మోదీ దూరదృష్టి వల్లే ఇంధన కొరత రాలేదు
ABN , Publish Date - Jul 02 , 2026 | 04:37 AM
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా దాదాపు నాలుగు నెలల పాటు హోర్ముజ్ జలసంధి మూతపడినప్పటికీ, ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టి..
సంక్షోభంలో ప్రజలకు అండగా నిలిచారు: కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ, జూలై 1 (ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా దాదాపు నాలుగు నెలల పాటు హోర్ముజ్ జలసంధి మూతపడినప్పటికీ, ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టి, ముందస్తు వ్యూహాల వల్ల దేశంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ కొరత రాలేదని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ దేశంలో ఒక్క పెట్రోల్ బంక్ కూడా ఖాళీ కాలేదని, ప్రజలకు గ్యాస్ సిలిండర్ల కొరత రాలేదని ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ మార్కెట్‌లో 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,600కి చేరినప్పటికీ, దేశ ప్రజలకు దాన్ని సుమారు రూ.900కే అందుబాటులో ఉంచామని వివరించారు. కరోనా మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ప్రస్తు పశ్చిమాసియా సంక్షోభం వంటి అంతర్జాతీయ సవాళ్లు ఎదురైనా.. దేశ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలు కోట్లాది మంది భారతీయులకు రక్షణ కవచంగా నిలిచాయని కిషన్ రెడ్డి కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పటికీ, కేంద్రప్రభుత్వం దేశ ప్రజల ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యం ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ సంక్షోభ సమయంలో దేశ ఇంధన భద్రతను కాపాడటం, పరిస్థితులు మెరుగుపడగానే ప్రజలకు ఊరట కల్పించడం ఎన్డీయే ప్రభుత్వ సుపరిపాలనకు నిదర్శనమని కిషన్‌రెడ్డి కొనియాడారు.