ కోసం వేల రూపాయల ఖర్చు

  • అది అందరికీ నప్పదంటున్న బ్యూటీషియన్లు

  • చర్మ సమస్యలు వస్తాయని అంటున్న డెర్మటాలజిస్టులు

హైదరాబాద్‌ సిటీ, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ఇటీవల వచ్చిన ఓ సినిమా.. హీరోయిన్‌ పరిచయ సన్నివేశం.. అమ్మ పిలవగానే హీరోయిన్‌ దుప్పటిలోంచి తల బయటపెట్టి గారాలు పోతుంటుంది. రాత్రంతా నిద్రపోయిన ఆమె ఉదయం నిద్ర లేవగానే అలా అందంగా ఎలా కనిపిస్తుంది? అదీ మేకప్‌ వేయకుండా.. సహజంగా..! కానీ నిజానికి హీరోయిన్‌కు మేకప్‌ ఉన్నా.. లేనట్టుగా.. సహజంగా కనిపించే లుక్‌.. ఇదీ ఇప్పుడు కొత్త ట్రెండ్‌. సింథటిక్‌ మెరుపులు లేకుండా సహజంగా కనిపించాలని కోరుకుంటున్న అమ్మాయిల నుంచి నలభైల్లోనూ యవ్వనంగా కనిపించాలని ఆరాటపడుతున్న మహిళల వరకూ అందరూ ఈ బాటపడుతున్నారు. కొరియన్‌ అమ్మాయిల్లా కనిపించాలంటూ.. బ్యూటీషియన్లు, సెలూన్ల వెంటపడి హైడ్రేషన్‌, బ్యారియర్‌ రిపేర్‌, స్పాట్‌ కన్సీలింగ్‌ చేయించుకుంటున్నారు. అయితే ‘నో మేకప్‌ లుక్‌’ వెనుక మేకప్‌ వేసుకోవడానికంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని.. అందులోనూ కొరియన్‌ అమ్మాయిల్లా వంకలు పెట్టలేని చర్మం ఉండటం మన వాతావరణంలో చాలా కష్టమని బ్యూటీషియన్లు, చర్మ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి తీరుతో చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

సహజ అందం అనిపించుకునేందుకు..

‘నేను మేకప్‌ వేసుకోవడం మానేశాను.. బయటికి వచ్చినప్పుడు జస్ట్‌ సన్‌స్ర్కీన్‌ వాడుతున్నాను. అయినా చర్మం ఇలా మెరవాలంటే హైడ్రేషన్‌ చాలా ఇంపార్టెంట్‌.. తెలుసా?’’.. ఇటీవలి కాలంలో పేజ్‌-3 కార్యక్రమాలు మొదలు కాలేజీలలో కార్యక్రమాల వరకూ అమ్మాయిల ముచ్చట్లు ఇలానే ఉంటున్నాయి. చూడగానే సహజమైన అందం అనిపించేలా ఉండాలన్న తపనే ఈ ధోరణికి కారణమని చెబుతున్నారు ఓ బ్యూటీ సెలూన్‌ అధినేత వెంకీ. ఇటీవలి కాలంలో ‘నో మేకప్‌’ ధోరణి పెరిగిందని అంటున్నారు. ఐటీ, ఎంఎన్‌సీ కంపెనీలలో పనిచేసే అమ్మాయిలకు పెద్దగా సమయం ఉండదుకాబట్టి.. హెవీ ఫౌండేషన్‌ వంటివి కాకుండా, స్కిన్‌ టింట్లు, లిప్‌ బామ్‌లతో సహజంగా కనిపించేలా ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ఎటొచ్చీ జెన్‌ జీ యువత మాత్రం కొరియన్‌ వెబ్‌సిరీ్‌సల మోజులో, వారి తరహా గ్లాసీ స్కిన్‌ కావాలని ఆరాటపడుతున్నారు. రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. దీనిపై జూబ్లీహిల్స్‌లోని బ్యూటీ థెరపిస్ట్‌ అనీషా మాట్లాడుతూ.. నో మేకప్‌ అంటే అసలు మేకప్‌ వేసుకోకుండా ఉండటం కాదని, అందుకోసం విభిన్నమైన మేకప్‌ ఉత్పత్తులను వినియోగిస్తూ సహజంగా కనిపించేలా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కానీ మెరిసే చర్మం కోసమంటూ రకరకాల సీరమ్స్‌ ఉపయోగిస్తుండటం, ఇతర ప్రయోగాలు చేస్తుండటం, మొటిమలు, బ్లాక్‌ స్పాట్స్‌ ఉన్న అమ్మాయిలు పలు రకాలచికిత్స పద్ధతులను అనుసరిస్తుండటం వంటివి ఖర్చును మరింత పెంచుతున్నాయని చర్మ నిపుణులు చెబుతున్నారు.


మన వాతావరణానికి సరిపడదు..

కొరియన్లలా మెరిసే చర్మం (గ్లాసీ గ్లో స్కిన్‌) అన్నారంటే సమస్యలను తెచ్చుకున్నట్టేనని డెర్మటాలజిస్ట్‌ దివ్య చెప్పారు. ‘‘మన వాతావరణానికి, ఇక్కడివారి చర్మతత్వానికి కొరియన్‌ ఉత్పత్తులు సరిపడవు. మెరిసే చర్మమంటూ వాడే ఆయిల్‌, సీరమ్‌ లేయర్లపై కలుషితాలు పేరుకుపోయి, స్వేద గ్రంధులు పూడుకుని ఇతర సమస్యలు రావొచ్చు. మా దగ్గరకు వస్తున్న అమ్మాయిల్లో చాలా మంది ఇలా నో మేకప్‌ ఉత్పత్తులు వాడి చర్మం పాడు చేసుకున్న వారే. అంతేకాదు తాము కోరుకున్న గ్లాసీ స్కిన్‌ రావడం లేదంటూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు’’ అని తెలిపారు. గ్లాసీ స్కిన్‌ అనేది మార్కెటింగ్‌ మాయాజాలమే తప్ప మన చర్మానికి సరిపడదని స్పష్టం చేశారు.

Updated Date - Jul 05 , 2026 | 05:33 AM