అందరి చూపూ.. ఆ రెండు కార్పొరేషన్లపైనే!
ABN , Publish Date - Feb 13 , 2026 | 04:58 AM
రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగినా.. అందరి చూపు నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లపైనే ఉంది.
నిజామాబాద్, కరీంనగర్‌లలో హంగ్‌కు అవకాశం.. క్యాంపులపై ఇప్పటినుంచే బీజేపీ, కాంగ్రెస్ దృష్టి
కీలకంగా మారనున్న ఇతర పార్టీలు, స్వతంత్రులు
వందకుపైగా మున్సిపాలిటీలు తమకేనని సర్వేలో తేలిందన్న కాంగ్రెస్ వర్గాలు
బీఆర్‌ఎస్ ఓటింగ్ భారీగా తగ్గిందని అంచనా
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగినా.. అందరి చూపు నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లపైనే ఉంది. ఈ రెండు కార్పొరేషన్లలో పాగా వేయాలని కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ప్రయత్నాలు.. కానీ రెండుచోట్లా హంగ్ ఏర్పడవచ్చనే అంచనాల నేపథ్యంలో అక్కడ రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నికల ఫలితాలు వెలువడకముందే క్యాంపు రాజకీయాలపై ప్రధాన పార్టీలు దృష్టిపెట్టాయి. దీనితో ఏ పార్టీ ఎత్తుగడలు ఫలిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
రెండు చోట్లా బీజేపీకే మెజారిటీ
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నా.. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్, నిజామాబాద్ లోక్‌సభ స్థానాల్లోని రెండు కార్పొరేషన్లపై బీజేపీ ప్రధానంగా దృష్టిపెట్టింది. హిందూ సెంటిమెంట్‌తో ప్రచారం చేసింది. ఇక రెండు కార్పొరేషన్లలో ముస్లిం ఓటర్లు గణనీయ సంఖ్యలో ఉండటంతో ఎంఐఎం పార్టీ తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. దీనితో మతపరంగా ఓట్లు కేంద్రీకృతం (పోలరైజ్) అయ్యాయని.. కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు కొంత గండి పడిందని, బీఆర్‌ఎస్ ఓటు బ్యాంకు పడిపోయిందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లలో మెజారిటీ డివిజన్లు బీజేపీకే దక్కే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ హంగ్ వస్తే రెండు కార్పొరేషన్లలోనూ ఎంఐఎంతో అవగాహన కుదుర్చుకుని మేయర్ పదవిని దక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ నుంచి గెలిచినవారు, స్వతంత్రులు కూడా కీలకమయ్యే అవకాశం కనిపిస్తోంది.
కాంగ్రె్‌సకు వందకు పైగా స్థానాలు
ఎన్నికల ఫలితాలపై తమ పార్టీ సర్వేలో వందకు పైగా మున్సిపాలిటీలు కాంగ్రె్‌సకే దక్కుతాయని తేలిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిజామాబాద్, కరీంనగర్‌లలో హంగ్ ఏర్పడవచ్చని పేర్కొంటున్నాయి. బీఆర్‌ఎస్ ఓటు బ్యాంకు భారీగా పడిపోనుందని, ఏ ఒక్క కార్పొరేషన్‌లోనూ ఆ పార్టీ గట్టి పోటీ ఇవ్వలేదని.. 10-15 మున్సిపాలిటీలు దక్కవచ్చని అంటున్నాయి.
కాంగ్రె్‌సకు 75-85.. బీఆర్‌ఎ్‌సకు 27-37 రాజ్‌నీతి స్ట్రాటజీస్ సర్వే అంచనా
రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలకుగాను కాంగ్రెస్ 75 నుంచి 85 వరకూ దక్కించుకునే అవకాశం ఉందని రాజ్‌నీతీ స్ట్రాటజీస్ సర్వే అంచనా వేసింది. బీఆర్‌ఎ్‌సకు 27 నుంచి 37 మున్సిపాలిటీలు దక్కవచ్చని, బీజేపీకి 1 నుంచి 5, ఎంఐఎం ఒక మున్సిపాలిటీని దక్కించుకోవచ్చని పేర్కొంది. కరీంనగర్, నిజామాబాద్‌లో హంగ్ ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటకుంటే ఎంఐఎంతో కలిసి ఈ రెండు పీఠాలను కాంగ్రెస్ చేజిక్కించుకోవచ్చని పేర్కొంది. రాజ్‌నీతీ స్ట్రాటజీస్ సర్వే అధినేత ఎర్రబెల్లి రజనీకాంత్ గురువారం ఈ వివరాలు వెల్లడించారు.