రూ.1000 కూడా వదలడు..!!
ABN , Publish Date - Jun 27 , 2026 | 06:14 AM
అది వెయ్యి రూపాయలు కావొచ్చు... అంతకన్నా పెద్ద మొత్తం కావొచ్చు.. ఆదాయాన్ని మాత్రం వదులుకునే ప్రసక్తే లేదు.. నెలవారీ మామూళ్ల విషయంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో..
కల్లు డిపోల నుంచి నెలవారీ మామూళ్లు
నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అవినీతి దందా
ఎఫ్‌ఐఆర్‌లో వెల్లడించిన ఏసీబీ!
హైదరాబాద్, జూన్ 26(ఆంధ్రజ్యోతి): అది వెయ్యి రూపాయలు కావొచ్చు... అంతకన్నా పెద్ద మొత్తం కావొచ్చు.. ఆదాయాన్ని మాత్రం వదులుకునే ప్రసక్తే లేదు.. నెలవారీ మామూళ్ల విషయంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల అరెస్టయిన నిజామాబాద్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తీరు ఇది. మల్లారెడ్డికి సంబంధించిన నెలవారీ మామూళ్ల చిట్టాను ఏసీబీ అధికారులు గుర్తించారు. 1997లో ఎక్సైజ్ విభాగంలో ఎస్సైగా చేరిన మల్లారెడ్డి తన ఆదాయానికి మించి రూ.2,07,16,406 ఆస్తులు సంపాదించినట్లు వెల్లడైన నేపధ్యంలో ఈనెల 22న ఏసీబీ ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. మల్లారెడ్డిపై కేసు నమోదు చేసే సమయానికి ఆయన ఆస్తులు రూ.2,65,52,806గా ఏసీబీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఆయన ఆదాయం రూ.1,20,00,000 కాగా, ఖర్చులు రూ.61,63,600 పోనూ ఆయన సేవింగ్స్ కేవలం రూ.58,36,400 ఉండాలి. కానీ ఆయన రూ.2కోట్ల పైన అక్రమార్జనకు పాల్పడినట్లు ఏసీబీ అధికారులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అనంతరం ఈ నెల 23న మల్లారెడ్డి బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు భారీగా అక్రమాస్తులను కనుగొన్నారు. ఈ క్రమంలోనే నిజామాబాద్ జిల్లాలోని కల్లు దుకాణాల నుంచి మల్లారెడ్డి వసూలు చేసిన నెలవారీ మామూళ్ల చిట్టాను గుర్తించారు. దానిని కూడా న్యాయస్థానంలో సమర్పించినట్టు తెలిసింది. మల్లారెడ్డి మామూళ్లను ప్రతిసారి భారీగానే పెంచారని కూడా ఏసీబీ అధికారులు ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించినట్టు సమాచారం. నిజామాబాద్ డిపో-1లో రూ.15వేల మామూలును రూ.20వేలకు పెంచారని, బోర్గం గ్రామ కల్లు దుకాణం మామూలు రూ.5వేల నుంచి రూ.12వేలకు పెంచారని ఇలా అనేక కల్లు డిపోల నుంచి నెలవారీ మామూళ్లను ఆయన సేకరించారని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఆయన నెలవారీ మామూుళ్ల చిట్టాలో రూ.వెయ్యి కూడా ఉండటం గమనార్హమని ఏసీబీ అధికారులు అంతర్గత సంభాషణల్లో పేర్కొంటున్నారు.