Share News

మెడికల్‌ పీజీ డిప్లొమా కోర్సులు రద్దు

ABN , Publish Date - Jun 23 , 2026 | 03:24 AM

దేశంలో వైద్య విద్యను మరింత బలోపేతం చేసే దిశగా నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌...

మెడికల్‌ పీజీ డిప్లొమా కోర్సులు రద్దు

  • ఇకపై అన్నీ పీజీ డిగ్రీ.. ఎండీ, ఎంఎస్‌ కోర్సులే

  • వైద్య విద్యలో కీలక మార్పు చేసిన ఎన్‌ఎంసీ

దేశంలో వైద్య విద్యను మరింత బలోపేతం చేసే దిశగా నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ (పీజీ) డిప్లొమా కోర్సులను పూర్తిగా రద్దు చేస్తూ.. వాటి స్థానంలో పీజీ డిగ్రీ (ఎండీ/ఎంఎస్‌) కోర్సులను తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎన్‌ఎంసీ కార్యదర్శి డాక్టర్‌ రాఘవ్‌ లంగర్‌ దేశంలోని అన్ని మెడికల్‌ కాలేజీలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుత 2026-27 విద్యా సంవత్సరమే పీజీ డిప్లొమా అడ్మిషన్లకు చివరి సంవత్సరం కానుంది. వచ్చే విద్యా సంవత్సరం (2027-28) నుంచి ఈ డిప్లొమా కోర్సులు ఉనికిలో ఉండవు. ప్రస్తుతం చాలా వైద్య కళాశాలల్లో ఒకే స్పెషాలిటీకి సంబంధించి అటు డిప్లొమా, ఇటు డిగ్రీ కోర్సులు సమాంతరంగా సాగుతున్నాయి. అయితే ఈ కాలేజీల్లో డిగ్రీ కోర్సులకు అవసరమైన ఫ్యాకల్టీ, క్లినికల్‌ మెటీరియల్‌, ఇతర మౌలిక సదుపాయాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నందున.. డిప్లొమా సీట్లన్నింటినీ డిగ్రీ సీట్లుగా మార్చడమే ఉత్తమమని కమిషన్‌ నిర్ణయించింది. ఈ కీలక మార్పు వల్ల పీజీ పూర్తి చేసే వైద్యులకు జాతీయ స్థాయిలోనే కాకుండా.. అంతర్జాతీయ స్థాయిలోనూ మెరుగైన గుర్తింపు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎన్‌ఎంసీ అభిప్రాయపడింది. ప్రస్తుతం పీజీ డిప్లొమా కోర్సులను నడుపుతున్న మెడికల్‌ కాలేజీలు, వాటిని ఎండీ, ఎంఎస్‌ సీట్లుగా మార్చుకోవడానికి ఎన్‌ఎంసీ త్వరలో తీసుకురానున్న కొత్త పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను కమిషన్‌ త్వరలోనే విడుదల చేయనుంది.

Updated Date - Jun 23 , 2026 | 03:24 AM