Telangana Government: పరిశ్రమల తరలింపు, విస్తరణకు భూమి కొరత లేదు
ABN , Publish Date - Jan 07 , 2026 | 04:02 AM
హైదరాబాద్ పారిశ్రామిక భూముల బదలాయింపు(హిల్ట్)-2025 విధానం కింద ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్) బయటికి తరలివెళ్లే పరిశ్రమలకు భూమికొరత లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఓఆర్‌ఆర్ చుట్టూ 8,248 ఎకరాల టీజీఐఐసీ భూమి
సేకరణ ప్రక్రియలో మరో 10,882 ఎకరాలు
నైపుణ్యాభివృద్ధి కోసం కొత్త ఏటీసీలు
తరలివెళ్లే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు
‘హిల్ట్’ విధానంలో వెల్లడించిన ప్రభుత్వం
హైదరాబాద్, జనవరి 6(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ పారిశ్రామిక భూముల బదలాయింపు(హిల్ట్)-2025 విధానం కింద ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్) బయటికి తరలివెళ్లే పరిశ్రమలకు భూమికొరత లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఓఆర్‌ఆర్‌కు 100 కిలోమీటర్ల పరిధిలో టీజీఐఐసీకి చెందిన 8,248 ఎకరాల భూమి ఉందని తెలిపింది. మేడ్చల్- మల్కాజిగిరి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో ఈ భూములు ఉన్నట్లు వెల్లడించింది. వీటికితోడు పారిశ్రామిక అవసరాల కోసం మరో 10,882 ఎకరాల భూమి సేకరణ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చినట్టు వివరించింది. ఇవికాక భవిష్యత్తు పారిశ్రామిక అవసరాల కోసం మరో 6,884 ఎకరాల భూములను గుర్తించామని తెలిపింది. ప్రస్తుతం కోర్ అర్బన్ రీజనల్ ఎకానమీ (క్యూర్) పరిధిలో ఉన్న 22 పారిశ్రామిక పార్కులను క్ర మంగా పెరి-అర్బన్ రీజనల్ ఎకానమీ (ప్యూర్) వైపు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించింది. పరిశ్రమలకు నైపుణ్యమైన మానవ వనరులను అందించడంలో భాగంగా ఇప్పటికే 65 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీలు) ఏర్పాటు చేశామని, మరో 53 సెంటర్లు త్వరలో ప్రారంభం కానున్నాయని వివరించింది. పరిశ్రమలకు అవసరమైన రవాణా సౌకర్యాలపైనా దృష్టి సారించామని తెలిపింది. ఇలా తరలివెళ్లే పరిశ్రమలను కొత్త కంపెనీలా పరిగణించి ప్రోత్సాహకాలు అందిస్తామని వెల్లడించింది.
ఉత్పత్తుల ఆధారంగా పారిశ్రామిక పార్కులు
8 రకాల ఉత్పత్తుల కోసం 8 పార్కులను ప్రభుత్వం ప్రకటించింది. అవి..దండుమల్కాపూర్‌లో టాయ్ పార్క్, నిమ్జ్‌లో సర్క్యులర్ ఎకానమీ హబ్‌లు, బిల్డింగ్ మెటీరియల్ మేనేజ్‌మెంట్ క్లస్టర్, సిద్దాపూర్‌లో ఎకో పార్కు, అర్కతలలో ఫుడ్ పార్కు, ఎంకతలలో విద్యుత్ వాహనాల పార్కు, ఎలిమినేడులో ఏరోస్పేస్, డిఫెన్స్ పార్కు.. నాగిరెడ్డిపల్లిలో విద్యుత్ ఆధారిత పరిశ్రమల పార్కు.