విద్యుత్ టారిఫ్‌ల పెంపు ఉండదు
ABN , Publish Date - Mar 07 , 2026 | 03:38 AM
వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో విద్యుత్ టారిఫ్‌ల పెంపు ఉండబోదని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటివరుణ్‌రెడ్డి తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఎన్పీడీసీఎల్ ఆదాయ అవసరాలు...
వచ్చే ఆర్థిక సంవత్సరమూ పాతవే:టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ
రాంనగర్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో విద్యుత్ టారిఫ్‌ల పెంపు ఉండబోదని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటివరుణ్‌రెడ్డి తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఎన్పీడీసీఎల్ ఆదాయ అవసరాలు, విద్యుత్ ధరల ప్రతిపాదనలపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్‌లో బహిరంగ విచారణ నిర్వహించింది. ఈ విచారణలో వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ.. పరిశ్రమల్లోని టైం ఆఫ్ డే ధరల్లో సైతం ఎలాంటి మార్పు ఉండదని చెప్పారు. ఎన్పీడీసీఎల్‌కు రూ.12,521 కోట్ల రెవెన్యూ లోటు ఉందని, దీనిని పూడ్చుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో మద్దుతు కావాలని కమిషన్‌ను కోరారు. భారత్ కిసాన్ సంఘ్ నాయకుడు రాము మాట్లాడుతూ.. ఈఆర్‌సీ సమావేశాల నిర్వహణకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి వినియోగదారుల సమస్యలు తెలుసుకోవాలని విన్నవించారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని, ఆఫ్ సీజన్ పీరియడ్ నిబంధనను సవరించాలని తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి కోరారు. సబ్‌స్టేషన్ల ఆపరేటర్లును నియమించాలని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాలలో 132 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి జలగం ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు.