గంజాయి స్మగ్లర్ల ఘాతుకం
ABN , Publish Date - Jan 25 , 2026 | 03:19 AM
పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో గంజాయి స్మగ్లర్లు ఘాతుకానికి పాల్పడ్డారు. తమను అడ్డుకునేందుకు యత్నించిన ఓ ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టారు.
ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టిన దుండగులు
ప్రాణాపాయ స్థితిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య
ఆమె కిడ్నీ, ప్లీహం తొలగించిన వైద్యులు
ముందుకు దూసుకెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ఆగిన కారు
ఇద్దరి అరెస్టు, మరో ముగ్గురి పరారీ.. నిజామాబాద్‌లో ఘటన
సుభా్‌షనగర్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో గంజాయి స్మగ్లర్లు ఘాతుకానికి పాల్పడ్డారు. తమను అడ్డుకునేందుకు యత్నించిన ఓ ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టారు. ఆపై, కారు రివర్స్ తీసుకునే క్రమంలో మరోమారు ఆమె మీదకు కారు ఎక్కించారు. నిజామాబాద్‌లో జరిగిన ఈ దారుణ ఘటనలో తీవ్ర గాయాలపాలైన సౌమ్య అనే ఎక్సైజ్ కానిస్టేబుల్ ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 48 గంటలు గడిస్తే కానీ సౌమ్య పరిస్థితిని అంచనా వేయలేమని వైద్యులు చెబుతున్నారు. ఎక్సైజ్ పోలీసుల కథనం ప్రకారం.. స్మగ్లర్లు గంజాయిని విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో స్థానిక ఎక్సైజ్ సీఐ స్వప్న శుక్రవారం రాత్రి నిజామాబాద్ నగర శివారులోని మాధవనగర్‌కు తన సిబ్బందితో వెళ్లారు. అక్కడ ఓ కారులో ఉన్న స్మగ్లర్లు పోలీసుల రాకను గమనించి తమ కారును వేగంగా ముందుకు నడిపించారు. దీంతో సీఐ స్వప్న, పోలీసులకు చెందిన మరో డ్రైవర్ తమ కార్లను స్మగ్లర్ల వాహనానికి అడ్డం పెట్టారు. దీంతో స్మగ్లర్లు కారు ఆపగా.. సీఐ స్వప్న, కానిస్టేబుల్ సౌమ్య తమ కారులో నుంచి దిగి దుండగులను పట్టుకునేందుకు వెళ్లారు. అయితే, స్మగ్లర్లు హఠాత్తుగా తమ కారును వారిపైకి పోనిచ్చారు. సీఐ స్వప్న తప్పించుకోగా కానిస్టేబుల్ సౌమ్యపై కారు ఎక్కించారు. తిరిగి రివర్స్ చేస్తున్న క్రమంలో మరోసారి సౌమ్యపై కారు ఎక్కగా ఆమె అక్కడే విలవిలలాడింది. మరోపక్క, స్మగ్లర్లు తమ కారులో పారిపోయే క్రమంలో అక్కడి ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు.
దీంతో ఎక్సైజ్ సిబ్బంది కారులో ఉన్న స్మగ్లర్లను పట్టుకునేందుకు యత్నించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారయ్యారు. తీవ్ర గాయాలతో విలవిల్లాడుతున్న సౌమ్యకు సీఐ స్వప్న సీపీఆర్ చేసి నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సౌమ్య పక్కటెముకలు, కిడ్నీ, ప్లీహంకు బలమైన గాయాలు అయ్యాయని గుర్తించిన వైద్యులు.. నుజ్జు అయిన ఓ కిడ్నీతోపాటు ప్లీహంను తొలగించారు. సౌమ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఇక, కానిస్టేబుల్ సౌమ్యపై కారు ఎక్కించిన ఘటనలో ఐదుగురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు.. సోఫియాఖాన్, సోహైల్‌ను అరెస్టు చేశారు. మతిన్, రహిల్, శిభా కోసం గాలిస్తున్నారు. నిందితులు సెల్ఫ్ డ్రైవింగ్ పేరిట కారును అద్దెకు తీసుకున్నట్టు గుర్తించారు. అలాగే, కారులో దొరికిన రెండు కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరైన మతిన్‌పై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయి. మరోపక్క, ఎక్సైజ్ సీఐ స్వప్నకు వ్యతిరేకంగా ఎక్సైజ్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ అసోసియేషన్ సభ్యులు నిజామాబాద్ ఎక్సైజ్ కార్యాలయం ముందు శనివారం ధర్నా చేశారు. సీఐ తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే సౌమ్యకు ఈ పరిస్థితి తలెత్తిందంటూ విధులు బహిష్కరించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ జి.సౌమ్యను కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం పరామర్శించారు. సౌమ్య వెంటిలేటర్‌పై ఉన్నారని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ 48గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచాలని వైద్యులు తెలిపారని కలెక్టర్ వెల్లడించారు. వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి మాట్లాడుతూ సౌమ్య కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు.