ఆత్మాభిమానం కన్నా ఉద్యోగం ముఖ్యం కాదు!
ABN , Publish Date - Apr 12 , 2026 | 04:00 AM
రాష్ట్ర ఎక్సైజ్‌శాఖలో బదిలీల సమయంలో కమిషనర్ హరికిరణ్ తనను అవమానపరిచారంటూ నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి శనివారం సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్‌గా...
సోషల్ మీడియాలో నిజామాబాద్ డీసీ సోమిరెడ్డి పోస్ట్
చేయని తప్పునకు దూషిస్తే భరించలేకపోయానని వెల్లడి
హైదరాబాద్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎక్సైజ్‌శాఖలో బదిలీల సమయంలో కమిషనర్ హరికిరణ్ తనను అవమానపరిచారంటూ నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి శనివారం సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్‌గా, చర్చనీయాంశంగా మారింది. ‘చేతకాని, చావలేని, చైతన్యం చచ్చిపోయిన శాఖలో 30 ఏళ్లు పనిచేసినందుకు సిగ్గుతో తలదించుకుంటున్నా. ఆత్మాభిమానం కన్నా ఉద్యోగం ముఖ్యం కాదని తలచి ఉద్యోగం వీడి వెళ్లాలని బాధతో నిర్ణయించుకున్నాను’ అంటూ తన ఆవేదనను సోషల్ మీడియాలో వ్యక్తపరిచారు. ‘చేయని తప్పునకు ‘వెధవ, ఇడియట్’ అన్నప్పుడు నాలో సున్నిత మనస్తత్వం ఆ మాటను స్వీకరించలేకపోయింది. అలా అనొద్దు సార్ అన్నందుకు కమిషనర్ ఈగో హర్ట్ అయిందనుకుంటా? నా జీవితంలో ఎన్నడూ ఎదుర్కోని ఘోర అవమానం చేశారు. అక్కడే కుప్పకూలిపోయాను. మిత్రులు ఆస్పత్రికి చేర్చారని తర్వాత తెలిసింది’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి దాటాక కూడా కొనసాగిన బదిలీల ప్రక్రియ సందర్భంగా చోటు చేసుకున్నట్టు తెలిసింది.
బదిలీల జాబితా సరిగా ఇవ్వలేదు : కమిషనర్
ఈ ఘటనపై కమిషనర్ హరికిరణ్ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. తాను కేవలం విధి నిర్వహణలో జరిగిన తప్పులనే ప్రశ్నించానన్నారు. కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్ బదిలీల సీనియారిటీ జాబితా తప్పుగా తయారు చేయడంతో సరిచేసుకుని రావాలన్నా. మూడుసార్లు కూడా అవే తప్పులు చేయడంతో ‘ఇన్ని సార్లు చెబుతున్నా వెధవ పనిలాగా ఎలా చేశారు’ అని అడిగానన్నారు. నన్ను వెధవ అంటారా అని పదేపదే ప్రశ్నించారని.. దీంతో కానిస్టేబుల్ సౌమ్య మృతి ఘటనపై ఇచ్చిన షోకాజ్ నోటీసుపై ఎందుకు సమాధానం పంపలేదని ప్రశ్నించానని పేర్కొన్నారు. సౌమ్య మృతి చెందిన సమయంలో స్థానికంగా లేకున్నా.. అక్కడే ఉన్నానని అబద్ధం చెప్పడం మంచి పనా? వెధవ పనా? అని ప్రశ్నించానని వివరించారు. తనతో వాదన తర్వాత బయటకు వెళ్లి మిగిలిన వాళ్లతో కలిసి ఆందోళనకు రావాలని అడగ్గా వాళ్లెవరూ రాకపోవడం వల్ల కాసేపు బీపీతో ఊగిపోయారని, ఆయనను ఆస్పత్రిలో చేర్చాక తాను వైద్యులతో సంప్రదించానని చెప్పారు. కాగా డీసీ సోమిరెడ్డిని దూషించిన కమిషనర్‌పై విచారణకు కమిటీ ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి కోరారు. మరోవైపు నిజాయతీ గల కమిషనర్‌పై నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పానీయాల సంస్థ స్టోర్ ఉద్యోగుల సంఘం నాయకులు తెలిపారు. ఇది తమ శాఖ వ్యవహారమని, బయటి వ్యక్తులు కల్పించుకోవద్దని ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హరికిషన్ కోరారు.