కేసీఆర్, హరీశ్‌కు క్లీన్‌చిట్ ఇవ్వలేదు
ABN , Publish Date - Apr 23 , 2026 | 04:56 AM
జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోరాదని హైకోర్టు ఆదేశించిందని, ప్రాజెక్టులో అవకతవకలకు బాధ్యులైన కేసీఆర్, హరీశ్‌రావుకు క్లీన్ చిట్ ఇవ్వలేదని....
ఘోష్ కమిషన్ ఏర్పాటును హైకోర్టు సమర్థించింది.. కమిషన్ నిగ్గు తేల్చిన అంశాలపైనా అభ్యంతరాల్లేవు
సీబీఐ విచారణకు హైకోర్టు తీర్పు అడ్డంకి కాదు: మంత్రి ఉత్తమ్
సీబీఐ విచారణకు ముందుకు రండి: మంత్రి పొంగులేటి
ఆలస్యమైనా శిక్ష తప్పదు: మహేశ్ గౌడ్
నివేదికను కోర్టు తప్పు పట్టలేదు: చామల
హైదరాబాద్/న్యూఢిల్లీ, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోరాదని హైకోర్టు ఆదేశించిందని, ప్రాజెక్టులో అవకతవకలకు బాధ్యులైన కేసీఆర్, హరీశ్‌రావుకు క్లీన్ చిట్ ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. విచారణ కమిషన్ నియామకాన్ని హైకోర్టు పూర్తిగా సమర్థించిందని, కమిషన్ నిగ్గు తేల్చిన అంశాలను కూడా తప్పుపట్టలేదని గుర్తు చేశారు. కాళేశ్వరం నివేదికపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో బుధవారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. పిటిషనర్లకు నిర్ణీత ఫార్మాట్ ప్రకారం నోటీసులు ఇవ్వలేదనే కారణంగా వాళ్లపై కమిషన్ చేసిన సిఫారసులను పరిగణనలోకి తీసుకోవద్దని హైకోర్టు తెలిపిందని, ఇది పూర్తిగా సాంకేతిక అంశమని తెలిపారు. ఈ తీర్పు సీబీఐ విచారణకు అడ్డంకి కాబోదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మానవ తప్పిదమని, దేశంలోనే అతిపెద్ద విధ్వంసమని, అమూల్యమైన ప్రజాధనం వృథా అయిందన్నారు. దీనికి బాధ్యులైన వారిని ప్రజల ముందు నిలబెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తీర్పు కాపీ వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బ్యారేజీ దెబ్బతినడానికి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి కేసీఆర్ సొంత నిర్ణయాలే కారణమని, ఈ వ్యవహారంలో మరో సూత్రధారి హరీశ్ అని విమర్శించారు. కాగా, కాళేశ్వరంలో అవినీతే జరగలేదంటున్న బీఆర్‌ఎస్ నేతలు..నిజంగా నిర్దోషులైతే సీబీఐ విచారణకు ముందుకు రావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. విచారణ జరిగితే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయన్న భయంతోనే వెనుకడగు వేస్తున్నారని, బీజేపీతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని విమర్శించారు. మేడిగడ్డ కుంగిపోవడం, పంప్‌హౌ్‌సలు నీట మునగడం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి నిదర్శనాలని పేర్కొన్నారు. నమ్మక ద్రోహానికి పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టే వరకూ ప్రభుత్వం వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు.
కాగా, కాళేశ్వరం అవినీతిపై పోరాటంలో రాజీపడే ప్రసక్తేలేదని టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పుతో దోషులకు శిక్ష పడడం కాస్త ఆలస్యమవుతుందేమో గానీ.. శిక్ష పడక తప్పదని హెచ్చరించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేపట్టాలన్న డిమాండ్‌తో ఢిల్లీలో ధర్నా చేస్తామని తెలిపారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్, హరీశ్‌రావు ప్రమేయం లేదని హైకోర్టు చెప్పలేదని, క్లీన్‌చిట్ ఇవ్వలేదని, బీఆర్‌ఎస్ ఎందుకు సంబరాలు చేసుకుంటుందో అర్థం కావడం లేదని అన్నారు. ఘోష్ నివేదికను హైకోర్టు తప్పు పట్టలేదని, విధానపరమైన లోపాలు ఉన్నాయనే చెప్పిందని గుర్తు చేశారు. ఘోష్ కమిషన్ నివేదికను హైకోర్టు తప్పు పట్టకపోయినా.. బీఆర్‌ఎస్ నేతలు సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కోర్టు తీర్పు కాపీ వచ్చిన తర్వాత ఏవిధంగా ముందుకు వెళ్లాలన్నదానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. సరిగ్గా ఈ సమయంలోనే ఢిల్లీకి వెళ్లిన హరీశ్.. కాళేశ్వరం విషయంలో మంతనాలు ఏమైనా చేశారా? అని అనుమానాలు వ్యక్తం చేశారు. కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్‌కు సంబంధం లేదని కోర్టు చెప్పిందా? అని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివా్‌సరెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరంలో అవినీతే జరగలేదన్నట్లుగా బీఆర్‌ఎస్ నేతలు వ్యవహరిస్తుండడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ కుటుంబ అవినీతి బయటపడకుండా కేంద్రంలోని బీజేపీ రక్షణ కల్పిస్తోందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. కాళేశ్వరం విషయంలో హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ అన్నారు. కోర్టు తీర్పు బీఆర్‌ఎ్‌సకు అనుకూలంగా రాలేదని, తాత్కాలికంగా చర్యలు తీసుకోవద్దనే అందులో ఉందని ప్రభుత్వవిప్ అద్దంకి దయాకర్ అన్నారు. బీజేపీతో కలిసిపోతే.. చేసిన తప్పులు మాఫీ అవుతాయని హరీశ్ భావిస్తున్నాడని విమర్శించారు. కానీ, తప్పు చేసిన వారు తప్పించుకోలేరని అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం అవినీతిలో ప్రధాన ముద్దాయి హరీశేనని, ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని చనగాని దయాకర్ సూచించారు.