నిజామాబాద్‌లో టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ
ABN , Publish Date - Mar 19 , 2026 | 04:06 AM
నిజామాబాద్‌లో 10వ తరగతి వార్షిక పరీక్షల ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం కలకలం రేపింది. బుధవారం నిర్వహించిన సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష ప్రారంభమైన పది నిమిషాలకే ప్రశ్నపత్రం బయటకు వచ్చినట్లు సమాచారం.
ఆలూరు, మెండోర, బోధన్ కేంద్రాల్లో ఘటన
తొమ్మిది మందిపై సస్పెన్షన్ వేటు
నిజామాబాద్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నిజామాబాద్‌లో 10వ తరగతి వార్షిక పరీక్షల ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం కలకలం రేపింది. బుధవారం నిర్వహించిన సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష ప్రారంభమైన పది నిమిషాలకే ప్రశ్నపత్రం బయటకు వచ్చినట్లు సమాచారం. జిల్లాలోని ఆలూరు ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఓ ప్రభుత్వోపాధ్యాయుడు తన ఫోన్ ద్వారా ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి ఇతరులకు పంపినట్లు గుర్తించిన విద్యాశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఉదంతంపై విచారణ జరిపిన జిల్లా విద్యాధికారి పి. అశోక్.. ఆలూరు పరీక్షా కేంద్రానికి చెందిన చీఫ్ సూపరింటెండెంట్ రాజేందర్, డిపార్ట్‌మెంటల్ అధికారి విజయ్ కుమార్‌లను సస్పెండ్ చేయడంతో పాటు విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. తొ లుత ఆలూరు కేంద్రంలోనే ఘటన జరిగినట్లు భావించినప్పటికీ.. బోధన్, మెండోర పరీక్షా కేంద్రాల్లోనూ ప్రశ్నపత్రం బయటకు వచ్చినట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆయా కేంద్రాలకు చెందిన ఏడుగురు ఇన్విజిలేటర్లు పి. ఉపేందర్, ఎన్. సాగర్, పి. మమత, జి. రవీందర్, సిహెచ్. భూపతి, కె.వేణు, ఎశివనందనరావులను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా విద్యాధికారి ఉత్తర్వులు జారీ చేశారు.