Share News

నిజామాబాద్‌లో నువ్వా? నేనా?

ABN , Publish Date - Feb 10 , 2026 | 04:21 AM

నిజామాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీల మధ్య పోరు నువ్వా? నేనా? అన్నట్లు సాగుతోంది. గతంలో వరుసగా రెండుసార్లు మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకున్న బీఆర్‌ఎస్‌....

నిజామాబాద్‌లో నువ్వా? నేనా?

  • కాంగ్రె్‌స-బీజేపీ మధ్య తీవ్ర పోటీ.. మజ్లిస్‌ సీట్లే కీలకం!

  • సీట్ల ఆధిక్యం ఒకరికి, మేయర్‌ పీఠం మరొకరికి దక్కే ఛాన్స్‌

  • మజ్లిస్‌ మద్దతిస్తేనే పాలకవర్గం ఏర్పాటుకు అవకాశాలు

  • ప్రేక్షక పాత్రలో బీఆర్‌ఎస్‌.. ఒకటి, రెండు సీట్లకే పరిమితం

నిజామాబాద్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి,

నిజామాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీల మధ్య పోరు నువ్వా? నేనా? అన్నట్లు సాగుతోంది. గతంలో వరుసగా రెండుసార్లు మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకున్న బీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికల్లో ప్రేక్షక పాత్రకు పరిమితమవుతుండగా కాంగ్రెస్‌, బీజేపీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఏ పార్టీకీ మ్యాజిక్‌ ఫిగర్‌ (31) వచ్చే అవకాశం లేదని, ఏవైనా రెండు పార్టీలు కలిస్తేనే పాలకవర్గం ఏర్పాటు సాధ్యమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంఐఎం పార్టీ (మజ్లిస్‌) క్రియాశీలకం కానుంది. కాంగ్రె్‌సతో పోలిస్తే బీజేపీకి కొన్ని సీట్లు ఎక్కువొస్తాయని, అయినప్పటికీ ఎంఐఎం మద్దతుతో మేయర్‌ పీఠాన్ని కాంగ్రెస్‌ కైవసం చేసుకుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉండగా కాంగ్రెస్‌, బీజేపీ, ఎంఐఎం పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఎంఐఎం గత ఎన్నికల్లో 16 సీట్లు గెలించింది. ఈసారి కూడా 15-16 సీట్లు గెలుచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 28 సీట్లు గెలుచుకొని కార్పొరేషన్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించినా మేయర్‌ పీఠం బీజేపీకి దక్కలేదు. అప్పుడు బీఆర్‌ఎస్‌ 13 సీట్లలో గెలిచింది. ఎంఐఎం 16 సీట్లు, ఎక్స్‌ అఫీషియో ఓట్లతో కలిపి బీఆర్‌ఎస్‌ మేయర్‌ పీఠమెక్కింది. డిప్యూటీ మేయర్‌ పదవిని ఎంఐఎంకు అప్పగించింది. ఈసారి కూడా అలాంటి వాతావరణమే పునరావృతమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాకపోతే ఈసారి... బీఆర్‌ఎస్‌ స్థానంలో అధికార కాంగ్రెస్‌ ఉంటుందని, ఎంఐఎంతో కలిపి మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేవలం రెండు డివిజన్లలో గెలుపొందింది. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం కాంగ్రె్‌సకు 15 డివిజన్లలో విజయావకాశాలు ఉన్నాయి. రెండు రోజుల పోల్‌ మేనేజ్‌మెంట్‌తో 20 సీట్లకు చేరుతుందని, కాంగ్రెస్‌ ఒంటరిగా 20 సీట్లు గెలిస్తే మేయర్‌ పీఠం దక్కినట్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజామాబాద్‌ కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకోవాలంటే గత పట్టును నిలబెట్టుకోవడంతో పాటు మరో మూడు డివిజన్లలో గెలిచి తీరాలి. కాగా, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిజామాబాద్‌ పర్యటనతో కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌ గ్రాఫ్‌ మరింత పెరిగింది. పీసీసీ చీఫ్‌ మహే్‌షకుమార్‌ గౌడ్‌ ఈ కార్పొరేషన్‌ ఎన్నికల బాధ్యత తీసుకున్నారు. బీజేపీ విషయానికొస్తే మొదటినుంచీ పార్టీలో ఉన్న నేతలను కాదని ఇతర పార్టీల నుంచి వలసవచ్చిన కొందరికి ఎంపీ అర్వింద్‌ టికెట్లు ఇప్పించారని కొంత అసంతృప్తి కనిపిస్తోంది. హిందుత్వ, మోదీ ప్రభావంతో మెజారిటీ సీట్లు గెలుస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, కామారెడ్డి జిల్లా కామారెడ్డి, ఎల్లారెడ్డి, బిచ్కుంద, బాన్సువాడ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ గెలిచే అవకాశాలున్నట్లు వాతావరణం కనిపిస్తోంది. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌, ఆర్మూర్‌ మున్సిపాలిటీల్లో కాంగ్రె్‌సకు అనుకూల వాతావరణం ఉంది. భీమ్‌గల్‌లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య పోటీ తీవ్రంగా ఉంది.

Updated Date - Feb 10 , 2026 | 04:21 AM