Share News

మెడికల్‌ సీట్ల భర్తీకి ముగింపు లేదా?

ABN , Publish Date - Mar 24 , 2026 | 05:10 AM

వైద్య విద్య సీట్ల భర్తీ ప్రక్రియ ‘ముగింపు లేని అంశం’గా మారుతోందని జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) సుప్రీంకోర్టు ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది.

మెడికల్‌ సీట్ల భర్తీకి ముగింపు లేదా?

  • అంతులేని ప్రక్రియగా కౌన్సెలింగ్‌

  • హైకోర్టుల జోక్యంతో గందరగోళం

  • మిగిలిన 377 సీట్లకు విద్యార్థులు ఆసక్తి చూపటం లేదు.. ఎన్‌ఎంసీ వాదనలు

  • డాక్యుమెంట్లు, గత తీర్పులు పరిశీలిస్తామన్న ధర్మాసనం

న్యూఢిల్లీ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్య సీట్ల భర్తీ ప్రక్రియ ‘ముగింపు లేని అంశం’గా మారుతోందని జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) సుప్రీంకోర్టు ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. కౌన్సెలింగ్‌ గడువును పొడిగిస్తూ, కటాఫ్‌ పర్సంటైల్‌ను తగ్గిస్తూ వివిధ రాష్ట్రాల హైకోర్టులు ఇస్తున్న వరుస ఉత్తర్వులపై అభ్యంతరం తెలిపింది. నిబంధనల ప్రకారం ముగియాల్సిన ప్రక్రియ కోర్టుల జోక్యంతో నిరంతర ప్రక్రియగా మారుతోందని పేర్కొంది. ‘తెలంగాణ ప్రైవేట్‌ మెడికల్‌ అండ్‌ డెంటల్‌ కాలేజ్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌’, ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ మెడికల్‌ అండ్‌ డెంటల్‌ కాలేజ్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌’ దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్‌ పమిడిఘంటం శ్రీనరసింహ, జస్టిస్‌ ఆలోక్‌ ఆరాధేలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఎన్‌ఎంసీ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. మెడికల్‌ సీట్ల కేటాయింపు అంశంలో వివిధ హైకోర్టుల ఉత్తర్వులు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(పీజీఐఎంఈఆర్‌) నిబంధనలకు విరుద్ధమన్నారు. గతేడాది డిసెంబరులో ప్రారంభమైన కౌన్సెలింగ్‌ ప్రక్రియ నేటికీ కొనసాగుతోందని గుర్తుచేశారు. ఫిబ్రవరి 25న కర్ణాటక హైకోర్టు జోక్యం చేసుకుని మార్చి 18లోగా మరో రౌండ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఆదేశించిందని, మార్చి 12న బాంబే హైకోర్టు మరో రౌండ్‌కు అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. తెలంగాణ హైకోర్టు సైతం కటాఫ్‌ పర్సంటైల్‌ తగ్గింపు అంశాన్ని పరిశీలిస్తోందన్నారు. ఇప్పటికే ఐదు నుంచి ఎనిమిది రౌండ్ల కౌన్సెలింగ్‌ పూర్తయిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇంకా 377 సీట్లు మిగిలిన మాట వాస్తవమేనని.. అవన్నీ విద్యార్థులు ఆసక్తి చూపని (డిమాండ్‌ లేని) సబ్జెక్టులకు సంబంధించినవని స్పష్టం చేశారు. ఎన్‌ఎంసీ వాదనల నేపథ్యంలో ధర్మాసనం.. ఒకవైపు సీట్లు వృథాకావడం, మరోవైపు కౌన్సెలింగ్‌ ప్రక్రియ నిరవధికంగా సాగడం అనే రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుంది. ఈ పరిస్థితిలో ‘ఉత్తమంగా ఏం చేయగలం?’ అని న్యాయవాదులను ప్రశ్నించింది. సంబంధిత డాక్యుమెంట్లు, గత సుప్రీంకోర్టు తీర్పులను పరిశీలిస్తామని తెలిపింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

Updated Date - Mar 24 , 2026 | 05:10 AM