ఎంబీబీఎస్ సీట్లపై పరిమితి ఎత్తివేత
ABN , Publish Date - Apr 29 , 2026 | 06:37 AM
నూతన వైద్య కళాశాలల ఏర్పాటు, వాటిలో సీట్ల కేటాయింపునకు అవరోధంగా మారిన నిబంధనలను జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) సవరించింది.
జనాభా ప్రాతిపదికన పద్ధతికి స్వస్తి
గరిష్ఠంగా 150 సీట్లు, 10 లక్షల జనాభాకు 100 సీట్ల పరిమితి నిబంధనల తొలగింపు
వైద్య కళాశాల, బోధనాస్పత్రి మధ్య దూరం10 కి.మీ.లోపు ఉండాలి.. ఎన్‌ఎంసీ కీలక నిర్ణయం
గెజిట్ నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): నూతన వైద్య కళాశాలల ఏర్పాటు, వాటిలో సీట్ల కేటాయింపునకు అవరోధంగా మారిన నిబంధనలను జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) సవరించింది. ఈ మేరకు మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధానంగా ప్రతి 10 లక్షల జనాభాకు 100 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉండాలనే నిబంధనను పూర్తిగా ఎత్తివేసింది. దీంతో ఇప్పటికే ఎక్కువ సీట్లు ఉన్న తెలంగాణ, ఏపీ వంటి రాష్ట్రాల్లో మరిన్ని కొత్త కాలేజీలు రావడానికి, ఉన్నవాటిలో సీట్లు పెరగడానికి మార్గం సుగమమైంది. సీట్లు పెంచుకోవాలనుకునే కాలేజీలకు ఉన్న 150 సీట్ల గరిష్ఠ పరిమితిని కూడా తొలగించింది. తద్వారా మౌలిక సదుపాయాలు ఉన్న కాలేజీలు తమ సామర్థ్యాన్ని బట్టి సీట్లు పెంచుకునే అవకాశం లభించింది. వైద్య కళాశాల, దాని అనుబంధ బోధనా ఆస్పత్రి మధ్య దూరం విషయంలోనూ మార్పులు చేసింది. గతంలో రెండిటి మధ్య ప్రయాణ సమయం గరిష్ఠంగా 30 నిమిషాలు ఉండాలనే నిబంధన ఉండేది. ట్రాఫిక్ చిక్కుల వల్ల దీనిని లెక్కించడం కష్టమని భావించిన ఎన్‌ఎంసీ.. ఇకపై వాటి మధ్య దూరం గరిష్ఠంగా 10 కిలోమీటర్లు మాత్రమే ఉండాలని స్పష్టం చేసింది. కొండ ప్రాంత రాష్ట్రాల్లో మాత్రం ఈ దూరాన్ని 15 కిలోమీటర్ల వరకు సడలించింది. వైద్య విద్యను సామాన్యులకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో నిబంధనల్లో ఈ సవరణలు చేసినట్టు ఎన్‌ఎంసీ వర్గాలు పేర్కొన్నాయి.