కొనుగోళ్ల సమస్యతో..రైతులెవరూ చనిపోలేదు!
ABN , Publish Date - May 22 , 2026 | 03:53 AM
బీఆర్‌ఎస్ అంటేనే అబద్ధాల పార్టీ అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల సమస్యతో పది మంది రైతులు మృత్యువాత పడ్డారన్న...
కేటీఆర్ వ్యాఖ్యలు పచ్చి అబద్ధం: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, మే 21 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ అంటేనే అబద్ధాల పార్టీ అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల సమస్యతో పది మంది రైతులు మృత్యువాత పడ్డారన్న బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ మాటల్లో అణువంతైనా నిజం లేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై కేటీఆర్ రాసిన లేఖపై గురువారం స్పందించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు రైతులెవరూ చనిపోలేదని మంత్రి ఉత్తమ్ చెప్పారు. 2025-26 యాసంగి సీజన్‌కు సంబంధించి.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన 8,575 కొనుగోలు కేంద్రాలకు 54.29 లక్షల టన్నుల ధాన్యం వచ్చిందని, ఇప్పటివరకు 46.21 లక్షల టన్నులు కొనుగోలు చేశామని వెల్లడించారు. ఈ ధాన్యానికి సంబంధించి 6.30 లక్షల మంది రైతులకు రూ.7,841 కోట్లు చెల్లించామని వివరించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు 13 వేల వాహనాలు వినియోగిస్తున్నామని చెప్పారు. కానీ కేటీఆర్ మాత్రం రైతులను తప్పుదోవ పట్టించేలా లేఖ రాశారని ఉత్తమ్ మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పాలనలో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు, మిల్లర్లతో లాలూచీతో చెల్లింపుల్లో ఆలస్యం జరిగిన అంశాలను ఎవరూ మర్చిపోలేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ధాన్యం దిగుబడి, కొనుగోళ్లలో సరికొత్త రికార్డులు నమోదవుతుండటాన్ని తట్టుకోలేక కేటీఆర్ అక్కసు వెళ్లగక్కారని విమర్శించారు. రైతుకు గిట్టుబాటు ధర, సాగునీటి సరఫరాకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు.